అక్రమ లే ఆఫ్ ను రద్దు చేయాలి

 అక్రమ లే ఆఫ్ ను రద్దు చేయాలి
  • సీఐటీయూతో కలిసి  కలెక్టరేట్ ఎదుట ధర్నా

సంగారెడ్డి టౌన్ ,వెలుగు: కొండాపూర్ మండలంలోని యూబీ కంపెనీ యాజమాన్యం ఉత్పత్తిని నిలిపివేసి లే ఆఫ్​ను ప్రకటించడాన్ని నిరసిస్తూ శుక్రవారం కార్మికులు సీఐటీయూ నాయకులతో కలిసి సంగారెడ్డిలోని పోతిరెడ్డిపల్లి చౌరస్తా నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్కారాములు మాట్లాడుతూ.. యుబీ యాజమాన్యం పర్మనెంట్ కార్మికులకు లే ఆఫ్ ప్రకటించడం చట్టవిరుద్ధం అన్నారు. వెంటనే లే ఆఫ్ ఎత్తివేసి కార్మికులకు ఆదుకోవాలన్నారు. 

ప్రభుత్వం, కంపెనీ యాజమాన్యం చర్చించుకోవాల్సిన అంశాలను కార్మికుల మీద రుద్ది వారిని రోడ్డుపాలు చేయడం సరికాదన్నారు. పరిశ్రమ ఉత్పత్తులు నిలిపివేయడంతో రెండు వేల మంది కార్మికులు రోడ్డున పడతారని ఆందోళన వ్యక్తం చేశారు. కలెక్టర్,  లేబర్ అధికారులు, జిల్లా మంత్రి కంపెనీ యాజమాన్యంతో చర్చించి ఉత్పత్తులు ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టరేట్ ఏవో పరమేశ్వర్ కు అందజేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మల్లేశం, సాయిలు, ఉపాధ్యక్షుడు బాగా రెడ్డి, యాదగిరి, కొండల్ రెడ్డి, రాందాస్, ప్రవీణ్, వెంకట్రెడ్డి, కార్మికులు పాల్గొన్నారు.