హిమాచల్, గుజరాత్ ఎన్నికల్లో పోటీ చేయనున్న లోక్ జనశక్తి పార్టీ

హిమాచల్, గుజరాత్ ఎన్నికల్లో పోటీ చేయనున్న లోక్ జనశక్తి పార్టీ

త్వరలో జరగనున్న గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ)  పోటీ చేస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ ప్రకటించారు. అయితే పోటీ చేసే సీట్ల సంఖ్యపై పార్టీ ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. అభ్యర్థుల జాబితాపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని  ఆయన స్పష్టం చేశారు. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీకి నవంబర్ 12న ఒకే దశలో పోలింగ్ జరగనుంది . డిసెంబర్ 8న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. గుజరాత్ ఎన్నికల తేదీలను ఎన్నికల సంఘం ఇంకా ప్రకటించలేదు.  

ఈ ఎన్నికల తరువాత భవిష్యత్తులో ఇతర రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లోనూ తమ పార్టీ బలంగా ఉన్న చోటల్లా అభ్యర్థులను నిలబెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నామని పాశ్వాన్ చెప్పారు. తమ  పార్టీ ఏదైనా కూటమిలో చేరాలా వద్దా అనేది సమయం వచ్చినప్పుడు నిర్ణయం తీసుకుంటామన్నారు. దివంగత నేత రామ్‌ విలాస్ పాశ్వాన్‌కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్‌తో కూడిన ఆరు తీర్మానాలను జాతీయ కార్యవర్గ సమావేశంలో ఏకగ్రీవంగా ఆమోదించినట్లు పాశ్వాన్ తెలిపారు. ఆయన చేసిన సేవలను గౌరవించి  కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీ  ఆయనకు భారతరత్న ఇవ్వాలని ఎల్‌జేపీ  డిమాండ్‌ చేస్తోంది.