దేశ భూభాగంలోకి చొచ్చుకొస్తున్న చైనా, మన సముద్ర జలాలపైనా కన్నేసింది. పొరుగు దేశాల సహకారంతో ఇండియాను చుట్టుముట్టేస్తోంది. ఇప్పటికే అరేబియా సముద్రం, హిందూ మహాసముద్రాల్లోకి తన షిప్పులను పంపిన డ్రాగన్ కంట్రీ, ఇప్పుడు బంగాళాఖాతంలోకి షిప్పులను పంపి సముద్రాల లోపల డేటాను తీసుకుంటోంది. యుద్ధ నౌకలతో సర్వే చేస్తోంది. గత రెండేళ్లలో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ నేవీ (ప్లాన్), మన సముద్ర జలాల్లో తన షిప్పులను పంపి సర్వే చేస్తున్న ఘటనలు మూడింతలు పెరిగాయి. అండమాన్ నికోబార్ దగ్గర ప్లాన్ సమాచారాన్ని సేకరిస్తున్నట్టు ఈ నెల మొదట్లో ఇండియన్ నేవీ గుర్తించింది. ఆయా ప్రాంతాల్లోని సముద్ర జలాల్లో ఉప్పు శాతం, సముద్ర ప్రవాహం వంటి డేటాను ప్లాన్ సేకరిస్తోంది. దాని వల్ల సముద్ర యుద్ధాల్లో ఎదురు లేకుండా చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఐదు వార్ షిప్పులతో బంగాళాఖాతంలో సర్వే చేస్తోంది.
షియాన్01
ట్విన్ హల్ కలిగిన చిన్న స్మాల్ వాటర్ ప్లేన్ యుద్ధ నౌక ఇది. దీన్నే స్వాత్ అనీ పిలుస్తుంటారు. చైనా షిప్ సైంటిఫిక్ రీసెర్చ్ సెంటర్ తయారు చేసిన షియాన్1, 2009 నుంచి సేవలందిస్తోంది. 60 మీటర్ల పొడవున్న ఈ షిప్పు హైడ్రోగ్రాఫిక్ సర్వే (సముద్ర జలాల సర్వే) కోసం పదుల సంఖ్యలోని పరికరాలతో సర్వే చేస్తోంది. 3 వేల టన్నుల బరువుండే ఈ షిప్పు ఒక్కసారి నీళ్లలోకి దిగితే 40 రోజుల పాటు ఉండగలుగుతుంది. 15 నాట్స్ స్పీడ్‌తో 8 వేల నాటికల్ మైళ్లు ప్రయాణిస్తుంది. అండమాన్ నికోబార్ వద్ద సర్వే చేస్తున్న ఈ షిప్పును ఇండియన్ నేవీ గుర్తించింది.
జుకెఝెన్ 872 (హయాంగ్20)
దీనిని కేవలం హైడ్రోగ్రాఫిక్ సర్వే కోసమే ప్రత్యేకంగా తయారు చేసింది చైనా స్టేట్ షిప్‌బిల్డింగ్ కార్పొరేషన్ (సీఎస్ఎస్సీ). 150 మంది సిబ్బంది అందులో పనిచేస్తున్నారు. శ్రీలంకలోని కొలంబో వద్ద అది ప్రస్తుతం సర్వే చేస్తోంది. నిజానికి దీని అసలు పేరు హయాంగ్ 20. కానీ, దాని పేరును జుకెఝెన్గా మార్చింది చైనా. సివిల్ సర్వే షిప్‌గా చెబుతున్నా, షిప్లో 25 ఎంఎం ఎయిర్ డిఫెన్స్ గన్స్ ఉండడం అనుమానాలను రేకెత్తిస్తోంది. అంతేకాదు, ఇటీవల అందులోని సిబ్బంది ఆ గన్నులతో ఫైరింగ్నూ ప్రాక్టీస్ చేశారు. 20 మెజర్మెంట్ సిస్టమ్స్‌తో హిందూ మహాసముద్రం, బంగాళాఖాతం కలిసే చోట సర్వే చేస్తోంది. సబ్మెరీన్ జియోమార్ఫాలజీ, సబ్మెరీన్ సర్ఫేస్ జియోలాజికల్ సర్వే, ఓషన్ గ్రావిటీ (సముద్రంలో గురుత్వాకర్షణ), టెంపరేచర్లు, నీటిలో ఉప్పుశాతం, సాంద్రత, అలల వంటి వాటి వివరాలను తీసుకుంటోంది.
షియాంగ్యాంగోంగ్ 3 అండ్ 6
ఈ ఏడాది నవంబర్27న షియాంగ్యాంగోంగ్ 6 షిప్పు మన సముద్ర జలాలకు అతి సమీపంలో అండమాన్ నికోబార్ వద్ద కనిపించింది. అంతేగాకుండా ఈ నెల 11న 2 మీటర్ల పొడవైన ఆరు అటానమస్ అన్మ్యాన్డ్ వెహికిల్స్ (ఏయూవీ)లను మోహరించింది. వాటిని హయీ అని పిలుస్తున్నారు. ఇవి సముద్ర నీటి టెంపరేచర్లు, ఉప్పు శాతం, టర్బిడిటీ (మందం), క్లోరోఫిల్, ఆక్సిజన్ స్థాయులను లెక్కిస్తాయి. ఇంకో విషయమేంటంటే విదేశీ జలాల్లో సైంటిఫిక్ రీసెర్చ్ చేస్తున్న తమ దేశ సంస్థలకు చైనా రక్షణ శాఖ వార్నింగ్ ఇచ్చిన రెండు రోజులకే మన జలాలకు సమీపంలో చైనా ఆ షిప్పులను మోహరించింది. డిసెంబర్ 11నే షియాంగ్యాంగోంగ్ 3 షిప్పునూ మన జలాలకు సమీపంలో అధికారులు గుర్తించారు.
షియాంగ్యాంగోంగ్ 10
చైనా సెకండ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీకి చెందినది ఈ షిప్పు. గత ఏడాది జులైలోనే హిందూ మహాసముద్రంలోకి ఎంటరైంది ఈ ఓడ. దాదాపు 250 రోజుల పాటు మన జలాలకు సమీపంలో సర్వే చేయనుంది. ఇప్పటికే సర్వే కోసం ఖియాంలాంగ్2 అనే ఏయూవీని షిప్పు మోహరించింది. అమెరికా నేవీ రిపోర్టుల ప్రకారం సముద్రం లోపలికి తొమ్మిది సార్లు అది పొయ్యొచ్చింది. 257 గంటల పాటు మన జలాలను సర్వే చేసింది.
