రెస్టారెంట్ లో పేలిన గ్యాస్ సిలిండ‌ర్.. 31 మంది మృతి

రెస్టారెంట్ లో పేలిన గ్యాస్ సిలిండ‌ర్.. 31 మంది మృతి

చైనాలోని యిన్‌చువాన్ నగరంలోని బార్బెక్యూ రెస్టారెంట్‌లో భారీ గ్యాస్ పేలుడు సంభవించిన ఘటనలో 31 మంది మరణించారు. ఏడుగురు గాయపడ్డారని అధికారులు తెలిపారు. డ్రాగన్ బోట్ ఫెస్టివల్ సందర్భంగా   నింగ్‌క్సియా హుయ్ అటానమస్ రీజియన్ రాజధాని యిన్‌చువాన్‌లోని రద్దీగా ఉండే వీధిలో జూన్ 21 రాత్రి 8:40 గంటల సమయంలో పేలుడు సంభవించినట్టు తెలుస్తోంది. ఈ ఘటన జరిగిన వెంటనే రెస్టారెంట్ నుంచి దట్టమైన పొగలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో పేలుడు దాటికి పగిలిన గాజుల వల్ల, కాలిన గాయాలతో ప్రస్తుతం ఏడుగురు వ్యక్తులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

కేంద్ర ప్రభుత్వ అత్యవసర నిర్వహణ మంత్రిత్వ శాఖ తన సోషల్ మీడియా ఖాతాలో జూన్ 22న తెల్లవారుజామున రెస్టారెంట్‌లో సెర్చ్ అండ్ రెస్క్యూ వర్క్ పూర్తయిందని, పేలుడుకు గల కారణాన్ని తెలుసుకోవడానికి అధికారులను పంపామని తెలిపింది.

గ్యాస్ పేలుడు ఘటనపై చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ స్పందించారు. రెస్టారెంట్ల వంటి ప్రదేశాల్లో భద్రతా ఏర్పాట్లు మరింత కట్టుదిట్టంగా ఉండాలని ఆదేశించినట్లు రాయిటర్స్ పేర్కొంది. ప్రధానంగా ఎల్‌పీజీ గ్యాస్ ట్యాంక్‌లో లీకేజీ కారణంగానే ఈ పేలుడు జరిగినట్టు సమాచారం.