గయ: తుపాకుల కన్నా సత్యం శక్తివంతమైనదని బౌద్ధ గురువు దలైలామా అన్నారు. 15రోజుల పర్యటనలో భాగంగా బుద్ధగయకు చేరుకున్న దలైలామా బుధవారం క్రిస్మస్ పండుగ సందర్భంగా చైనాను ఉద్దేశిస్తూ గట్టి సందేశం ఇచ్చారు. ‘మా దగ్గర సత్యం ఉంది. చైనా వద్ద తుపాకులున్నాయి. కానీ, ఎప్పటికైనా గన్ పవర్ మీద సత్యమే గెలుస్తుంది’ అని అన్నారు. చైనా కమ్యూనిస్ట్ పాలనపై టిబెటన్ బౌద్ధులు పోరాటం కొనసాగిస్తారని స్పష్టం చేశారు. చైనాలో టిబెటన్ బౌద్ధుల సంఖ్య భారీగా పెరిగిందని మూడేళ్ల కిందట ఓ సర్వే రిపోర్టు వెల్లడించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు.
‘‘సంప్రదాయకంగా చైనా బౌద్ధ దేశంగా ఉంది. అక్కడున్న వివిధ మతాలకు చెందిన వారిలో ఎక్కువ సంఖ్యలో బౌద్ధులే ఉన్నారు. అక్కడి యూనివర్సిటీల్లోనూ బౌద్ధ టీచర్లు ఉన్నారు. చైనాకు గన్ పవర్ ఉంది. సత్యమనే అద్భుతమైన శక్తి మనకుంది’ అని ఆయన అన్నారు. అహింస, కరుణ, ప్రజాస్వామ్య విధానాలు బోధించిన నలంద విశ్వవిద్యాలయాన్ని ఉదహరిస్తూ ప్రాచీన భారతీయ విద్యావ్యవస్థ అద్భుతమైనదని కొనియాడారు.

