కేటీఆర్ చెప్పిండు..టికెట్ మాకే!

కేటీఆర్ చెప్పిండు..టికెట్ మాకే!
  • కేటీఆర్ చెప్పిండు..టికెట్ మాకే!
  • వచ్చే ఎన్నికల్లో పోటీకి రెడీ అవుతున్న మంత్రి సన్నిహితులు 
  • ఇప్పటికే నియోజకవర్గాల్లో పర్యటనలు  
  • కుత్బుల్లాపూర్​లో శంభీపూర్ రాజు, జనగామలో పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి 
  • లిస్టులో ఎంపీ కవిత, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ మరికొందరు

హైదరాబాద్, వెలుగు:  మంత్రి కేటీఆర్ సన్నిహితులు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి రెడీ అవుతున్నారు. ‘రామన్న చెప్పిండు.. టికెట్ మాకే’ అంటూ నియోజకవర్గాల్లో పట్టు పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆరు నూరైనా ఈసారి టికెట్​తెచ్చుకొని ఎన్నికల్లో పోటీ చేస్తామని ధీమాగా చెబుతున్నారు. ఇంకో ఆరు నెలల్లోపే అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో గ్రామ, మండల స్థాయి నాయకులు, క్యాడర్​తో తరచూ సమావేశమవుతూ తమతో కలిసి పని చేయాలని కోరుతున్నారు. ఆయా నియోజకవర్గాల్లో సిట్టింగ్​ఎమ్మెల్యేలకు టికెట్​ఇచ్చేది లేదని పార్టీ చీఫ్ ​కేసీఆర్​హెచ్చరించారని, హైకమాండ్​ నుంచి గ్రీన్​సిగ్నల్ ​రావడంతోనే తాము పోటీకి సిద్ధమవుతున్నామని చెబుతున్నారు.  

ఖానాపూర్ లో భూక్యా జాన్సన్ కర్చీఫ్..  

ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్​రాజు కుత్బుల్లాపూర్​ టికెట్​ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమకాలం నుంచి కేటీఆర్​కు సన్నిహితుడిగా ఆయనకు పేరుంది. ప్రస్తుతం ప్రభుత్వం, పార్టీలో కలిపి రాజుకు మూడు పదవులు ఉన్నాయి. పార్టీలో తనకున్న ప్రాధాన్యం దృష్ట్యా ఈసారి టికెట్​తప్పకుండా వస్తుందని ఆయన ధీమాగా ఉన్నారు. కేటీఆర్​ క్లాస్​మేట్​ భూక్యా జాన్సన్​ఖానాపూర్​ ఎస్టీ రిజర్వుడ్​ సెగ్మెంట్​పై ఖర్చీఫ్​ వేశారు. 

ఈసారి టికెట్​తనదేనని, తనతో కలిసి పని చేయాలని నియోజకవర్గ క్యాడర్​కు విజ్ఞప్తి చేశారు. కేటీఆర్, ఎంపీ సంతోష్​కుమార్​తో ప్రస్తుత ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్​రెడ్డికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వీరు ముగ్గురు పుణెలో ఉన్నప్పుడు రూమ్​మేట్స్. ఈ లైన్​లోనే శ్రీనివాస్ రెడ్డికి ఎమ్మెల్సీగా అవకాశం దక్కిందని చెబుతుంటారు. అయితే, ఇప్పుడు జనగామ టికెట్​పై ధీమాతో ఉన్న శ్రీనివాస్ రెడ్డి.. నియోజకవర్గంలోని సర్పంచులు, ఎంపీటీసీలు, ఇతర ప్రజాప్రతినిధులతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఇదే నియోజకవర్గం నుంచి కేటీఆర్ కోటాలోనే మాజీ ఎమ్మెల్యే నాగపురి రాజ లింగం తనయుడు నాగపురి కిరణ్ ​కుమార్​కూడా టికెట్​ఆశిస్తున్నారు. లోకల్ కావడం, 50 ఏండ్లుగా నియోజకవర్గ రాజకీయాల్లో కీలకంగా ఉండడం తనకు పెద్ద అనుకూలాంశాలని చెప్పుకుంటున్నారు. ఇక కేటీఆర్​కు సన్నిహితుడైన గొట్టెముక్కుల వెంకటేశ్వర్ ​రావు కూకట్​పల్లి టికెట్ ఆశిస్తున్నారు. ఆయన ఎమ్మెల్యేతో సమా నంగా నియోజకవర్గంలో పర్యటిస్తూ ఎన్నికలకు సమాయత్తమవుతున్నారు.

రాజేంద్రనగర్​లో మంత్రి సబిత కొడుకు.. 

