విదేశీ టీకాలకు లైన్​ క్లియర్​

విదేశీ టీకాలకు లైన్​ క్లియర్​

ఆ దేశాల్లో అనుమతులుంటే చాలన్న డీసీజీఐ
బ్రిడ్జి ట్రయల్స్​ను రద్దు చేస్తున్నట్టు ప్రకటన
ఫైజర్​, మోడర్నా కంపెనీల  టీకాలు వచ్చే చాన్స్​
కొవాగ్జిన్​ ఫార్ములా హాఫ్కిన్​కు ఇచ్చిన భారత్ ​బయోటెక్​
ఏటా 22.8 కోట్ల డోసులు  ఉత్పత్తి చేస్తామన్న హాఫ్కిన్​
కెనడా టీకాలూ వచ్చే అవకాశం
ఆ దేశ కంపెనీ ప్రావిడెన్స్​తో  బయోలాజికల్​– ఈ ఒప్పందం
డిసెంబర్​ కల్లా అందరికీ వ్యాక్సిన్​ అందించేందుకు చర్యలు స్పీడప్​


కొవాగ్జిన్​ టెక్నాలజీ ట్రాన్స్​ఫర్ ​భారత్​ బయోటెక్​ తయారు చేసిన కొవాగ్జిన్​ టీకాను హాఫ్కిన్​ బయోఫార్మా ఉత్పత్తి చేయనుంది. వ్యాక్సిన్ల ఉత్పత్తికి కేంద్ర ప్రభుత్వం రూ.65 కోట్లు, మహారాష్ట్ర సర్కారు రూ.94 కోట్లు ఆర్థిక సాయం చేస్తున్నాయని కంపెనీ మేనేజింగ్​ డైరెక్టర్​ సందీప్​ రాథోడ్​ ప్రకటించారు. కొవాగ్జిన్​ టెక్నాలజీ ట్రాన్స్​ఫర్​ పనులు చకచకా సాగుతున్నాయని ఆయన చెప్పారు. ఇప్పటికే భారత్​ బయోటెక్​ విధించిన కాన్ఫిడెన్షియల్​ క్లాజ్​పై సంతకాలు పూర్తయ్యాయని, ఆ కంపెనీతో ఒప్పందం చేసుకోవడమే తరువాయి అని తెలిపారు. రెండు దశల్లో వ్యాక్సిన్​ను ఉత్పత్తి చేస్తామని, మొదటి దశలో డ్రగ్​ మూల పదార్థాన్ని (డ్రగ్​ సబ్​స్టెన్స్​), ఆ తర్వాత పూర్తి డ్రగ్​ను ఉత్పత్తి చేయాల్సి ఉంటుందని చెప్పారు. డ్రగ్​ మూల పదార్థ తయారీకి బయో సేఫ్టీ లెవెల్​ 3 ల్యాబ్​ అవసరమన్నారు. మరో 8 నెలల్లో దాని నిర్మాణం పూర్తవుతుందని, అది అందుబాటులోకి వచ్చిన తర్వాత నెలకు 2 కోట్ల డోసుల చొప్పున.. ఏడాదిలో 11 నెలలకుగానూ 22.8 కోట్ల డోసులను ఉత్పత్తి చేసి ఇస్తామని ఆయన వివరించారు.
న్యూఢిల్లీ: డిసెంబర్​ నాటికి అందరికీ కరోనా వ్యాక్సిన్లు వేయాలన్న లక్ష్యాన్ని చేరేందుకు కేంద్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా విదేశీ టీకాలకు లైన్​ క్లియర్​ చేసేస్తోంది. విదేశాల్లో ఇప్పటికే అనుమతి పొందిన వ్యాక్సిన్లను మన దేశంలో వాడేందుకు బ్రిడ్జి ట్రయల్స్​ అవసరం లేదని ప్రకటించింది. దీంతో అనుమతులకు దరఖాస్తు చేసుకుని వెనక్కు తగ్గిన ఫైజర్​, మోడర్నా వంటి కంపెనీలు వీలైనంత తొందరగా దేశంలో టీకాలను తీసుకొచ్చేందుకు అవకాశం దొరకనుంది. ఇటు కెనడా నుంచీ మన దేశానికి కరోనా వ్యాక్సిన్లు వచ్చే అవకాశం ఉంది. ప్రావిడెన్స్​ ఐఎన్​సీతో బయోలాజికల్​– ఈ ఒప్పందం చేసుకుంది. 

