రాష్ట్రంలో కోటి ఎకరాలకు సాగునీరు అందించడమే సీఎం కేసీఆర్ లక్ష్యం

రాష్ట్రంలో కోటి ఎకరాలకు సాగునీరు అందించడమే సీఎం కేసీఆర్ లక్ష్యం

చొప్పదండి నియోజకవర్గం లోని ప్రతి చెరువు చివరి ఆయకట్టు వరకు నీరు అందేలా చూడడమే ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్య ఉద్దేశమని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ తెలిపారు. మంగ‌ళ‌వారం స‌మ‌గ్ర వ్య‌వ‌సాయ ప్ర‌ణాళిక రూపక‌ల్ప‌న కార్య‌క్ర‌మంలో భాగంగా మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కోటి ఎకరాలకు సాగు నీరు అందించడమే ముఖ్యమంత్రి కేసీఆర్ గారి లక్ష్యం అని తెలిపారు.

చొప్పదండి నియోజకవర్గంలో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా గాయత్రి (లక్ష్మీపూర్) పంపుహౌస్ నిర్మించడం,లక్ష్మీపూర్ పంపుహౌస్ ద్వారా నారాయణ పూర్ జలాశయానికి ఒకవైపు,మద్యమానేరు జలాశయానికి ఒకవైపు రెండు వైపులా నీళ్ళను పంపిస్తున్నారని ఎమ్మెల్యే  అన్నారు. మధ్యమానేరు జలాశయం నుండి రాష్ట్ర నాలుగు దిక్కులా నీళ్ళు వెళ్ళడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు.

గతంలో రైతులు నీళ్ళు లేక తమకు సరిపడినంత పంటనే పండించేవారు కానీ, నేడు సీఎం కేసీఆర్ అపర భగీరథ ప్రయత్నం వల్ల భూమికి బరువయ్యే పంటలు పండుతున్నాయని చెప్పారు రవిశంకర్ . నిండు ఎండాకాలం సైతం చెరువులు మత్తడి దుంకడం కేసీఆర్ గారి అపర భగీరథ ప్రయత్నానికి, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ ప్రతిఫలానికి నిదర్శనమ‌ని అన్నారు

ఈ చెక్ డ్యాంల నిర్మాణం ద్వారా భూమిలో నీటి నిల్వలు పెరుగుతాయని, దానిద్వారా బావుల్లో చెరువుల్లో ఎప్పుడూ నీళ్లు ఉంటాయని ఆయ‌న‌ అన్నారు. కేవలం మూడు సంవత్సరాల్లో సుమారు 80వేల కోట్లతో కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసి సుమారుగా కోటి మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి రావడానికి  కార‌ణం కేసీఆర్ గారి భగీరథ ప్రయత్నమేన‌ని అన్నారు.

కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ ను అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమ‌ని చెప్పారు. రైతుబంధు పథకం ద్వారా ఎకరానికి సంవత్సరానికి 10,000 రూపాయలు అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ అని, దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇంత పెద్ద ఎత్తున రైతు సహాయం అందించడం లేద‌ని అన్నారు. రైతు బీమా పథకం ద్వారా రైతులకు రాష్ట్ర ప్రభుత్వమే భీమా చెల్లించి రైతు ఏదైనా ప్రమాదంలో చనిపోతే ఐదు లక్షల రూపాయల ఉచిత బీమా ఇస్తున్న రాష్ట్రం కూడా తెలంగాణనే అని అన్నారు.