మల్కాజ్​గిరి ఎంపీ ఎన్నిక అభ్యర్థిది కాదు.. సీఎంది : సీఎం రేవంత్

మల్కాజ్​గిరి ఎంపీ ఎన్నిక అభ్యర్థిది కాదు.. సీఎంది :  సీఎం రేవంత్
  • నియోజకవర్గంలో కాంగ్రెస్​ జెండా ఎగరాల్సిందే: సీఎం రేవంత్
  • నాడు కొందరు లీడర్లు అమ్ముడుపోయినా కార్యకర్తలు భుజానవేసుకొని నన్ను ఎంపీగా గెలిపించారు
  • నియోజకవర్గ నేతలు పని విభజన చేసుకొని ముందుకు సాగాలి
  • రోజూ ఉదయం 7 గంటల కల్లా బస్తీ బాట పట్టాలని సూచన
  • మల్కాజ్​గిరి లోక్​సభ నియోజకవర్గ నేతలు, కార్యకర్తలతో సమావేశం

హైదరాబాద్​, వెలుగు: మల్కాజ్​గిరి ఎంపీ ఎన్నిక అభ్యర్థిది కాదని, ముఖ్యమంత్రిదని సీఎం, పీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డి అన్నారు. తాను సీఎంగా మాట్లాడుతున్నానంటే దానికి కారణం, గొప్పతనం మల్కాజ్​గిరి లోక్​సభ నియోజకవర్గ నేతలు, కార్యకర్తలదేనని చెప్పారు. ‘‘ఆ నాడు కొందరు నాయకులు అమ్ముడుపోయినా కార్యకర్తలు భుజాలపై మోసి నన్ను ఎంపీగా  గెలిపించి ఢిల్లీకి పంపించారు. ఆనాటి మల్కాజ్​గిరి గెలుపే నాకు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అయ్యేలా చేసింది. కాబట్టి, ఇప్పుడు మల్కాజ్​గిరి లోక్​సభ స్థానంలో గెలవడం చాలా ప్రతిష్ఠాత్మకం. 

అక్కడ కాంగ్రెస్​ జెండాను ఎగరేయాల్సిందే” అని అన్నారు. గురువారం ఆయన జూబ్లీహిల్స్​లోని తన ఆఫీసులో మల్కాజ్​గిరి లోక్​సభ నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. నియోజకవర్గానికి చెందిన నేతలు, కార్యకర్తలతో  మాట్లాడారు. దేశంలోనే అతిపెద్దదైన మల్కాజ్​గిరి లోక్​సభ స్థానాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ వదులుకోవద్దని, మళ్లీ గెలిచి తీరాలని పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ‘‘నా బలం.. నా బలగం మీరే. నియోజకవర్గంలోని 2,964 బూత్​లకు చెందిన ప్రతి కార్యకర్త  సైనికుడిలా పనిచేసి 2019 లోక్​సభ ఎన్నికల్లో నన్ను గెలిపించారు. 

కేసీఆర్​ పతనం అక్కడి నుంచే మొదలైంది. ఇప్పుడు ఆ సిట్టింగ్​ స్థానాన్ని తిరిగి కైవసం చేసుకునే వరకు కార్యకర్తలు విశ్రమించొద్దు’’ అని ఆయన సూచించారు. నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లకు పోటీ చేసిన అభ్యర్థులు ఐదుగురు సభ్యులతో కమిటీ వేసుకోవాలని, పోలింగ్​బూత్​లవారీగా పని విభజన చేసుకుని సమీక్షించుకోవాలని అన్నారు. శుక్రవారం సాయంత్రం కంటోన్మెంట్​లో కార్యకర్తల సమావేశం నిర్వహించాలని చెప్పారు. ఉదయం 7 గంటలకల్లా ప్రతిరోజూ నాయకులు బస్తీ బాట పట్టాలని ఆయన సూచించారు. ప్రణాళికాబద్ధంగా ప్రచారం నిర్వహించుకోవాలని, మల్కాజ్​గిరి క్యాంపెయిన్​ మోడల్​ రాష్ట్రమంతటా అనుసరించేలా పని చేయాలన్నారు.  

అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ ఆశించిన ఫలితాలు రాలే

అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రమంతటా కాంగ్రెస్​ పార్టీ తుఫానులాగా గెలిచినా.. మల్కాజ్​గిరి లోక్​సభ నియోజకవర్గం పరిధిలో మాత్రం ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదని సీఎం రేవంత్​ రెడ్డి అన్నారు. ఇక్కడి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కనీసం 4 స్థానాలను గెలచుకుని ఉంటే అభివృద్ధి చేసేందుకు ఎక్కువ అవకాశం ఉండేదని పేర్కొన్నారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే మల్కాజ్​గిరి లోక్​సభ నియోజకవర్గంలో కాంగ్రెస్​ జెండా ఎగరాల్సిందేనన్నారు. 

మల్కాజ్​గిరి సహా రాష్ట్రాభివృద్ధి కోసం కేంద్రంతో సఖ్యతగా ఉంటున్నామని, మల్కాజ్​గిరి లోక్​సభ పరిధిలో స్కైవేల నిర్మాణానికి శంకుస్థాపన చేసుకున్నామని తెలిపారు. మెట్రో, ఎంఎంటీఎస్​ రావాలన్నా, జవహర్​నగర్​ డంప్​ యార్డు సమస్య తీరాలన్నా ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్​ను తిరిగి గెలిపించుకోవాలన్నారు. లోక్​సభ స్థానంతో పాటు కంటోన్మెంట్​ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలోనూ గెలిచి తీరాలని చెప్పారు. బలమైన నాయకత్వం ఉందని, సమన్వయంతో ముందుకెళ్లాలని నేతలకు, కార్యకర్తలకు ఆయన సూచించారు. 

కష్టపడిన వారిని ప్రభుత్వంలో భాగస్వాములను చేసే బాధ్యత తనదని హామీ ఇచ్చారు. హోలీ పండుగలోపు పార్టీ అధిష్ఠానం లోక్​సభ అభ్యర్థులను ప్రకటిస్తుందని సీఎం రేవంత్​ తెలిపారు. కాగా, వంద రోజుల పాటు పూర్తిగా పాలనపైనే దృష్టి పెట్టామని సీఎం రేవంత్​ రెడ్డి చెప్పారు. ‘‘మహిళలకు ఉచిత  బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ పరిమితి రూ.10 లక్షలకు పెంపు, రూ.500కే గ్యాస్​ సిలిండర్​, 200 యూనిట్ల ఉచిత విద్యుత్​ పథకాలను అమలు చేసుకుంటున్నం. మూడు నెలల్లోనే 30 వేల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత మన ప్రభుత్వానిది’’ అని నేతలు, కార్యకర్తలతో సీఎం రేవంత్​రెడ్డి అన్నారు. 

సీఎం రేవంత్ రెడ్డికి నూతి శ్రీకాంత్ కృతజ్ఞతలు

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి‌‌ని గురువారం ఆయన నివాసంలో బీసీ ఆర్థిక సహకార సంస్థ చైర్మన్, టీపీసీసీ ఓబీసీ సెల్ చైర్మన్ నూతి శ్రీకాంత్ కలిశారు. తనకు కార్పొరేషన్ చైర్మన్ పదవి వచ్చేలా సహకరించినందుకు సీఎం రేవంత్‌‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. బీసీ సహకార సంస్థకు పూర్తి స్థాయి మద్దతు ఇస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీఎం ముఖ్య సలహాదారు వేం నరేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు.