లడఖ్‌ దగ్గర్లో చైనా సెల్ టవర్లు

లడఖ్‌ దగ్గర్లో చైనా సెల్ టవర్లు
  • లేహ్‌లోని చుషుల్‌ కౌన్సిలర్ వెల్లడి

లడఖ్: గోతికాడి నక్కలా సరిహద్దుల్లో కాచుకుని కూర్చున్న చైనా.. మరోసారి కయ్యానికి కాలుదువ్వే పని చేసింది. లడఖ్‌లో మన భూభాగానికి దగ్గర్లో సెల్ టవర్లు నిర్మించింది. ఈ విషయాన్ని లేహ్ జిల్లా చుషుల్ గ్రామానికి చెందిన కౌన్సిలర్ కుంచోక్ స్టాంజిన్ వెల్లడించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఆయన షేర్ చేశారు.

‘‘పాంగోంగ్ సో సరస్సుపై బ్రిడ్జిని కట్టిన చైనా.. ఇప్పుడు అక్కడ మూడు మొబైల్ టవర్లను నిర్మించింది. ఇవి మన దేశ భూభాగానికి చాలా దగ్గర్లో ఉన్నాయి. ఇది ఆందోళనకర విషయం కాదా? మాకు 4జీ సౌకర్యాలు లేవు. నా నియోజకవర్గంలో 11 గ్రామాలకు 4జీ ఫెసిలిటీలు ఏర్పాటు చేయలేదు” అని  కుంచోక్ స్టాంజిన్ ట్వీట్ చేశారు. మనపై నిఘా పెట్టేందుకే చైనా ఆ టవర్లను ఏర్పాటు చేసిందని అనుమానం వ్యక్తం చేశారు. ‘‘నా ప్రజల కోసం నేను గొంతెత్తుతున్నా. చైనా తమ మౌలిక సదుపాయాల ఏర్పాటులో వేగాన్ని పెంచింది. ఆ మూడు టవర్ల ఆధారంగా వాళ్లు డ్రోన్లు కూడా ఉపయోగించగలరు. వాటితో మన భూభాగాన్ని పరిశీలించగలరు” అని చెప్పారు. దీన్ని సీరియస్‌గా తీసుకోవాలని, మనం కౌంటర్ అటాక్ చేయాలని, చైనాకు దీటుగా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయాలని కోరారు.