కర్ణాటక సీఎం ఎంపికపై వీడని సస్పెన్స్..

కర్ణాటక సీఎం ఎంపికపై వీడని సస్పెన్స్..
  • ​ కర్నాటక సీఎం ఎంపికపై సీఎల్పీ భేటీ పూర్తయినా అభ్యర్థి ఎవరన్నది తేలలే
  • నేడు ఢిల్లీకి సిద్ధరామయ్య, డీకే శివకుమార్, మల్లికార్జున ఖర్గేకే సీఎం ఎంపిక బాధ్యత
  • సీఎల్పీ భేటీలో సిద్ధరామయ్య తీర్మానం..బలపర్చిన డీకే, ఎమ్మెల్యేలు
  • సభ్యుల అభిప్రాయాలు తెలుసుకోనున్న అబ్జర్వర్ టీమ్

బెంగళూరు/న్యూఢిల్లీ: కర్నాటక సీఎం పదవి కోసం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు. ఆదివారం సాయంత్రం బెంగళూరులోని షంగ్రిల్లా హోటల్​లో కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సీఎల్పీ) మీటింగ్ జరిగింది. కాంగ్రెస్ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలందరూ హాజరయ్యారు. సీఎం అభ్యర్థి ఎంపిక కోసం కాంగ్రెస్‌‌ హైకమాండ్ ముగ్గురు లీడర్లతో కూడిన అబ్జర్వర్ టీంను ఆదివారం బెంగళూరుకు పంపింది. ఇందులో మహారాష్ట్ర మాజీ సీఎం సుశీల్‌‌ కుమార్‌‌ షిండే, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జితేంద్ర సింగ్‌‌, ఏఐసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి దీపక్‌‌ బబారియా ఉన్నారు. వీరు కూడా సీఎల్పీ భేటీలో పాల్గొన్నారు.

గురువారం ప్రమాణ స్వీకారోత్సవం!

గురువారం కర్నాటక సీఎం ప్రమాణ స్వీకార ప్రోగ్రామ్ ఉన్నట్లు తెలుస్తున్నది. అయితే, సీఎం ఎవరన్నది మాత్రం ఇంకా తేలలేదు. సోమవారం మరోసారి ఎమ్మెల్యేల అభిప్రాయాలు అబ్జర్వర్ టీమ్ సేకరించనుంది. నివేదికను ఢిల్లీ హైకమాండ్​కు అందజేస్తుంది. నివేదిక ఆధారంగా రెండు మూడు రోజుల్లో మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు పలువురు సీనియర్ లీడర్లు కలిసి సీఎంను ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయి. మంత్రి వర్గాన్ని కూడా ఒకట్రెండు రోజుల్లో ఫైనల్ చేసే అవకాశం ఉంది.

హాజరుకానున్న ఖర్గే, సోనియా, రాహుల్

గురువారం జరిగే సీఎం ప్రమాణ స్వీకారోత్సవానికి కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ హాజరుకానున్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల సీఎంలు, పార్టీ సీనియర్ లీడర్లు కూడా అటెండ్ కానున్నారు.

మద్దతుదారులతో వేర్వేరుగా భేటీ

సీఎల్పీ భేటీకి ముందు తమకు సపోర్ట్ ఇచ్చే ఎమ్మెల్యేలతో డీకే శివకుమార్, సిద్ధరామయ్య వేర్వేరుగా భేటీ అయ్యారు. అటు ఖర్గే ఇంట్లో సిద్ధరామయ్య ప్రత్యేకంగా సమావేశం కావడం, ఇటు హరిహరపుర మఠానికి చెందిన వక్కలిగ సాధువులు డీకే శివకుమార్ ఇంటికొచ్చి కలవడం 
ఆసక్తి రేకెత్తిస్తోంది.

5  గ్యారంటీ స్కీమ్స్​ అమలుకు సీఎల్పీ నిర్ణయం

సీఎల్పీలో రెండు తీర్మానాలు ప్రవేశపెట్టినట్లు కర్నాటక కాంగ్రెస్ ఇన్​చార్జ్ రణదీప్ సింగ్ సుర్జేవాలా ప్రకటించారు. ముందుగా ఖర్గే, సోనియా, రాహుల్ గాంధీతో పాటు కర్నాటక ప్రజలకు ధన్యవాదాలు చెబుతూ డీకే శివకుమార్ తీర్మానం ప్రవేశపెట్టారన్నారు. దీన్ని కాంగ్రెస్​ లీడర్లు బలపర్చారని వివరించారు. తర్వాత సీఎల్పీ నేతను ఎన్నుకునే అధికారం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు అప్పగిస్తూ సిద్ధరామయ్య రెండో తీర్మానం ప్రవేశ పెట్టారని తెలిపారు. ఐదు గ్యారంటీ స్కీమ్​లు అమలు చేయాలని సీఎల్పీ నిర్ణయం తీసుకుందన్నారు. సీఎం ఎంపిక విషయంలో సోమవారం మరోసారి సీఎల్పీ భేటీ అయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఢిల్లీకి రావాలని సిద్ధ రామయ్య, డీకే శివకుమార్​కు హైకమాండ్ నుంచి పిలుపు వచ్చినట్లు సమాచారం. సీఎల్పీ మీటింగ్ సందర్భంగా షంగ్రిల్లా హోటల్ ముందు డీకే శివకుమార్, సిద్ధరామయ్య మద్దతు దారులు భారీగా చేరుకుని పోటాపోటీగా నినాదాలు చేశారు.