కార్మికులకు శ్రమకు తగిన వేతనం ఇవ్వాలి : తుమ్మల వీరారెడ్డి

కార్మికులకు శ్రమకు తగిన వేతనం ఇవ్వాలి :  తుమ్మల వీరారెడ్డి
  •     సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి

నల్గొండ అర్బన్, వెలుగు: మున్సిపల్ కార్మికులకు శ్రమకు తగిన వేతనం ఇవ్వాలని, కాంట్రాక్టర్  విధానం రద్దుచేసి కనీసం వేతనం రెండవ పీఆర్సీలో  రూ. 26 వేలు నిర్ణయించి అమలు చేయాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్మల వీరారెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం నల్గొండలోని దొడ్డి కొమురయ్య భవన్‌లో తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా 5 వ మహాసభలు నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  ప్రభుత్వాలు మారినా కార్మికుల శ్రమకు తగ్గ వేతనం రావడం లేదన్నారు.  కార్మికులకు పని భద్రత కల్పించాలని, కార్మికుడు మరణిస్తే కనీస సౌకర్యాలైన ఇన్సూరెన్స్ లేదన్నారు. కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి మున్సిపల్ కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. పీఎఫ్, ఈఎస్ఐ ప్రమాద బీమా సౌకర్యాల కల్పన కోసం పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.

 ఈ నెల 14,15 తేదీల్లో  రంగారెడ్డి జిల్లా తుర్కయాంజిల్‌లో జరగనున్న యూనియన్ రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు ఎండీ సలీం సత్తయ్య, రవీందర్, తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్  జిల్లా కమిటీ సభ్యులు చింతకాయల సంతోష్, శ్రీనివాస్ లక్ష్మమ్మ, పొట్ట తారమ్మ,అవుట రవీందర్, జక్కల రవికుమార్, చిలుముల వెంకన్న, గుండుమల్ల శ్రీనివాస్ పేర్ల సంజీవ, పెరిక కృష్ణ, చిక్కుల రాములు,యల్లమ్మ,  తదితరులు పాల్గొన్నారు.