వికారాబాద్ జిల్లాలో ఆజాదీ కా గౌరవ యాత్ర ముగింపు

వికారాబాద్ జిల్లాలో ఆజాదీ కా గౌరవ యాత్ర ముగింపు

కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని దోచుకొంటోందని.. కేంద్రం ఏమి చేసిందని అడుగుతున్నారని..అసలు రాష్ట్రానికి మీరు ఏం చేశారని కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి ప్రసాద్ కుమార్ ప్రశ్నించారు. వికారాబాద్ జిల్లాలోని తాండూరులో ‘ఆజాదీ కా గౌరవ యాత్ర’ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ యాత్ర కొడంగల్, పరిగి మీదుగా వికారాబాద్ కు శుక్రవారం సాయంత్రం చేరుకుంది. ఈ సందర్భంగా ముగింపు సభ జరిగింది. సభలో పాల్గొన్న మాజీ మంత్రి ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ... స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గురించి తాను మాట్లాడితే బాగుండదని, పార్టీ కార్యకర్తలే మాట్లాడుతారన్నారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి తప్ప ఎలాంటి పనులు జరగలేదన్నారు.

యాత్రలో పాల్గొన్న జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ..రాష్ట్రంలో బీజేపీ, టీఆర్ఎస్ రెండు ఒక్కటేనని..ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని సీఎం కేసీఆర్ డ్రామాలాడుతున్నారని విమర్శించారు. తాండూరు, వికారాబాద్ మున్సిపల్ లలో మహిళలు ఛైర్ పర్సన్ గా ఉంటే ఎప్పుడు దింపాలా అని టీఆర్ఎస్ నేతలు చూస్తున్నారని వెల్లడించారు. పేద ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ప్రధాని పదవులను సోనియా, రాహుల్ గాంధీలు వదులుకొన్నారని తెలిపారు. అయితే.. అక్రమ ఈడీ కేసులతో వారిని వేధిస్తున్నారన్నారు. వికారబాద్ జిల్లా అభివృద్ధి జరగాలంటే రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించాలని పిలుపునిచ్చారు.