CAA అమలులోకి వచ్చేసింది

CAA అమలులోకి వచ్చేసింది

పౌరసత్వ సవరణ చట్టం CAA -2019కు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా నిరసనలు సాగుతూనే ఉండగా.. దాని అమలుకు కేంద్ర హోం శాఖ నోటిఫికేషన్ ఇచ్చింది. జనవరి 10 నుంచే కొత్త చట్టం అమలు చేస్తున్నట్లు నిన్న రాత్రి గెజిట్ జారీ చేసింది. పొరుగు దేశాలైన అఫ్ఘాన్, పాక్, బంగ్లాదేశ్‌లలో మత హింసకు గురవుతూ 2015కు ముందు భారత్‌లో ఆశ్రయం కోసం వచ్చిన మైనారిటీలకు పౌరసత్వ ఇచ్చే వెసులుబాటు కల్పిస్తుంది ఈ చట్టం. డిసెంబరులో జరిగిన శీతాకాల పార్లమెంటులో బిల్లు పెట్టి ఈ చట్టాన్ని ఉభయ సభలు, రాష్ట్రపతి ఆమోదించారు. అయితే ఈ చట్టం అమలుకు శుక్రవారం నోటిఫికేషన్ ఇచ్చినా.. అందుకు అవసరమైన రూల్స్ ఇంకా రూపొందించలేదని హోం మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఈ చట్టం ప్రకారం మూడు పొరుగు దేశాల్లో మత హింస ఎదుర్కొని అక్కడ బతకలేక భారత్ వచ్చిన హిందూ, క్రైస్తవ, సిక్కు, పార్సీ, జైన, బౌద్ధ మతాల వారికి మన పౌరసత్వం లభిస్తుంది. అయితే పౌరసత్వానికి మతంతో లింక్ పెట్టడమేంటంటూ విపక్షాలు నాటి నుంచి నిరసనలు చేపడుతున్నాయి. CAAతో భారత ముస్లింలకు నష్టం జరుగుతుందంటూ ఆందోళనలకు దిగాయి. ముస్లింలకు కూడా ఈ చట్టంలో చొటు కల్పించాలని, లేదా చట్ట సవరణను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. విపక్షాలు, వామపక్ష విద్యార్థి సంఘాలు చేస్తున్న ఆందోళనల్లో పలు చోట్ల తీవ్ర హింస చెలరేగింది. కొందరు ప్రాణాలు కోల్పోయారు. భారీగా ప్రభుత్వ ఆస్తుల ధ్వజం జరిగింది.

ఈ చట్టంతో ఏ ఒక్క భారత ముస్లింకూ అన్యాయం జరగదని కేంద్ర ప్రభుత్వం వివరిస్తోంది. పొరుగు దేశాల్లో మత హింసను ఎదుర్కొంటున్న మైనారిటీలకు పౌరసత్వం కల్పించాడానికి మాత్రమే ఉద్దేశించిదని పలు సందర్భాల్లో ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా వివరించారు. CAA వల్ల ఏ ఒక్క భారత ముస్లిం పౌరసత్వం కూడా పోదని, ప్రతిపక్షాల ప్రచారం నమ్మొద్దని చెప్పారు.