
- అలాంటి గొప్ప రాజ్యాంగాన్ని అంబేద్కర్ అందించారు
- ఓయూ సదస్సులో సీజేఐ జస్టిస్ గవాయ్
ఓయూ, వెలుగు: భవిష్యత్తు అవసరాల రీత్యా రాజ్యాంగ సవరణలను డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అనుమతించారని, ఆ స్ఫూర్తి తో పనిచేయాల్సిన అవసరం ఉందని సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ అన్నారు. భారత రాజ్యాంగ రూపకల్పనలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పాత్ర అనే అంశంపై ఓయూ ఠాగూర్ ఆడిటోరియంలో జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. భారత రాజ్యాంగ రూపకల్పన సమయంలో అంబేద్కర్ ఆలోచనా సరళిని వివరించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 పౌరహక్కులకు భంగం కలగకుండా ఒక రక్షణ కవచంలా కాపాడుతుందన్నారు.
పరిష్కార మార్గాలు లేకుండా హక్కులున్నా ఉపయోగం లేదని అంబేద్కర్ అనే వారని ఆయన గుర్తుచేశారు. పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లితే నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించే వెసులుబాటును రాజ్యాంగం కల్పించిందన్నారు. రాష్ట్రాలన్నింటినీ ఏకతాటిపైకి తెచ్చేలా బలమైన ప్రజాస్వామ్య దేశంగా పటిష్టపరిచే ఒకే దేశం, ఒకే రాజ్యాంగాన్ని అంబేద్కర్ అమల్లోకి తీసుకురావటం గర్వించాల్సిన విషయమని పేర్కొన్నారు. త్వరలోనే మళ్లీ ఉస్మానియా విశ్వవిద్యాలయానికి వచ్చి ఎక్కువ సమయం కేటాయిస్తానని ఆయన తెలిపారు.
హైదరాబాద్ ఉద్యమాలకు అంబేద్కర్ మద్దతు: జస్టిస్ నర్సింహ
సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ నరసింహ మాట్లాడుతూ.. ఉస్మానియా వర్సిటీకి భారత ప్రధాన న్యాయమూర్తితో కలిసి హాజరుకావటం చాలా ఆనందంగా ఉందన్నారు. అంబేద్కర్ కు హైదరాబాద్ కు ఉన్న అనుబంధాన్ని ఆయన గుర్తు చేశారు. నాటి నిజాం హైదరాబాద్ స్టేట్ చీఫ్ జస్టిస్ పదవి చేపట్టాల్సిందిగా అంబేద్కర్ ను ఆహ్వానించారని, అందుకు అంబేద్కర్ సున్నితంగా తిరస్కరించారని తెలిపారు. హైదరాబాద్లో జరిగిన సామాజిక ఉద్యమాలకు అంబేద్కర్ మద్దతు ప్రకటించారని ఆయన అన్నారు. అంబేద్కర్ తన ఆటో బయోగ్రఫీ లో హైదరాబాద్ ఉద్యమాలు, సామాజిక న్యాయం సహా అనేక విషయాలను వెల్లడించారని తెలిపారు.
భారత రాజ్యాంగ రూపకల్పనలో అంబేద్కర్ పాత్రపై భారత ప్రధాన న్యాయమూర్తితో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఉస్మానియా వర్సిటీ చొరవ అభినందనీయమని రాష్ట్ర హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్ పాల్ అన్నారు. అద్భుతమైన కారక్యమాన్ని ఏర్పాటు చేశారంటూ అడ్వకేట్ జనరల్ ఎ. సుదర్శన్ రెడ్డి, ఓయూ వీసీ ప్రొఫెసర్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపారు. వీసీ ప్రొఫెసర్ కుమార్ మాట్లాడుతూ.. 108 ఏండ్ల ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రగతిని వివరించారు. కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు, ఎంపీ మల్లు రవి, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు గీతారెడ్డి, బలరాం నాయక్, హైదరాబాద్ కలెక్టర్ హరిచందన , జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ నరేశ్ రెడ్డి, ఓఎస్డీ ప్రొఫెసర్ జితేంద ర్ కుమార్ నాయక్ పాల్గొన్నారు.