మంత్రి ఎదుట నేతల మధ్య గొడవ.. దసరా వేడుకల్లో వివాదం

మంత్రి ఎదుట నేతల మధ్య గొడవ.. దసరా వేడుకల్లో వివాదం
  • హిందూ ఉత్సవ కేంద్ర సమితి అభివృద్ధి పై రచ్చ

వికారాబాద్, వెలుగు: వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో నిర్వహించిన దసరా ఉత్సవాల వేడుకల్లో  నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.  సోమవారం తాండూరు హిందూ ఉత్సవ కేంద్ర సమితి ఆధ్వర్యంలో  ప్రతి సంవత్సరం మాదిరిగా నిర్వహించే దసరా ఉత్సవాల వేదిక పాత తాండూరు భవాని దేవాలయం వద్ద ఏర్పాటు చేశారు. ఈ వేడుకలకు రాష్ట్ర  మంత్రి మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్, మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ వీణ శ్రీనివాస్ చారి, కాంగ్రెస్ నేత మనోహర్ రెడ్డి  వివిధ రాజకీయ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.  ఈ వేడుకలు ప్రారంభదశలో ముఖ్య  నేతలు నాయకులు సమావేశంలో ప్రసంగించారు.  గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్ మాట్లాడుతూ..  ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సహకారంతో హిందూ ఉత్సవ సమితికి ల్యాండ్, రూ.25 లక్షలు మంజూరు చేశామన్నారు.  దీంతో హిందూ ఉత్సవ కేంద్ర సమితి ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల నర్సింలు, మాజీ ప్రధాన కార్యదర్శి రజనీకాంత్ నిధులు మంజూరు పై ఎవ్వరు డబ్బులు ఇచ్చారో, ఎలాంటి అభివృద్ధి చేశారో మీకే తెలియజేయాలన్నారు. 

ఇలా మూడు సంవత్సరాల నుంచి ఇదే పాట పాడుతున్నారని మంత్రి మహేందర్ రెడ్డి ముందే ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రశ్నించారు.  దీంతో రాజుగౌడ్ అనుచరులు, మంత్రి అనుచరులు, సమితి ప్రతినిధుల మధ్య మాటల యుద్ధం నెలకొంది.  దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.  విషయాన్ని గమనించిన పోలీసులు వేదిక వద్ద గొడవ జరగకుండా నిలుపుదల చేశారు.  చైర్మన్ రాజుగౌడ్ ఎమ్మెల్యే ప్రకటించిన నిధులకు సంబంధించిన జీవోను చూపిస్తూ వివరించారు.  హిందూ ఉత్సవ కేంద్ర సమితికి ఇచ్చిన ల్యాండ్ నుంచి కాంట్రాక్టర్లు ఇష్టం వచ్చినట్లుగా మట్టి కొడుతున్నారని ఇందుకు సంబంధించి ఎలాంటి పర్మిషన్ లేదని మట్టి తీసుకుని వచ్చే దాంట్లో కొంత డబ్బయినా ఇస్తే  సమితికి ఉపయోగపడుతుందన్నారు.  అయితే దసరా వేడుకల్లో ఇలాంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం కాస్త ఆందోళనకు గురి చేసింది.