- రాళ్లను డైమండ్స్అని అంటగట్టింది
- ముంబై తీసుకెళ్లి మాయం చేసింది
- చీటింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు
పర్వతగిరి, వెలుగు : గుప్తనిధులు ఎక్కడున్నాయో తనకు తెలుసని, తవ్వితే వజ్రాలు బయటపడతాయని నమ్మించి ఒకరిని మోసం చేసిందో కాంగ్రెస్ పార్టీకి చెందిన మండల నాయకురాలు. తాను మోసపోయానని ఆలస్యంగా గుర్తించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆమెతో పాటు సహకరించిన వారిపై పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. పర్వతగిరి ఎస్సై దేవేందర్ కథనం ప్రకారం..వరంగల్జిల్లా పర్వతగిరి మండలం ఏనుగల్లుకు చెందిన తొర్రి పద్మ అనే కాంగ్రెస్ మండల నాయకురాలు భట్టు తండాకు చెందిన బాదావత్ బాలాజీకి గుప్త నిధుల ఆశ కల్పించింది. కొన్ని చోట్ల తవ్వాలంటూ లక్షల్లో వసూలు చేసింది. మరికొన్ని రోజులకు ఒకచోట నిధి ఉన్నట్టు తెలిసిందని, బయటకు తీయాలంటే మరింత ఖర్చవుతుందని నమ్మబలికింది.
ఇలా ఈ ఏడాది మే నెల నుంచి పలుమార్లు బాలాజీ దగ్గర సుమారు రూ.10 లక్షలకు పైగా కాజేసింది. కొన్ని రోజులకు వజ్రాలను పోలిన 21 రాళ్లను కవర్లో పెట్టి బాలాజీకి ఇచ్చింది. ఇక్కడ అమ్మడం సాధ్యం కాదని, ముంబైలో అయితే రేటు వస్తుందని చెప్పి తీసుకువెళ్లింది. వెంట పద్మ భర్త కుమారస్వామి, హైదరాబాద్కు చెందిన శివరాత్రి వెంకటేశ్వర్లు, ఏనుగల్లుకే చెందిన అనిల్ వెళ్లారు. వీరంతా అక్కడ కారులో ప్రయాణిస్తుండగా వజ్రాలు ఉన్న కవర్ను మాయం చేశారు. ఈ విషయం తెలుసుకున్న బాలాజీ తన డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశాడు. డబ్బులు అడిగితే తన కొడుకును కిడ్నాప్ చేశావని కేసు పెడతానని బెదిరించింది. దీంతో బాలాజీ గురువారం పోలీసులకు ఫిర్యాదు చేయగా, నలుగురిపై చీటింగ్ కేసు నమోదు చేశారు.
