గ్రామీణ ప్రాంతాలకూ విమాన సర్వీస్‌లు

గ్రామీణ ప్రాంతాలకూ విమాన సర్వీస్‌లు
  • రైలు ప్రయాణాలలాగే విమాన ప్రయాణాలూ
  • ఏటా 100 కొత్త విమానాలు తీసుకొస్తం 
  • ఈ నెల 27 నుంచి మళ్లీ ఇంటర్నేషనల్​ సర్వీసులు
  • కేంద్ర సివిల్​ ఏవియేషన్​ మినిస్టర్​ జ్యోతిరాదిత్య సింధియా

హైదరాబాద్​, వెలుగు: మనదేశంలోని ప్రతి ప్రాంతానికి విమాన సౌకర్యాన్ని అందుబాటులోకి తేవడానికి ప్రయత్నాలు చేస్తున్నామని కేంద్ర సివిల్​ ఏవియేషన్​ మినిస్టర్​ జ్యోతిరాదిత్య సిందియా ప్రకటించారు. రీజనల్ కనెక్టివిటీని పెంచడానికి అందుబాటులోకి తెచ్చిన ‘ఉడాన్​’ ద్వారా ఇప్పటికే 409 కొత్త రూట్లకు విమాన సర్వీసులను అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. ఇదివరకే 1.74 లక్షల ఫ్లైట్‌ సర్వీస్‌లు నడిచాయని వెల్లడించారు.  హైదరాబాద్​లోని బేగంపేట ఎయిర్​పోర్టులో జరుగుతున్న ‘వింగ్స్​ ఇండియా’ కార్యక్రమంలో  శుక్రవారం ఏర్పాటు  ఆయన మాట్లాడారు. దేశవ్యాప్తంగా ఆరు లక్షల గ్రామాల ప్రజలకు విమాన సదుపాయం అందుబాటులోకి వచ్చేలా పెద్ద ఎత్తున ఎయిర్​పోర్టులను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. మనదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పౌర విమానయాన మార్కెట్‌‌‌‌ అని, పెరుగుతున్న డిమాండ్‌‌‌‌ను తీర్చడానికి ఏటా 100–-120 కొత్త విమానాలను అందుబాటులోకి తెస్తామని తెలిపారు.  సివిల్​ ఏవియేషన్​ఎకోసిస్టమ్​లోని ప్రతి విభాగాన్ని  విస్తరిస్తామని చెప్పారు. ఇండియాలో 2013–-14లో 400 విమానాలు ఉండేవని, గత ఏడేళ్లలో ఈ సంఖ్య 710 విమానాలకు చేరుకుందని ఆయన అన్నారు. ‘‘మా ప్రభుత్వం ఇప్పటి వరకు కొత్తగా 310 విమానాలను అందుబాటులోకి తెచ్చింది. ఎయిర్​లైన్​ కంపెనీలు పెద్ద విమానాల (వైడర్​బాడీ) సంఖ్యను పెంచాలి.  దేశంలోని అన్ని పాయింట్లను కనెక్ట్ చేస్తే సరిపోదు. మనం ప్రపంచాన్ని భారతదేశానికి కనెక్ట్ చేయాలి. ప్రపంచంలోని ప్రతి మూలను చేరేలా మన క్యారియర్లు సుదూర విమానాలను పెంచాలి. విమానయాన రంగం మరింత బలంగా తయారైంది.  సవాళ్లను, అవకాశాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంది. రాబోయే 25 సంవత్సరాలలో కొత్త శక్తివంతమైన దేశంగా ఆవిర్భవించాలని టార్గెట్​గా పెట్టుకున్నాం. ఈ విషయంలో పౌర విమానయాన రంగానిది చాలా ముఖ్యమైన పాత్ర. ఇందుకోసం చాలా చర్యలు తీసుకుంటున్నాం.  135 కోట్ల మంది ఉన్న దేశంలో కేవలం 14.5 కోట్ల మంది మాత్రమే విమానాల్లో ప్రయాణిస్తున్నారు.  పౌర విమానయానం త్వరలో రైల్వేలాగా మారుతుందని, అందరికీ విమాన ప్రయాణం అందుబాటులోకి వస్తుందని  నమ్ముతున్నాను”అని వివరించారు. కరోనా కష్టాల నుంచి సివిల్​ ఏవియేషన్​ సెక్టార్​ బయటపడిందని, ప్రయాణికుల సంఖ్య పెరుగుతున్నందున ఈ నెల 27 నుంచి ఇంటర్నేషనల్​ సర్వీసులను తిరిగి మొదలుపెడుతున్నట్టు సింధియా చెప్పారు. 