ఇప్పటిదాకా విదేశీ కంపెనీల టీకాలను మన దగ్గర వాడాలంటే బ్రిడ్జి ట్రయల్స్​తప్పనిసరి. అందులో భాగంగా కనీసం వారం పాటు వలంటీర్లపై వ్యాక్సిన్​ను టెస్ట్​ చేయాల్సి ఉంటుంది. టీకా సేఫ్టీ, పనితీరును తెలుసుకున్నాకే దానికి కేంద్రం అనుమతులిచ్చేది. అయితే, ఇప్పుడు దేశంలో కరోనా సెకండ్​వేవ్​ తీవ్రత ఎక్కువగా ఉండడం, కేసులు పెరిగిపోతుండడంతో ఎక్కువ వ్యాక్సిన్లను సమీకరించేందుకు ఆ బ్రిడ్జి ట్రయల్స్​ను రద్దు చేస్తున్నట్టు డ్రగ్​ కంట్రోల్​ జనరల్​ ఆఫ్​ ఇండియా (డీసీజీఐ) ప్రకటించింది. 
ఫైజర్​ నుంచి 6 కోట్ల డోసులు!
డీసీజీఐ బ్రిడ్జి ట్రయల్స్​ను రద్దు చేయడంతో 5 కోట్ల నుంచి 6 కోట్ల డోసుల ఫైజర్​ టీకాలు ఇండియాకు రానున్నాయని తెలుస్తోంది. అయితే, ఇండెమ్నిటీ బాండ్​పైనే కేంద్ర ప్రభుత్వం, ఫైజర్​ కంపెనీల మధ్య పేచీ నడుస్తోంది. అమెరికా, బ్రిటన్​ తదితర దేశాలు తమకు ఆ సౌకర్యం కల్పించాయని, ఇండియా కూడా ఇవ్వాల్సిందేనని ఫైజర్​ పట్టుబడుతోంది. కేంద్ర ప్రభుత్వమూ ఇవ్వలేమని తేల్చి చెబుతోంది. ఇప్పుడు దేశంలో టీకాలు అత్యవసరం కావడంతో ఆ చర్చలు ఓ కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది. మొత్తంగా కాకపోయినా ‘పార్షియల్​ ఇండెమ్నిటీ’కి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకున్నట్టు సమాచారం. పూర్తి ఇండెమ్నిటీ ఇవ్వడం మాత్రం కుదరదని చెప్పినట్టు అధికార వర్గాలు అంటున్నాయి. దీనిపై ఇంకా చర్చలు జరుగుతున్నాయని ఫైజర్​ ప్రతినిధులు అంటున్నారు. 
ఏంటీ ఈ ఇండెమ్నిటీ?
ఇండెమ్నిటీ బాండ్​ అంటే సెక్యూరిటీ (రక్షణ) బాండే. మన దేశంలో వ్యాక్సిన్​ వికటించి చనిపోయిన వారికి ఆయా కంపెనీలే పరిహారం చెల్లించేలా ఒప్పందం చేసుకున్నాయి. తీవ్రమైన సైడ్​ఎఫెక్ట్స్​ వచ్చినా వారికి పరిహారం ఇస్తాయి. ఫైజర్​ మాత్రం తాను పరిహారం చెల్లించనని చెప్తోంది. వ్యాక్సిన్​ వేసుకున్నోళ్లకు ఏదైనా జరగరానిది జరిగితే కేంద్ర ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలని, న్యాయపరమైన సమస్యలు రాకుండా చూసుకోవాలని తేల్చి చెప్పింది. తమకు ఆ హామీతో ఇండెమ్నిటీ బాండ్​ ఇవ్వాలని పట్టుబట్టింది. 

