జీ20 మీటింగ్​కు చైనా డుమ్మా

జీ20 మీటింగ్​కు చైనా డుమ్మా

న్యూఢిల్లీ/గౌహతి: అరుణాచల్​ప్రదేశ్​ రాజధాని ఇటా నగర్​ వేదికగా మన దేశం ఆదివారం నిర్వహించిన జీ20 సన్నాహక సమావేశానికి చైనా డుమ్మా కొట్టింది. ‘రీసెర్చ్ ​ఇన్నోవేషన్ ​ఇనీషియేటివ్ గేదరింగ్స్’ పేరిట కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ నిర్వహించిన ఈ మీటింగ్ కు అమెరికా సహా పలు జీ20 దేశాలకు చెందిన 50 మందికిపైగా ప్రతినిధులు హాజరయ్యారు. ​అనంతరం ప్రతినిధుల బృందం ఇటా నగర్ లోని అసెంబ్లీ భవనంతో పాటు ప్రాచీన బౌద్ధ క్షేత్రాన్ని సందర్శించింది.ఈ సందర్భంగా వారు అరుణాచల్​ ఆహార రుచులను కూడా ఆస్వాదించారు. ఈ మీటింగ్​ కవరేజీకి మీడియాను అనుమతించకపోవడంతో సమావేశంలో చర్చించిన అంశాలేవీ బయటికి రాలేదు. అరుణాచల్​పై భారత సార్వభౌమాధికారాన్ని చైనా అంగీకరించడం లేదు. ఆ రాష్ట్రం దక్షిణ టిబెట్​లో భాగమని డ్రాగన్ కంట్రీ ​వాదిస్తోంది.

ఈ కారణం వల్లే అరుణాచల్​ గడ్డపై నిర్వహించిన జీ20 సమావేశానికి చైనా డుమ్మా కొట్టి ఉండొచ్చని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ కోణంలో చైనా అధికారికంగా జీ20కి ఫిర్యాదు చేసిందా ? లేదా ? అనేది తెలియరాలేదు. మే నెలలో ‘సాంస్కృతిక’ అంశాలపై జమ్మూ కాశ్మీర్​లో జీ20 మీటింగ్​ను కూడా నిర్వహించనున్నారు. అక్కడ సమావేశం నిర్వహించకుండా అడ్డుకోవాలంటూ చైనా, సౌదీ అరేబియా, టర్కీ ద్వారా పాకిస్తాన్​లాబీయింగ్​ చేయిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈసారి జీ20కి భారత్​ నేతృత్వం వహిస్తోంది.