
- నల్గొండ జిల్లా చిట్యాల తహసీల్దార్
చిట్యాల, వెలుగు : భూమిని మ్యుటేషన్ చేసేందుకు రూ. 10 లక్షలు డిమాండ్ చేసి.. మొదటి విడత కింద రూ. 2 లక్షలు తీసుకున్న నల్గొండ జిల్లా చిట్యాల తహసీల్దార్ కృష్ణను ఏసీబీ ఆఫీసర్లు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ నల్గొండ ఇన్‌చార్జి డీఎస్పీ బాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం... చిట్యాల మండలం గుండ్రాంపల్లికి చెందిన ఓ రైతు 172, 167 సర్వే నంబర్లలో ఉన్న తన వ్యవసాయ భూమి మ్యుటేషన్ కోసం తహసీల్దార్ గుగులోతు కృష్ణను కలవడంతో అతడు రూ. 10 లక్షలు డిమాండ్ చేశాడు. అంత ఇవ్వలేనని రైతు చెప్పగా.. చివరకు రూ.5 లక్షలకు ఒప్పందం కుదిరింది. తర్వాత సదరు రైతు ఏసీబీ ఆఫీసర్లను కలిసి ఫిర్యాదు చేశాడు.
వారి సూచనతో గురువారం రూ. 2 లక్షలు తీసుకొని రైతు చిట్యాల తహసీల్దార్ ఆఫీస్‌కు వచ్చి కృష్ణను కలిశాడు. ఆఫీస్‌లోనే పనిచేసే ఓ ప్రైవేట్ వ్యక్తి రమేశ్‌కు డబ్బులు ఇవ్వాలని తహసీల్దార్ సూచించడంతో రైతు రమేశ్‌ను కలిసి డబ్బులు ఇచ్చాడు. అతడు ఆ డబ్బులను తీసుకెళ్లి తహసీల్దార్ కృష్ణకు ఇచ్చాడు. అప్పటికే అక్కడ ఉన్న ఏసీబీ ఆఫీసర్లు తహసీల్దార్‌తో పాటు ప్రైవేట్ వ్యక్తి అయిన రమేశ్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇద్దరినీ అదుపులోకి తీసుకొని నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీ వెల్లడించారు. ఈ దాడిలో ఏసీబీ ఇన్‌స్పెక్టర్లు వెంకట్‌రాం, కిషన్ పాల్గొన్నారు.