మోడర్నా, ఇతర విదేశీ టీకాలపైనా చర్చలు
ఫైజర్​ టీకానే కాకుండా మోడర్నా టీకాలను దిగుమతి చేసుకునే విషయంపైనా చర్చలు నడుస్తున్నట్టు తెలుస్తోంది. మోడర్నా కూడా మన దేశంలోకి టీకాలను తీసుకొచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నా.. ఎన్ని డోసులు ఇస్తామన్న దానిపైనే క్లారిటీ లేదని అధికార వర్గాలు చెబుతున్నాయి.  
కెనడా కంపెనీతో బయోలాజికల్​-ఈ జట్టు
వీలైనన్ని ఎక్కువ వ్యాక్సిన్లను ఉత్పత్తి చేసేందుకు హైదరాబాద్​ కంపెనీ బయోలాజికల్‌‌‌‌–ఈ ప్రయత్నాలు చేస్తోంది. కెనడాకు చెందిన ప్రావిడెన్స్​ థెరపెటిక్స్​ హోల్డింగ్స్​ ఐఎన్​సీ అనే కంపెనీతో ఒప్పందం చేసుకుంది. అందులో భాగంగా ఆ సంస్థ అభివృద్ధి చేసిన ఎంఆర్​ఎన్​ఏ వ్యాక్సిన్​ పీటీఎక్స్​ కొవిడ్​19బీని మన దేశంలో బయోలాజికల్​–ఈ ఉత్పత్తి చేయనుంది. 2022 నాటికి 100 కోట్ల డోసుల తయారీ లక్ష్యంతో ఒప్పందం చేసుకుంది. అది సాధ్యం కాకపోతే కనీసం 60 కోట్ల డోసులను ఉత్పత్తి చేయాలని నిర్ణయించింది. ఒప్పందంలో భాగంగా ప్రావిడెన్స్​ కూడా 3 కోట్ల డోసులను విడతల వారీగా ఇవ్వనుంది. ఈ ఏడాది చివరి నాటికి కొన్ని, వచ్చే ఏడాది ప్రారంభంలో మరికొన్ని ఇచ్చేలా రెండు కంపెనీల మధ్య ఒప్పందం కుదిరింది.  ఇప్పుడు బ్రిడ్జి ట్రయల్స్​ ఎత్తేసిన నేపథ్యంలో కెనడా టీకాలూ మనకు త్వరగానే అందే అవకాశం ఉంది. కాగా, ఇటు జాన్సన్​ అండ్​ జాన్సన్​ సింగిల్​ డోస్​ టీకా ఉత్పత్తికీ ఇప్పటికే బయోలాజికల్​–ఈ ఒప్పందం చేసుకుంది. 
ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రొడక్షన్​
అర్హులైన వారందరికీ వ్యాక్సిన్​ వేసేందుకు దేశంలో టీకాల ఉత్పత్తిని క్రమంగా పెంచుతున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. అందులో భాగంగానే ఆత్మనిర్భర్​ భారత్​ 3.0 మిషన్​ కొవిడ్​ సురక్ష కింద.. మూడు ప్రభుత్వ రంగ సంస్థలకు కేంద్ర బయోటెక్నాలజీ శాఖ సహకారం అందిస్తోందని పేర్కొంది. మహారాష్ట్ర సర్కార్​ ఆధ్వర్యంలో నడుస్తున్న ముంబైలోని హాఫ్కిన్​ బయోఫార్మాస్యుటికల్​ కార్పొరేషన్​ లిమిటెడ్​, హైదరాబాద్​లోని ఇండియన్​ ఇమ్యునోలాజికల్స్​ లిమిటెడ్​, యూపీలోని భారత్​ ఇమ్యునోలాజికల్స్​ అండ్​ బయోలాజికల్స్​ సంస్థలకు ఆర్థిక సాయం చేస్తున్నామని చెప్పింది. 

ఆ దేశాల్లో ఎకే అయితే చాలు

టీకాలకు డిమాండ్​ భారీగా పెరగడంతో విదేశీ టీకాలను వీలైనంత ఎక్కువ తెప్పించేందుకు బ్రిడ్జి ట్రయల్స్​ను రద్దు చేశాం. వ్యాక్సినేషన్​పై వేసిన నేషనల్​ ఎక్స్​పర్ట్​ గ్రూప్​ సిఫార్సుల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నాం. యూఎస్​ఎఫ్​డీఏ, యూరోపియన్​ మెడిసిన్స్​ ఏజెన్సీ, బ్రిటన్​ మెడికల్​ అండ్​ హెల్త్​కేర్​ ప్రొడక్ట్స్​ రెగ్యులేటరీ ఏజెన్సీ, జపాన్​ ఫార్మాస్యుటికల్స్​ అండ్​ మెడికల్​ డివైజెస్​ ఏజెన్సీలు లేదా డబ్ల్యూహెచ్​వో అనుమతించిన టీకాలను ఇకపై ట్రయల్స్​ లేకుండానే దిగుమతి చేసుకోవచ్చు. టీకా తయారీ దేశాల్లోని నేషనల్​ కంట్రోల్​ లేబొరేటరీలు  సర్టిఫికెట్​ ఇస్తే.. ఇక్కడ ప్రతి బ్యాచ్​ వ్యాక్సిన్లను టెస్ట్​ చేయాల్సిన అవసరం లేదు. సెంట్రల్​ డ్రగ్​ లేబొరేటరీ ఆధ్వర్యంలో 
నేరుగా టీకాలను విడుదల చేసుకోవచ్చు. - వీజీ సోమానీ, డీసీజీఐ చీఫ్ ​

సినోవ్యాక్​కు డబ్ల్యూహెచ్​వో అనుమతి
మరో చైనా వ్యాక్సిన్​కు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్​వో) అనుమతిచ్చింది. పోయిన నెలలో సినోఫార్మ్​ టీకా ఎమర్జెన్సీ వాడకానికి ఓకే చెప్పిన డబ్ల్యూహెచ్​వో.. ఇప్పుడు సినోవ్యాక్​ టీకాకూ పర్మిషన్ ఇచ్చింది. ఇంటర్నేషనల్​ స్టాండర్డ్స్​కు తగ్గట్టే ఆ టీకా సేఫ్టీ, పనితీరు, తయారీ ఉందని పేర్కొంది. అన్నింటినీ పరిశీలించే సినోవ్యాక్​ టీకాకు అనుమతులు ఇచ్చామని డబ్ల్యూహెచ్​వో యాక్సెస్​ టు హెల్త్​ ప్రొడక్ట్స్​ డిపార్ట్​మెంట్​ అసిస్టెంట్​ డైరెక్టర్​ జనరల్​ డాక్టర్​ మేరియేంజెలా సిమావో చెప్పారు.