
చిత్రదుర్గ: కర్ణాటకలోని చిత్రదుర్గ పట్టణంలో వర్షిత అనే డిగ్రీ విద్యార్థిని హత్య కేసులో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. హత్యకు గురైన వర్షిత 8 నెలల గర్భంతో ఉందని పోలీసుల విచారణలో తేలింది. అంతేకాదు.. ఆమెను చంపిన తన బాయ్ ఫ్రెండ్ క్యాన్సర్ పేషెంట్ అని తేలడంతో విస్తుపోవడం పోలీసుల వంతైంది. వర్షిత సగం కాలిన డెడ్ బాడీ దొరకడంతో కర్ణాటకలో ఈ ఘటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. వర్షిత కేటీ అనే 20 ఏళ్ల యువతి కర్ణాటకలోని చిత్రదుర్గ పట్టణంలో ఉన్న గవర్నమెంట్ ఉమెన్స్ కాలేజ్లో బీఏ సెకండియర్ చదువుతోంది. ఎస్సీ/ఎస్టీ హాస్టల్లో ఉంటూ చదువుకుంటోంది. ఆగస్ట్ 14న హాస్టల్లో లీవ్ లెటర్ సబ్మిట్ చేసి వెళ్లిన ఆమె ఆ తర్వాత తిరిగి రాలేదు. ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ వచ్చింది. ఆమె ఎక్కడుందో ఎవరికీ తెలియలేదు.
ఆమె తల్లిదండ్రులైన జ్యోతి, తిప్పేస్వామికి సమాచారం ఇవ్వడంతో పోలీస్ స్టేషన్కు వెళ్లి వర్షిత కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. ఈ క్రమంలో.. చిత్రదుర్గలోని NH-48 సమీపంలో సగం కాలిన స్థితిలో ఒక అమ్మాయి మృతదేహం కనిపించింది. పోలీసులు వర్షిత తల్లిదండ్రులకు సమాచారం అందించి ఆ మృతదేహం వర్షితదో.. కాదో గుర్తుపట్టాలని చెప్పారు. ఆ మృతదేహం వర్షితదేనని ఆమె తల్లిదండ్రులు చేతికి ఉన్న పచ్చబొట్టు ఆధారంగా గుర్తుపట్టారు. వర్షిత గురించి ఆరా తీయగా.. చేతన్ అనే యువకుడితో ఆమె ప్రేమలో ఉన్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.
చేతన్ను అదుపులోకి తీసుకుని పోలీసుల తమదైన శైలిలో విచారించగా ఆమెను తానే చంపేసినట్లు అంగీకరించాడు. గంగావతిలో ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేసే తనకు, వర్షితకు రెండేళ్లుగా పరిచయం ఉందని.. ప్రేమించుకున్నామని చేతన్ చెప్పాడు. అయితే.. తనకు క్యాన్సర్ థర్డ్ స్టేజ్ అని తెలిసి తనను వర్షిత దూరం పెట్టిందని చేతన్ తెలిపాడు. కొన్ని నెలల నుంచి వర్షిత మరొక యువకుడితో సన్నిహితంగా ఉందని తనకు తెలిసిందని పోలీసులకు వివరించాడు. ఆ యువకుడితో వర్షిత పలుమార్లు శారీరకంగా కలవడంతో గర్భం దాల్చిందని తెలిపాడు. వర్షిత గర్భవతి అయిన సంగతి ఆమె తల్లిదండ్రులకు తెలిసి.. పెళ్లి చేసుకోవాల్సిందిగా తనపై ఒత్తిడి తెచ్చారని చేతన్ చెప్పాడు. ఈ పరిణామాలతో వర్షితపై కక్ష పెంచుకున్న చేతన్ తనను చంపేసి ఆమె మృతదేహాన్ని పెట్రోల్ పోసి తగలబెట్టాడు. చిత్రదుర్గ పట్టణంలో వర్షిత హత్య తీవ్ర కలకలం రేపింది.