మంత్రి సబితా ఇంద్రారెడ్డి కొడుకు కార్తీక్ ​రెడ్డి రాజేంద్రనగర్​ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్​ నుంచి సబిత బీఆర్ఎస్​లో చేరినప్పుడే ఈ మేరకు ఒప్పందం జరిగిందని చెబుతున్నారు.  బీఆర్ఎస్​లో చేరిన తర్వాత కార్తీక్​ రెడ్డి మంత్రి కేటీఆర్​తో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తు న్నారు. హెచ్​సీఏ ఎన్నికల్లో అజారుద్దీన్​ను గెలిపించడానికి కేటీఆర్ ​చేసిన ప్రయత్నాలకు కార్తీక్ చేయూతనిచ్చారని, దానికి బదులుగా ఈసారి టికెట్​ఇప్పిస్తారని ఆయన సన్నిహితులు అంటు న్నారు. మాజీ మంత్రి, మహిళా కమిషన్ చైర్​పర్సన్​ సునీతా లక్ష్మారెడ్డి వచ్చే ఎన్నికల్లో నర్సాపూర్ నుంచి పోటీకి రెడీ అవుతున్నారు. ఇప్పటికే టికెట్​ఖరారు చేశారని, ఇక ప్రకటనే తరువాయి అని ఆమె వర్గీయులు చెబుతున్నారు. మాజీ మేయర్​ బొంతు రామ్మోహన్ ఉప్పల్ టికెట్ ఆశిస్తున్నారు. ఉద్యమకాలం నుంచి ఆయన కేసీఆర్, కేటీఆర్​తో సన్నిహితంగా ఉంటున్నారు. సిట్టింగ్​ఎమ్మెల్యేతో పోటాపోటీగా రామ్మోహన్ నియోజకవర్గంలో పని చేసుకుంటున్నారు. టికెట్​పై హైకమాండ్​ నుంచి నిర్దిష్టమైన హామీ లభించిందని ఆయన సన్నిహితులు చెబుతు న్నారు. మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవిత వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబాబాద్​ నుంచి పోటీకి ఆసక్తి చూపుతున్నారు. టికెట్​పై  హైకమాండ్ హామీ ఇచ్చిందని ఆమె సన్నిహితులు అంటున్నారు.

మెదక్​లో మైనంపల్లి కొడుకు..

మంత్రి సత్యవతి రాథోడ్ అక్క కుమార్తె, మహబూబాబాద్​ జెడ్పీ చైర్​పర్సన్​ అంగోతు బింధు ఇల్లెందు టికెట్ ఆశిస్తున్నారు. ఇందుకోసం కేటీఆర్​ దగ్గర మంత్రి సత్యవతి రాథోడ్ ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత రావు కొడుకు మైనంపల్లి రోహిత్ మెదక్ అసెంబ్లీ టికెట్​ఆశిస్తున్నారు. ఇప్పటికే ఆయన నియోజకవర్గంలో సేవా కార్యక్ర మాలతో ప్రజల్లోకి వెళ్తున్నారు. పటాన్​చెరు టికెట్ నీలం మధు ముదిరాజ్​ఆశిస్తు న్నారు. ఆయన సేవా కార్యక్రమాలతో నిత్యం ప్రజల్లోనే ఉంటున్నారు. ఆయనకు టికెట్​పై కేటీఆర్ హామీ ఇచ్చినట్టుగా 
నియోజకవర్గంలో ప్రచారం జరుగుతోంది. వరంగల్​ తూర్పు టికెట్​ను మేయర్​ గుండు సుధారాణి ఆశిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే బానోతు చంద్రావతి వైరా టికెట్​పై ఆశలు పెట్టుకున్నారు.

సాగర్​లో మూడు ముక్కలాట..

నాగార్జున సాగర్​లో టికెట్ కోసం త్రిముఖ పోటీ ఉంది. సిట్టింగ్​ ఎమ్మెల్యే నోముల భగత్​ టికెట్ ఆశిస్తుండగా, మంత్రి జగదీశ్​రెడ్డి ఆశీస్సులతో ఎమ్మెల్సీ కోటిరెడ్డి రేసులో ఉన్నారు. తన సమీప బంధువైన మన్నె రంజిత్​ కుమార్​ యాదవ్​కు టికెట్​ఇప్పించుకునేందుకు ఎంపీ బడుగుల లింగ య్య యాదవ్ ​ప్రయత్నిస్తున్నారు. మంత్రి కేటీఆర్​ ద్వారా రంజిత్ యాదవ్ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారని స్థానికంగా ప్రచారం జరుగుతోంది. కోదాడ టికెట్ ​తనకు ఇవ్వాలని ఎన్ఆర్ఐ జలగం సుధీర్ ఇటీవల కేటీఆర్​ను కలిసి విజ్ఞప్తి చేశారు. ఐదేండ్లకు పైగా కోదాడలోనే ఉన్న సుధీర్​ నెల క్రితమే అమెరికా తిరిగి వెళ్లిపోయారు. కేటీఆర్ ఇటీవలి లండన్, అమెరికా పర్యటనల్లో పలువురు ఎన్ఆర్ఐలు ఆయనను కలిసి తమకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. టికెట్​పై హామీ ఇవ్వలేనని, ఇతర అవకాశాలిస్తానని వారిలో కొందరికి కేటీఆర్ హామీ ఇచ్చినట్టు ఆయన సన్నిహితులు చెబుతున్నారు.