గ్రేటర్ హైదరాబాద్లో రోడ్లను అడ్డగోలుగా తవ్వి వదిలేస్తున్నరు!

గ్రేటర్ హైదరాబాద్లో రోడ్లను అడ్డగోలుగా తవ్వి వదిలేస్తున్నరు!

హైదరాబాద్, వెలుగు: సిటీ రోడ్లను అడ్డగోలుగా తవ్వేస్తున్నారు. వాటర్ బోర్డు పైప్​లైన్ పనులు,  డ్రైనేజీ, కేబుల్స్​ పనులంటూ రోడ్లను తవ్వి పనులు పూర్తయ్యాక మళ్లీ వేయడం లేదు. కొన్నిచోట్ల మట్టిపోసి వెళ్తుండగా, మరికొన్ని ఏరియాల్లో అలాగే వదిలేస్తుండటంతో వాహనదారులు, స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. కొన్నిచోట్ల ట్రాఫిక్​జామ్​ ఏర్పడుతోంది. 

రాత్రికి రాత్రే పనులు చేపట్టి..

నెల రోజులుగా గ్రేటర్ ​పరిధిలో వివిధ పనుల కోసం రోడ్ల తవ్వకాలు పెద్దఎత్తున జరుగుతున్నాయి. వానాకాలంలో ఎలాంటి తవ్వకాలకు అనుమతి లేకపోవడంతో ఇప్పుడు  మొదలుపెడుతున్నారు. అయితే, రోడ్లను తవ్వాలంటే బల్దియా నుంచి తప్పనిసరిగా ఎన్​వోసీ(నాన్ అబ్జెక్షన్ సర్టిఫికెట్) తీసుకోవాల్సి ఉంటుంది. కానీ చాలా వాటికి అనుమతి తీసుకోవడం లేదు. కొన్నిచోట్ల రాత్రికి రాత్రే తవ్వి పనులు చేసి వదిలేస్తున్నారు. దీంతో ఆ రోడ్లపై వెళ్లే వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. వెహికల్స్​స్లోగా వెళుతుండటంతో ట్రాఫిక్ జామ్​అవుతోంది. యాక్సిడెంట్లు కూడా జరుగుతున్నాయని  స్థానికులు చెబుతున్నారు.స ర్వీసు ఎక్కువగా ఉంటుందని కొన్ని ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ వేసిన వైట్​ ట్యాపింగ్​ రోడ్లను కూడా పాడు చేస్తున్నారు. ఐదేండ్ల పాటు ఈ రోడ్లను తవ్వకుండా ఉండేలా అన్ని చర్యలు తీసుకోవాల్సి ఉంది. కానీ రూల్స్ బ్రేక్ చేసి తవ్వి, పూర్తయ్యాక తిరిగి వేయడం లేదు. ఎన్ వోసీల విషయంలో బల్దియా అధికారులు లైట్​తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

2 వేల కి.మీ.  మేర రోడ్ల డ్యామేజ్..

ఏదో ఒక పని పేరుతో కాలనీల్లోని రోడ్లను కాంట్రాక్టర్లు తవ్వుతూనే ఉన్నారు. ఖైరతాబాద్, చార్మినార్, శేరిలింగంపల్లి జోన్ల పరిధిలో రోడ్లు తవ్వేసి రోజులు గడిచినా రిపేర్లు చేయడం లేదు. గ్రేటర్​లో 6,167 కి.మీ. మేర అంతర్గత సీసీ రోడ్లు ఉండగా.. ప్రస్తుతం ఇవి దారుణంగా ఉన్నాయి. దాదాపు 2 వేల కి.మీ. మేర డ్యామేజ్​అయ్యాయి. ఇష్టారీతిన తవ్వుతుండటంతో మరింత ప్రమాదకరంగా మారాయి. స్థానిక రోడ్ల ఇబ్బందులపై బల్దియా అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదని జనం మండిపడుతున్నారు. చందానగర్, ఉప్పల్, హఫీజ్​పేట, మల్కాజిగిరి, టోలిచౌకి, మెహిదీపట్నం, మాదాపూర్, ఎల్​బీనగర్, వనస్థలిపురం, మన్సూరాబాద్ తదితర ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.

బిల్లులను ఆపే అధికారం ఉన్నా..

రోడ్లు తవ్వి పనులు పూర్తయిన తర్వాత తిరిగి రోడ్లు వేసే బాధ్యత సదరు కాంట్రాక్టర్​పైనే ఉంటుంది. ఒకవేళ రోడ్లు వేయకపోతే ఆ పనికి సంబంధించి బిల్లులు ఆపే అధికారం ఆయా డిపార్ట్​మెంట్లకు ఉంటుంది. కానీ ఈ విషయాన్ని అధికారులు పట్టించుకోవడం లేదు. ఇదే అదనుగా భావించి కాంట్రాక్టర్లు రోడ్లు బాగు చేయకుండానే వదిలేస్తున్నారు. చాలా పనులకు ఎన్​వోసీలు తీసుకోకుండా రాత్రికి రాత్రే పూర్తిచేసి వదిలేస్తున్నారు. కొన్ని పనుల విషయం జీహెచ్ఎంసీ ఏఈలు, ఈఈలకు కూడా తెలియడం లేదు.

మళ్లీ మొదలైంది

 వానాకాలం కారణంగా నెల కిందటి వరకు ఏ పనులు జరగనప్పటికీ, ఇప్పుడు ఇష్టమొచ్చినట్లుగా రోడ్లు తవ్వుతున్నారు. ఏదో ఒక పని పేరుతో తవ్వుతూ తిరిగి రోడ్లు వేయడం లేదు. ఆ గుంతల్లో మట్టి పోసి వదిలేస్తున్నారు. దీంతో రోడ్లు మొత్తం డ్యామేజ్​ అవుతునాయి. ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది.  
- శ్రీనివాస్, ఫుడ్ డెలివరీ బాయ్