కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగడదాం

కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగడదాం

కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగడదాం

సీఐటీయూ ఆల్ ఇండియా అధ్యక్షురాలు హేమలత

సిద్దిపేట రూరల్, వెలుగు : కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు కార్మికులంతా ఏకమై పోరాడాలని సీఐటీయూ ఆల్ ఇండియా అధ్యక్షురాలు హేమలత చెప్పారు. బుధవారం సిద్దిపేటలోని రెడ్డి సంక్షేమ భవన్ లో సీఐటీయూ రాష్ట్ర నాలుగో మహాసభలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 10 గంటలకు మహాసభల ప్రాంగణానికి వచ్చిన ప్రతినిధులు ఆల్ ఇండియా నాయకులు మల్లు స్వరాజ్యం, సున్నం రాజయ్య ప్రాంగణాలలో వారి ఫోటోలకు నివాళి అర్పించి రెడ్ సెల్యూట్ చేశారు. అనంతరం సీఐటీయూ జెండా ఆవిష్కరించి మహాసభలను ప్రారంభించారు. ఈ సందర్భంగా హేమలత, సీఐటీయూ ప్రధాన కార్యదర్శి తపస్సేన్ మాట్లాడుతూ కార్మికుల ఐక్యతను విచ్ఛిన్నం చేసేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని అన్నారు. కార్మికులు కొట్లాడి సాధించుకున్న 29 లేబర్ చట్టాలను రద్దుచేసి పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉండేలా నాలుగు లేబర్ కోడ్ లకు కుదించిందని మండిపడ్డారు. ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేట్ పరం అయితే సామాన్య ప్రజలపై విపరీత భారం పడుతుందన్నారు. మహాసభలలో కార్మిక, కర్షక వర్గం వ్యతిరేక విధానాలపై భవిష్యత్తు పోరాట ప్రణాళికను రూపొందించుకుంటామని తెలిపారు. జనవరి 30న బెంగళూరులో జరిగే అఖిలభారత మహాసభ సందర్భంగా లక్షలాది మందితో ర్యాలీ నిర్వహించి బీజేపీ కుట్రను బయటపెడతామని చెప్పారు. సమావేశంలో రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు చుక్కా రాములు, భాస్కర్, టీఆర్ఎస్కేవీ రాష్ట్ర అధ్యక్షులు రాంబాబు, హెచ్ఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి చంద్రశేఖర్, టీఎన్​టీయూసీ రాష్ట్ర కార్యదర్శి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.