చైనా 10వేల మీటర్ల గొయ్యి ఎందుకు తీస్తోంది.. అక్కడ ఏం జరుగుతోంది?

చైనా 10వేల మీటర్ల గొయ్యి ఎందుకు తీస్తోంది.. అక్కడ ఏం జరుగుతోంది?

పొరుగు దేశం చైనా కుయుక్తులు అందరికీ విదితమే. రాత్రికి రాత్రే సరిదిద్ధుల వెంబడి భారీ నిర్మాణాలు చేపడుతూ.. భారత సైన్యాన్ని రెచ్చగొడుతోంది. మరోవైపు ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారిని డ్రాగన్ కంట్రీమీ ఉనికిలోకి తెచ్చిందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇలాంటి సమయాన భూమిని చీల్చుకుంటూ వేల మీటర్ల బావులు తవ్వుతూ.. ప్రపంచదేశాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.

డ్రాగన్ దేశం భూమి లోపల 10వేల మీటర్ల లోతుకు భారీ రంధ్రాన్ని తవ్వుతోంది. ఇలా భూమి లోపల 10 కిలోమీటర్ల లోతు వరకూ రంధ్రాన్ని తవ్వడం ఈ ఏడాదిలో ఇది రెండోది. మే నెలలో షింజియాంగ్‌ ప్రాంతంలోని అత్యంత కీలకమైన, వ్యూహాత్మకైన ప్రాంతంలో తవ్వకాలు ప్రారంభించింది. ఇప్పుడు సిచువాన్ ప్రావిన్స్‌లోని షెండి చువాన్కే ప్రాంతంలో 10,520 మీటర్ల లోతుకు డ్రిల్లింగ్ చేసే ప్రక్రియ మొదలుపెట్టింది. అయితే ఈ తవ్వకాలు భూమి లోపల సహజ వాయువుల వెలికితీత కోసమని నేషనల్ పెట్రోలియం కార్పొరేషన్ చెప్తోంది.  

ఈ తవ్వకాలు భూమి అడుగు భాగంలో దాదాపు 10 రాతి పొరలను చీల్చుకొంటూ కొనసాగనున్నాయి. క్రెటెషియస్‌ పొర వరకూ ఈ తవ్వకాలు చేపట్టనున్నారు. రంధ్రం చేస్తున్న ప్రాంతంలోని భూమి అడుగు భాగాన 145 మిలియన్ సంవత్సరాల కిందటి ప్రాచీన శిలలు ఉన్నట్లు చైనా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ నేపథ్యంలో షేల్ గ్యాస్ నిక్షేపాలు బయటపడతాయనే ఆశాభావంతో చైనా ప్రభుత్వం ఈ తవ్వకాలు చేపడుతోంది. అయితే ఈ తవ్వకాల ప్రభావం.. ప్రపంచంలోని అన్ని ఖండాల మీద కనిపిస్తుందని నిపుణులు చెప్తున్నారు.