
- పరిశ్రమను సందర్శన, మృతుల కుటుంబాలకు పరామర్శ
- యాజమాన్యం నిర్లక్ష్యంతోనే తీవ్ర ప్రాణ నష్టమని ఆరోపణ
పటాన్చెరు, వెలుగు: సంగారెడ్డి జిల్లా పాశమైలా రం ప్రాంతంలోని సిగాచి పరిశ్రమలో ప్రమాదానికి యాజమాన్యం నిర్లక్ష్యమే ప్రధాన కారణమని, హత్య కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని తెలంగాణ పౌర సమాజ బృందాలు డిమాండ్ చేశాయి. సైంటిస్ట్స్ ఫర్ పీపుల్ వ్యవస్థాపకుడు కలపాల బాబూరావు నేతృత్వంలో ఏర్పాటైన నిజనిర్ధారణ బృందం ఆదివారం సిగాచి పరిశ్రమను సందర్శించి, మృతుల కుటుంబాలను, గాయపడిన కార్మికులను పరామర్శించింది.
బృందంలో హైకోర్టు న్యాయవాది వసుధ నాగరాజు, టీపీ జేఏసీ నేత కన్నెగంటి రవి, జనార్ధన్, డాక్టర్ ఉస్మాన్, సామాజిక కార్యకర్తలు మీరా, అఖిల్ సూర్య తదితరులు ఉన్నారు. ముందుగా పరిశ్రమను పరిశీలించి, సెక్యూరిటీ సిబ్బంది, స్థానికులు, ఘటన సాక్షుల నుంచి సమాచారం సేకరించింది. అనంతరం మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించింది. పరిశ్రమలో చాలా మంది క్యాజువల్, కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారని, 12 గంటల పాటు రెండు షిఫ్టుల్లో పని చేయిస్తున్నట్లు తెలిసిందని, ఇది ముమ్మాటికీ శ్రమ దోపిడేనని ఆరోపించింది.
ప్రమాద సమయంలో కార్మికుల సంఖ్య, మృతుల వివరాలను ఇంకా కంపెనీ వెల్లడించకపోవడం తీవ్ర నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించింది. ప్రభుత్వం ప్రకటిం చిన విధంగా మృతుల కుటుంబాలకు రూ. కోటి, తీవ్రంగా గాయపడిన కార్మికులకు, రూ.10 లక్షలను, స్వల్పంగా గాయపడిన కార్మికులకు రూ. 5 లక్షలను వెంటనే చెల్లించేవిధంగా చర్యలు తీసుకోవాలని పేర్కొంది.
ఇవే బృందం ప్రధాన డిమాండ్లు
పరిశ్రమను సందర్శించిన నిజనిర్ధారణ బృందం పలు డిమాండ్లు చేసింది. వాటిని అమలు చేసే వరకు కార్మిక పక్షాన పోరాడతామని సభ్యులు స్పష్టంచేశారు. ప్రమాదం జరిగిన రోజు డ్యూటీలో ఉన్నవారి, మృతుల, గాయపడిన వారి పూర్తి వివరాలను ప్రభుత్వం అధికారికంగా విడుదల చేయాలని కోరింది. మిస్సైన వారితో పాటు ప్రతి మృతుడి కుటుంబానికి రూ. కోటి పరిహారం చెల్లించాలని, కంపెనీ తిరిగి ప్రారంభించే వరకు పూర్తి వేతనాలు యాజమాన్యం చెల్లించేలా చర్యలు తీసుకోవాలని తెలిపింది. కార్మిక కుటుంబాలు పూర్తిగా కోలుకుని తిరిగి వారి జీవనం సాఫీగా నడిచేలా అధికారులు, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, అప్పటి వరకు ప్రజాసంఘాలు కార్మికులకు తోడుగా ఉంటాయని స్పష్టం చేసింది.