గ్యాస్ పైప్ లైన్ లీకేజీ.. భారీ పేలుడులో 12 మంది మృతి

గ్యాస్ పైప్ లైన్ లీకేజీ.. భారీ పేలుడులో 12 మంది మృతి
  • మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం
  • మరో 36 మందికి తీవ్ర గాయాలు
  • పైప్ లైన్ పరిసరాల్లో భారీ ఆస్తి నష్టం
  • పార్కింగ్ లో నిలిపి ఉంచిన వందలాది కార్లు దగ్ధం

బీజింగ్: చైనాలో హుబే ఫ్రావిన్సులో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. గ్యాస్ పైప్ లైన్ పేలడంతో 12 మంది చనిపోగా మరో 35 మంది తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు ధాటికి పరిసరాల్లో భారీగా ఆస్తి నష్టం సంభవించింది. భవనాలు దెబ్బతినగా.. వాహనాల పార్కింగ్  మైదానంలో నిలిపి ఉంచిన కార్లు మంటలకు కాలి దెబ్బతిన్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే ఫైర్ ఇంజన్లు రంగంలోకి దిగి మంటలార్పే ప్రయత్నాలు చేపట్టారు. యుద్ధ ప్రాతిపదికన పైప్ లైన్ పరిసరాల్లోని వారిని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మంటలు మరింత వ్యాపించకుండా ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. 
స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 6.30 గంటల సమయంలో మధ్య చైనాలోని ఝంగ్వాన్ జిల్లా షియాన్ నగరంలో గ్యాస్ పైప్ లైన్ లీక్ కావడంతో ఒక్కసారిగా పెద్ద శబ్దంతో మంటలు వ్యాపించాయి. భారీ శబ్దాల ధాటికి సమీపంలోని భవనాలు తీవ్రంగా కంపించాయి. షియాన్ లోని యన్ హు మార్కెట్ కు సమీపంలో పేలుడు సంభవించినట్లు స్థానిక మీడియా రాస్తోంది. ప్రమాద సమయంలో చాలా మంది మార్కెట్లో కూరగాయలు కొనడం లేదా.. బ్రేక్ ఫాస్ట్ చేసే సమయం కాబట్టి ప్రమాదం గురించి అంచనాలకు అందడం లేదని.. అసలు ఎలా జరిగిందన్నది తెలియాల్సి ఉందని చెబుతున్నాయి. ప్రమాదంలో ఎక్కువ మంది చిక్కుకుని ఉంటారని.. మంటలు అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్ల స్థానిక మీడియా చెబుతోంది. మంటలన్నీ ఆర్పేశాక పూర్తి స్తాయిలో దర్యాప్తు చేస్తే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. మీడియాలో చక్కర్లు కొడుతున్న ఫోటోలు, వీడియోలు చూస్తుంటే అనేక భవనాలు నేలమట్టం అయినట్లు కనిపిస్తోంది. ప్రమాదం తీవ్రంగా ఉన్నట్లు.. అంచనాలకు అందని రీతిలో భారీ ప్రమాదం జరిగినట్లు స్పష్టం అవుతోంది.