మెదక్ చర్చ్​లో..హ్యాపీ హ్యాపీ క్రిస్మస్​

మెదక్ చర్చ్​లో..హ్యాపీ హ్యాపీ క్రిస్మస్​
  • మెదక్ చర్చ్​లో కన్నుల పండువగా వేడుకలు
  • భారీగా తరలి వచ్చిన భక్తులు
  • శతాబ్ధి వేడుకలు ప్రారంభించిన బిషప్​
  • ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల ప్రార్థనలు 

మెదక్, వెలుగు : ఎల్లలు దాటి వచ్చిన భక్తులతో ఏసయ్య మందిరం జన సంద్రమైంది. క్రైస్తవుల ఆరాధ్య దైవం ఏసుక్రీస్తు పుట్టిన రోజున క్రిస్మస్​ వేడుకలు సోమవారం సుప్రసిద్ధ మెదక్​ చర్చిలో కన్నుల పండువగా జరిగాయి. తెల్లవారు జామున క్రైస్తవులు దేవుడి రూపంగా భావించే శిలువను ఊరేగింపుగా తీసుకువచ్చి చర్చిలోని ప్రధాన వేదిక మీద ప్రతిష్ఠించారు.

తర్వాత బిషప్​ పద్మారావ్​ఆధ్వర్యంలో ఫస్ట్​ ప్రేయర్​ నిర్వహించి క్రిస్మస్​ వేడుకలు ఆరంభించారు. అనతరం బిషప్​ దంపతులు కేక్​ కట్​చేసి భక్తులకు క్రిస్మస్​ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చర్చి శతాబ్ధి వేడుకల పోస్టర్​ను బిషప్,  ప్రెసిబిటరీ ఇన్‌చార్జి శాంతయ్య, పాస్టరేట్​ కమిటీ బాధ్యులతో కలిసి రిలీజ్​ చేశారు. 

పాకను దర్శించుకుని.. దీవెనలందుకుని  

సీఎస్ఐ మెదక్​ డయాసిస్​ పరిధిలోని 13 జిల్లాలతోపాటు పొరుగు రాష్ట్రాలైన కర్నాటక, మహారాష్ట్ర నుంచి సైతం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. స్థానికులు తెల్లవారు జామున జరిగే ఫస్ట్, సెకండ్​ ప్రేయర్లలో పాల్గొనగా 10 గంటల తర్వాత ఇతర ప్రాంతాల భక్తుల రాక మొదైలైంది. మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత వేలాదిగా తరలివచ్చిన భక్తులతో చర్చి పరిసరాలు కిటకిటలాడాయి. భక్తులు చర్చి ముందున్నశిలువ వద్ద కొబ్బరికాయలు కొట్టి

కొవ్వొత్తులు వెలిగించిన అనంతరం చర్చిలో క్రీస్తు జన్మవృత్తాంతాన్ని తెలుపుతూ ఏర్పాటు చేసిన పశువుల పాకను దర్శించుకుని, పాస్టర్ల దీవెనలు అందుకున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు చర్చి అందాలను చూసి ముగ్దులయ్యారు. కుటుంబ సమేంతంగా వచ్చిన వారు చర్చి ప్రాంగణంలోనే వంటలు చేసుకుని సహపంక్తి భోజనాలు చేశారు. జాయింట్​ వీల్స్​ ఎక్కి ఎంజాయ్​ చేశారు.

లోక రక్షణకే ఏసు జననం : బిషప్​ పద్మారావ్​

లోక రక్షణ కోసమే ఏసుక్రీస్తు మనిషి అవతారంలో భూమిపై జన్మించారని మెదక్​ చర్చి బిషప్​ పద్మారావ్​ అన్నారు. క్రిస్మస్​ పర్వదినం సందర్భంగా చర్చిలో జరిగిన ప్రాతకాల ఆరాధనలో పాల్గొని భక్తులకు దైవ సందేశం ఇచ్చారు. క్రీస్తును భక్తితో ఆరాధిస్తే ప్రజల కష్టాలు, పాపాలు తొలగి, చీకటి దూరమై వారి జీవితాల్లో వెలుగులు నిండుతాయన్నారు. శాంతి, సామరస్యం, సమన్యాయాలను బైబిల్​ బోధిస్తుందన్నారు.

వందేళ్లుగా మెదక్​ మహాదేవాలయం ప్రజలకు శాంతి సందేశాన్ని అందిస్తోందన్నారు. వచ్చే ఏడాది క్రిస్మస్​ నాటికి చర్చి నిర్మించి వందేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఏడాది పొడుగునా శతాబ్ధి వేడుకలు నిర్వహించాలని నిర్ణయించినట్టు బిషప్​ పద్మారావ్​ వెల్లడించారు. వందేళ్ల ప్రత్యేకతను చాటేలా డయాసిస్​ పరిధిలో వంద దేవాలయాలు నిర్మించనున్నట్టు తెలిపారు. 

ప్రభుత్వపరంగా సహకారం : మెదక్​ ఎమ్మెల్యే రోహిత్​రావ్​ 

మెదక్​ చర్చి శతాబ్ధి వేడుకలకు ప్రభుత్వపరంగా సహాయ, సహకారాలు ఉంటాయని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావ్​ చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి చర్చి శతాబ్ది వేడుకలకు హాజరయ్యేలా చూస్తానన్నారు. సోమవారం చర్చిలో జరిగిన క్రిస్మస్​ వేడుకల్లో ఆయన పాల్గొని ప్రార్థనలు చేశారు. పాస్టర్లు ఆయనకు దీవెనలు అందించి శాలువాతో సత్కరించారు. ఆ తర్వాత క్రిస్మస్​ కేక్​ కట్​ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వందేళ్ల ఘన చరిత్ర కలిగిన గొప్ప చర్చి మెదక్​లో ఉండడం విశేషమన్నారు. ఎమ్మెల్సీ శేరి సుభాష్​ రెడ్డి, మెదక్  మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్​రెడ్డి కూడా చర్చిలో జరిగిన క్రిస్మస్​ వేడుకల్లో పాల్గొన్నారు.