కోల్‌బెల్ట్, వెలుగు: సింగరేణిలో 150 మస్టర్లను తీసుకొచ్చి గైర్హాజరు పేరుతో కార్మికులను ఉద్యోగాల నుంచి తొలగించేందుకు యాజమాన్యం కుట్రలు చేస్తోందని సీఐటీయూ మందమర్రి బ్రాంచి ప్రెసిడెంట్ ఎస్.వెంకటస్వామి ఫైర్ అయ్యారు. బుధవారం మందమర్రి ఏరియా కాసిపేట-2 గనిపై నిర్వహించిన గేట్‌మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. సింగరేణి చైర్మన్‌తో మార్చిలో జరిగిన స్ట్రక్చర్డ్ మీటింగ్‌లో గైర్హాజరును తగ్గించేందుకు150 మస్టర్ల నిబంధన విధిస్తామని యాజమాన్యం స్పష్టం చేసినా గుర్తింపు సంఘం ఏఐటీయూసీ లీడర్లు ఎందుకు అడ్డుకోలేదని ప్రశ్నించారు.
కార్మికుల నుంచి వ్యతిరేకత రావడంతో గనులపై ధర్నాలంటూ ఏఐటీయూసీ ద్వంద వైఖరి ప్రదర్శిస్తోందని దుయ్యబట్టారు. కొత్తగా యాజమాన్యం జారీ చేసిన సర్క్యూలర్‌లో 190 మస్టర్లు చేయకపోయినా కార్మికులకు చార్జిషీట్ ఇచ్చేలా నిబంధన పెట్టిందన్నారు. నెలలో 16/20 మస్టర్లు లేకుంటే కౌన్సిలింగ్ నిర్వహిస్తామని ఆఫీసర్లు చెబుతున్నారని.. అన్ని నెలలు డ్యూటీ సక్రమంగా చేసి ఒక నెల సరిగ్గా చేయని ఉద్యోగులు మానసిక ఆందోళనకు గురవుతారని అన్నారు.
వెంటనే యాజమాన్యం సర్క్యూలర్‌ను ఉపసహరించుకోవాలని డిమాండ్‌చేశారు. గెలిచిన సంఘం లీడర్లు గనుల్లోకి దిగడంలేదని, వారిపై విజిలెన్స్ ఆఫీసర్లు ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని ప్రశ్నించారు. సమావేశంలో సీఐటీయూ బ్రాంచి సెక్రటరీ ఆల్లి రాజేందర్, పిట్ సెక్రటరీ సురేశ్, లీడర్లు సాగర్, హనుమంతు, రమేశ్, సురేశ్, గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
