వాట్సాప్​లో పోస్ట్​తో గొడవ.. బీజేపీ లీడర్​పై బీఆర్ఎస్ కార్యకర్తల దాడి

వాట్సాప్​లో పోస్ట్​తో గొడవ.. బీజేపీ లీడర్​పై బీఆర్ఎస్ కార్యకర్తల దాడి
  • పీఎస్​కు చేరిన వ్యవహారం 

బెల్లంపల్లి, వెలుగు: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో బీజేపీ నాయకుడిపై బీఆర్ఎస్​ లీడర్లు దాడి చేశారు.  బీఆర్ఎస్ లీడర్లు ప్రభుత్వ పథకాలను అమ్ముకోవద్దని, అర్హులైన వారికే ఇవ్వాలని బీజేపీ మండల అధ్యక్షుడు గజెల్లి రాజ్ కుమార్ గ్రామానికి చెందిన వాట్సాప్ ​గ్రూప్​లో శుక్రవారం పోస్ట్ పెట్టాడు. దీంతో బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు ఒకరినొకరు విమర్శించుకుంటూ పోస్టులు పెట్టు కున్నారు. దాదాపు పదిమంది బీఆర్ఎస్ కార్యకర్తలు రాజ్ కుమార్ ఇంటిపైకి వెళ్లి కాలర్ పట్టుకొని సెల్ ఫోన్ లాక్కొని దాడికి యత్నించారు. 

అక్కడే ఉన్న బీజేపీ లీడర్లు 100 నంబర్ కు డయల్ చేసి పోలీసులకు సమాచారమిచ్చారు. తాళ్ల గురిజాల ఎస్సై నరేశ్​ సిబ్బందితో అక్కడికి చేరుకుని రెండు వర్గాల వారిని పోలీస్ స్టేషన్ కు తరలించారు. తనపై బీఆర్ఎస్​కార్యకర్తలు దాడి చేశారంటూ రాజ్ కుమార్ పోలీసులు ఫిర్యాదు చేశారు.  

బీఆర్ఎస్ లీడర్లపై చర్యలు తీసుకోవాలి

బీజేవైఎం డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ పట్టి వెంకట క్రిష్ణ శుక్రవారం రాజ్ కుమార్ ను పరామర్శించి మాట్లాడారు. బీఆర్ఎస్ నియోజకవర్గ అధికార ప్రతినిధి కొమ్మెర లక్ష్మణ్,  సర్పంచ్  అశోక్ గౌడ్ కొంతకాలంగా గృహలక్ష్మి, దళిత బంధు, ఇతర పథకాలను ఆ పార్టీకి చెందిన వారికే కేటాయిస్తూ అమ్ముకుంటున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.