చైనా జనాభా తగ్గింది..

చైనా జనాభా తగ్గింది..

ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం చైనా. జనాభా ఎక్కువ కావడంతో అక్కడ జననాల రేటు ఎక్కువే. కానీ 60 ఏండ్లలో తొలిసారి సీన్ రివర్సైంది. చైనాలో జనాభా పెరుగుదల తగ్గిపోయింది. 1961 తర్వాత చైనా పాపులేషన్ తగ్గడం ఇదే తొలిసారి. 2022 డిసెంబర్ నాటికి చైనా జనాభా 141,17,50,000 గా ఉంది. అంటే దాదాపు 140 కోట్లు. అంతకు ముందు ఏడాదితో పోలిస్గతే ఈ సంఖ్య 8.50 లక్షలు తక్కువని చైనా నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ వెల్లడించింది. ఇదే పరిస్థితి కొనసాగితే ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా చైనా స్థానాన్ని భారత్ భర్తీ చేయనుంది.

తగ్గిన బర్త్ రేట్

గతేడాది చైనాలో అతి తక్కువ బర్త్ రేట్ నమోదైంది. 2022లో బర్త్ రేట్ ప్రతి వెయ్యి మందికి  6.77గా ఉంది. 2021లో ఇది 7.52గా ఉంది. అంతేకాదు 1976లో చైనాలో అత్యధిక మరణాల రేటు నమోదైంది. ప్రతి వెయ్యి మందికి 7.37 మరణాలు సంభవించాయి. దీనికి తోడు 1980 నుంచి 2015 వరకు ఆ దేశం అవలంబించిన వన్ చైల్డ్ పాలసీ జనాభా తగ్గేందుకు కారణమైంది. ఈ విధానం కొన్నేండ్లకు వికటించింది. చైనా జనాభాలో వృద్ధుల సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. పని చేసే యువత సంఖ్య భారీగా తగ్గిపోయింది. దీంతో ప్రభుత్వం సింగిల్ చైల్డ్ పాలసీని రద్దుచేసింది. అయినా ఎలాంటి ఫలితాలు లేకపోవడంతో 2021లో ముగ్గురు పిల్లల పాలసీని తీసుకొచ్చింది. 

ఒక్కరే చాలంటున్న పేరెంట్స్

ప్రభుత్వం పాలసీలో మార్పులు చేసినా తల్లిదండ్రులు మాత్రం సింగిల్ చైల్డ్ కు మాత్రమే ప్రాధాన్యమిచ్చారు. ముఖ్యంగా ఎడ్యుకేషన్ కాస్ట్ పెరిగిపోవడంతో చాలా మంది పేరెంట్స్ ఒక్క సంతానంతోనే సరిపెట్టుకుంటున్నారు. ఇక మూడేళ్ల పాటు చైనా అవలంబించిన జీరో కోవిడ్ పాలసీ కూడా ప్రస్తుత పరిస్థితికి కారణమని నిపుణలు అంటున్నారు. 2021 నుంచి స్థానిక ప్రభుత్వాలు జనాభా పెరుగుదలకు చర్యలు చేపట్టాయి. ఇందులో భాగంగా ఒకరికి మించి సంతానం ఉన్నవారికి టాక్స్ డిడక్షన్, మెటర్నిటీ లీవ్స్ పొడగింపు, ఇంటి నిర్మాణం కోసం సబ్సిడీలు ఇస్తున్నాయి. అయినా అవేవీ ఫలితం చూపలేకపోయాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే 2100 నాటికి చైనా ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.