ఫస్ట్‌‌ కార్లు ఉద్యోగులకే

ఫస్ట్‌‌ కార్లు ఉద్యోగులకే

చైనా ప్లాంట్‌‌ ఎంప్లాయీస్‌‌కు టెస్లా సర్‌‌ప్రైజ్‌‌

15 మందికి మోడల్‌‌ 3ఎస్‌‌ కార్లు గిఫ్ట్‌‌

చైనాలో ఒక్కో కారు ధర రూ. 36 లక్షలు

ఎలక్ట్రిక్‌‌ కార్లను తయారు చేసే టెస్లా కంపెనీ తమ ఉద్యోగులను సర్‌‌ప్రైజ్‌‌ చేసింది. చైనా యూనిట్‌‌లో తయారైన తొలి 15 టెస్లా మోడల్‌‌ 3ఎస్‌‌ కార్లను ఉద్యోగులకే గిఫ్టిచ్చింది. చైనాలో ప్లాంటు స్టార్ట్‌‌ చేసి ఏడాదైన సందర్భంగా ఈ బంపర్‌‌ ఆఫర్‌‌ ఇచ్చింది. వచ్చే నెలలో కస్టమర్లకు కార్లు అందించేలోపు ఇంకొంతమంది ఉద్యోగులకూ కార్లిస్తామని కంపెనీ ప్రకటించింది. షాంఘైలో 10 నెలల్లో కంపెనీ స్టార్ట్‌‌ చేసి అక్టోబర్‌‌లో ట్రయల్‌‌ ఉత్పత్తిని టెస్లా ప్రారంభించింది. గత నెలలో పెద్ద పెద్ద నగరాల్లో ట్రయల్‌‌ సెంటర్లను ఏర్పాటు చేసి ట్రయల్‌‌ రన్‌‌కు కార్లను అందుబాటులో ఉంచింది. అక్టోబర్‌‌ 25 నుంచి ఆర్డర్లను తీసుకోవడం మొదలుపెట్టింది. కార్లు ఇవ్వడానికి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సర్‌‌ప్రైజ్‌‌ అయ్యే విషయం ఇంకొకటి జరిగింది. ఓ ఉద్యోగి తన గర్ల్‌‌ఫ్రెండ్‌‌కు ప్రపోజ్‌‌ చేసి తనకు వచ్చిన కారును గిఫ్టిచ్చాడు.

తర్వాత బెర్లిన్‌‌లో..

చైనాలో టెస్లా మోడల్‌‌ 3ఎస్‌‌ కారు ధర రూ. 36 లక్షలు. ఇంపోర్ట్‌‌ చేసుకునే కారు కన్నా 2 శాతం తక్కువ ధర. చైనా సర్కారు ఈ ఎలక్ట్రిక్‌‌ కార్లకు రూ. 2.5 లక్షల సబ్సిడీ కూడా ఇస్తోంది. ట్యాక్స్‌‌ కూడా రద్దు చేసింది. అయినా చైనా మార్కెట్లకు టెస్లా కార్లు కొత్తేం కాదు. 2014 నుంచి చైనాకు కార్లను కంపెనీ ఎగుమతి చేస్తోంది. అయితే చైనాలోనే కార్లు తయారు చేస్తే ఇంకా తక్కువ ధరకు ఇవ్వొచ్చని భావించిన కంపెనీ హెడ్‌‌ ఎలాన్‌‌ మస్క్‌‌.. షాంఘైలో గతేడాది ఓ యూనిట్‌‌ను ఏర్పాటు చేశారు. అమెరికా బయట ఓ తయారీ యూనిట్‌‌ ఏర్పాటు చేసింది కూడా షాంఘైలోనే. ఈ యూనిట్‌‌లో ఏడాదికి 5 లక్షల కార్లను తయారు చేస్తామని కంపెనీ వెల్లడించింది. యూరప్‌‌లోనూ మార్కెట్‌‌ విస్తారించాలని భావిస్తున్న కంపెనీ.. త్వరలో జర్మనీలోని బెర్లిన్‌‌లోనూ ప్లాంట్‌‌ ఏర్పాటుకు ప్లాన్‌‌ చేస్తోంది.

వెలుగు వార్తలకోసం క్లిక్ చేయండి