2 వేల విమానాలు కావాలి: బోయింగ్
ఇండియా ఎయిర్​లైన్​ ఆపరేటర్లకు రాబోయే 20 ఏళ్లలో 2000 కొత్త సింగిల్ ఐల్​(ఒకే సీట్ల వరుస) ఎయిర్‌‌‌‌క్రాఫ్ట్‌‌‌‌లు అవసరమని అమెరికాకు చెందిన విమానాల తయారీ కంపెనీ బోయింగ్ శుక్రవారం తెలిపింది.  ఇండియా కారణంగా గ్లోబల్​ ఏవియేషన్​ మార్కెట్లో  దక్షిణాసియా విమానయాన రంగం వాటా 90 శాతానికి పెరిగిందని పేర్కొంది. రాబోయే కాలంలో ఆపరేటర్లు డొమెస్టిక్​, రీజనల్​ మార్కెట్లలో నడపడానికి భారీగా ‘బోయింగ్​ 737’ విమానాలు అవసరమని పేర్కొంది. దక్షిణాసియాలో  రాబోయే 20 ఏళ్లలో దాదాపు   375 బిలియన్​ డాలర్ల విలువైన 2,400 కొత్త కమర్షియల్​ జెట్‌‌‌‌లు రావడానికి అవకాశం ఉందని బోయింగ్​కమర్షియల్​(రీజనల్​మార్కెటింగ్​) సీనియర్​ ఎగ్జిక్యూటివ్​ డేవ్ షుల్టే చెప్పారు.   

ఇన్​ఫ్రాను పెంచుతున్నాం...
సివిల్​ ఏవియేషన్​ ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ను పెంచడానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం కట్టుబడి ఉందని, 2013-14లో ఇండియాలో 74 విమానాశ్రయాలు ఉండగా, గత ఏడేళ్లలో కొత్తగా 66 విమానాశ్రయాలు వచ్చాయని సింధియా చెప్పారు. హెలిప్యాడ్‌‌‌‌లు,  వాటర్ ఏరోడ్రోమ్‌‌‌‌లతో కలిపి వీటి సంఖ్య 140కి చేరుకుందని అన్నారు. 2024–-25 నాటికి ఎయిర్​పోర్టులు, హెలిప్యాడ్​ల సంఖ్యను 220  చేర్చాలనుకుంటున్నామని ప్రకటించారు. ఢిల్లీ విమానాశ్రయం నుంచి ఏటా ఏడు కోట్ల మంది వెళ్తుండగా, బెంగళూరు, ముంబై, చెన్నై  హైదరాబాద్‌‌‌‌లోని విమానాశ్రయాల నుంచి 2.5‌‌‌‌‌‌‌‌-5 ఐదు కోట్ల మంది చొప్పున ప్రయాణిస్తున్నారని తెలిపారు.  ఢిల్లీ కోసం జెవార్‌‌‌‌లో రెండవ విమానాశ్రయాన్ని నిర్మిస్తున్నామని, ఇందుకు రూ. 38,000 కోట్ల విలువైన పెట్టుబడి అవసరమని చెప్పారు. ముంబైలోనూ కొత్త విమానాశ్రయం రాబోతోందని తెలిపారు. మనదేశంలో గతంలో 34 ఫ్లయింగ్​ ట్రేనింగ్​ ఆర్గనైజేషన్లు ఉండగా, కొత్తగా మరో తొమ్మిదింటిని మంజూరు చేశామని, త్వరలో 15 కొత్త ఫ్లయింగ్​ ట్రేనింగ్​ ఆర్గనేజైషన్లు వస్తాయని ప్రకటించారు. డ్రోన్ల మార్కెట్​ను ఎంకరేజ్​ చేయడానికి పీఎల్​ఐ స్కీమును వర్తింపజేస్తున్నామని సింధియా వివరించారు. వీలైనంత ఎక్కువగా డ్రోన్లను వాడాల్సిందిగా కీలక మినిస్ట్రీలను కోరామని చెప్పారు. హెలికాప్టర్​ సెగ్మెంట్​అభివృద్ధి కోసం మూడు ప్రత్యేక కారిడార్లను ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్​ తమిళిసై సౌందరరాజన్​, రాష్ట్ర రోడ్లు భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్​ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.