12 దేశాల తీరును తప్పుబట్టిన డ్రాగన్​ కంట్రీ

12 దేశాల తీరును తప్పుబట్టిన డ్రాగన్​ కంట్రీ

బీజింగ్, షాంఘై: తమ దేశం నుంచి వచ్చే ప్రయాణికులపై వివిధ దేశాలు ఆంక్షలు విధించడంపై చైనా తీవ్రంగా మండిపడింది. చైనాలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న కారణంగా అక్కడి నుంచి వచ్చేటోళ్లపై మొత్తం 12 దేశాలు ఆంక్షలు విధించాయి. కరోనా నెగెటివ్​ సర్టిఫికెట్ ఉంటేనే దేశంలోకి అనుమతించనున్నట్లు పేర్కొన్నాయి. ఇలా ఆంక్షలు విధించిన దేశాల్లో ఇండియా, అమెరికా, కెనడా, ఫ్రాన్స్, జపాన్, ఆస్ట్రేలియా తదితర దేశాలు ఉన్నాయి. అయితే, ఈ ఆంక్షలపై చైనా భగ్గుమంది. తాము కూడా ఆ దేశాలకు ధీటుగా జవాబు చెప్తామని హెచ్చరించింది.

షాంఘైలో 2.5 కోట్ల మందికి కరోనా

షాంఘైలో దాదాపు 2.5 కోట్ల మందికి (70% జనాభా) కరోనా సోకిందని సీనియర్  డాక్టర్, కరోనా నిపుణుల సలహా సంఘం సభ్యుడు చెన్ ఎర్ఝెన్  తెలిపారు. జీరో కొవిడ్  పాలసీని ఎత్తేసిన తర్వాత కేసులు భారీగా పెరిగాయని చెప్పారు. మంగళవారం మీడియాతో ఆయన మాట్లాడారు. షాంఘైలో ఒమిక్రాన్ వేరియంట్​ వేగంగా వ్యాపిస్తోందని  తెలిపారు. ఇప్పటికే బీజింగ్, తియాంజిన్, చోంగ్ కింగ్, గాంగ్ ఝౌలో వైరస్  పీక్  దశకు చేరిందన్నారు. షాంఘైలోని తమ ఆస్పత్రికి రోజూ 1600 ఎమర్జెన్సీ కేసులు వస్తున్నాయని, జీరో కొవిడ్  పాలసీని ఎత్తేసే ముందున్న సంఖ్య కన్నా ఇది రెండింతలని ఆయన వివరించారు.