
మెదక్, వెలుగు : మెదక్ కెథడ్రల్చర్చి భక్తులతో కిక్కిరిసిపోయింది. పండుగకు ఆదివారం కలిసి రావడంతో తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వేడుకలకు మంత్రి సత్యవతి రాథోడ్ ముఖ్య అతిథిగా హాజరై మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డితో కలిసి క్రిస్మస్ కేక్‌కట్‌చేసి శుభాకాంక్షలు తెలిపారు. తెల్లవారు జామున శిలువ ఊరేగింపు అనంతరం మార్నింగ్ సర్వీస్ నిర్వహించారు. చలి తీవ్రంగా ఉన్నా లెక్క చేయకుండా పవిత్రమైనదిగా భావించే మార్నింగ్ సర్వీస్‌కు భక్తులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా బిషప్ భక్తులకు దైవసందేశాన్ని అందించారు. చర్చి ప్రాంగణంలోని శిలువ వద్ద భక్తులు టెంకాయలు కొట్టి అనంతరం క్రీస్తు జన్మవృత్తంతాన్ని తెలియజేసేలా చర్చిలో ఏర్పాటు చేసిన పశువుల పాకను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. చర్చి వద్ద యువతీయువకులు సెల్ఫీలు తీసుకుంటూ సందడి చేశారు. పోలీసుల పటిష్ట భద్రతతో ప్రశాంతంగా క్రిస్మస్ వేడుకలు జరిగాయి. బందోబస్తు ఏర్పాట్లను మెదక్ ఎస్పీ రోహిణి ప్రియదర్శిని పరిశీలించారు. వేడుకల్లో మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్, కౌన్సిలర్లు, వివిధ పార్టీల లీడర్లు, పాస్టరేట్ కమిటీ బాధ్యులు పాల్గొన్నారు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా...
వెలుగు, నెట్వర్క్: ఉమ్మడి మెదక్ జిల్లాలోని పలు చర్చిలలో గ్రాండ్‌గా క్రిస్మస్సెలబ్రేషన్స్ నిర్వహించారు. సిద్దిపేట పట్టణంలో మంత్రి హరీశ్‌రావు, హుస్నాబాద్‌లో ఎమ్మెల్యే వొడితెల సతీశ్ కుమార్, బెజ్జంకి మండలం గుండారంలో మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, శివ్వంపేట మండలం మగ్దుంపూర్ శివారులో ఉన్న బేతాని సంరక్షణ అనాథాశ్రమంలో నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, సంగారెడ్డిలో తెలంగాణ హ్యాండ్లూమ్ కార్పొరేషన్ చైర్మన్ చింతా ప్రభాకర్, మునిపల్లి పరిధిలోని పలు చర్చిల్లో మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, చేర్యాల మున్సిపల్ చైర్మన్ అంకుగారి స్వరూపారాణితోపాటు ఆయా ప్రాంతాల్లో పలువురు నేతలు పాల్గొని ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.