బీఆర్​ఎస్​ ఓట్లు కూడా మనకే పడాలి : రేవంత్​రెడ్డి

బీఆర్​ఎస్​ ఓట్లు కూడా మనకే పడాలి : రేవంత్​రెడ్డి
  • ఆ పార్టీ పని అయిపోయింది.. బీజేపీతోనే మనకు పోటీ
  • కాంగ్రెస్​ నేతలతో సీఎం, పీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డి 
  • భువనగిరి లోక్​సభ సెగ్మెంట్​ ఎన్నికల ఇన్​చార్జ్​గా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి
  • జనగామ అసెంబ్లీ సెగ్మెంట్ బాధ్యతలు కొమ్మూరి ప్రతాప్ రెడ్డికి
  • ఈ నెల 21న పార్టీ అభ్యర్థి చామల కిరణ్​కుమార్​రెడ్డి నామినేషన్
  • వచ్చే నెల మొదటి వారంలో మిర్యాలగూడ, చౌటుప్పల్​లో ప్రియాంక సభలు
  • భువనగిరి లోక్​సభ నియోజకవర్గ సమీక్షలో సీఎం రేవంత్​ వెల్లడి

హైదరాబాద్, వెలుగు: లోక్​సభ ఎన్నికల్లో బీఆర్​ఎస్​ ఓట్లు కూడా కాంగ్రెస్​కే పడేలా చూడాలని కాంగ్రెస్​ నేతలతో సీఎం, పీసీసీ చీఫ్​ రేవంత్​ రెడ్డి అన్నారు. బీఆర్​ఎస్​ పని అయిపోయిందని, ఆ పార్టీని పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. ‘‘కేంద్రంలో బీజేపీ సర్కార్ అవలంబిస్తున్న రైతు, నిరుద్యోగ, ప్రజా వ్యతిరేక విధానాలను ఇంటింటికి వెళ్లి వివరించాలి. గత పదేండ్లలో తెలంగాణను బీఆర్ఎస్ ఎలా దోచుకుంది.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే అమలు చేస్తున్న పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను కూడా జనానికి చెప్పాలి. 

తుక్కుగూడ సభలో విడుదల చేసిన కాంగ్రెస్ జాతీయ స్థాయి మేనిఫెస్టోలోని అంశాలను వివరించాలి” అని దిశానిర్దేశం చేశారు. బుధవారం జూబ్లీహిల్స్ లోని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంట్లో భువనగిరి లోక్​సభ సెగ్మెంట్​ఎమ్మెల్యేలు, పార్టీ అభ్యర్థి, ఇతర ముఖ్య నేతలతో ఆయన సమావేశమై రివ్యూ నిర్వహించారు. కోమటిరెడ్డి బ్రదర్స్​కు భువనగిరి కంచుకోట అని, టికెట్​ ఎవరికిచ్చినా పని చేస్తామని వారు ప్రకటించారని చెప్పారు. అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డికి పార్టీ టికెట్ ఇచ్చినందున ఆయన గెలుపు కోసం కలిసికట్టుగా ముందుకెళ్లాలని, అందులో భాగంగానే తాను ఇక్కడికి వచ్చానని సీఎం రేవంత్​ తెలిపారు. భువనగిరి లోక్​సభ నియోజకవర్గంలో కాంగ్రెస్​కు బీఆర్ఎస్  పోటీ కాదని, గులాబీ ఓట్లన్నీ కాంగ్రెస్ కే పడేలా బూత్ స్థాయిలో కార్యకర్తలను నేతలు అప్రమత్తం చేయాలని ఆయన సూచించారు. 

బీజేపీతోనే కాంగ్రెస్​కు పోటీ అని చెప్పారు. జనగామలో కాంగ్రెస్​ పార్టీకి ఎమ్మెల్యే లేరని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అక్కడ భారీ మెజార్టీ తీసుకువచ్చే బాధ్యత తనదని సీఎం రేవంత్​ భరోసా ఇచ్చారు. ఈ నియోజకవర్గ కో ఆర్డినేషన్ బాధ్యతలను కొమ్మూరి ప్రతాప్ రెడ్డి చూసుకుంటారని, భువనగిరి లోక్ సభ నియోజకవర్గ ఇన్​చార్జ్​గా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహరిస్తారని ప్రకటించారు. ఈ నెల 21 న పార్టీ అభ్యర్థిగా చామల కిరణ్ కుమార్ రెడ్డి జనగామలో నామినేషన్ వేస్తారని, కార్యక్రమానికి తనతో పాటు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఇతర ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నేతలు హాజరవుతారని వివరించారు. 

వచ్చే నెల ఫస్ట్​ వీక్​లో ప్రియాంక పర్యటన

వచ్చే నెల మొదటి వారంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ పర్యటిస్తారని సీఎం రేవంత్ వెల్లడించారు. నల్గొండ లోక్​సభ నియోజకవర్గ పరిధిలోని మిర్యాలగూడలో ఉదయం, భువనగిరి లోక్​సభ నియోజకవర్గ పరిధిలోని చౌటుప్పల్​లో సాయంత్రం ప్రియాంక గాంధీ సభలు ఉంటాయని తెలిపారు.

ముస్లింలకు సీఎం రేవంత్​ రంజాన్​ శుభాకాంక్షలు

ముస్లింలకు సీఎం రేవంత్ రెడ్డి రంజాన్‌‌ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈద్‌‌ ఉల్‌‌ ఫితర్‌‌ వేడుకలను రాష్ట్రంలోని ముస్లింలందరూ ఆనందంగా జరుపుకొని, అల్లా దీవెనలను అందుకోవాలని ఆకాంక్షించారు.  అన్ని సేవలకు మించి మానవ సేవ అత్యున్నతమైనదని చాటి చెప్పే రంజాన్ పండుగ లౌకిక వాదానికి, మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు.  రంజాన్‌‌ మాసంలో ఉపవాస దీక్షలు, ప్రార్థనలు, జకాత్, ఫిత్రా పేరుతో పేదలకు చేసే దాన ధర్మాలు మానవాళికి ఆదర్శంగా నిలుస్తాయన్నారు. ముస్లింల అభ్యున్నతికి తమ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందని తెలిపారు. తెలంగాణ సుభిక్షంగా ఉండాలని, ప్రజలంతా కలిసి మెలిసి సుఖ సంతోషాలతో జీవించేలా అల్లా అశీర్వాదాలుండాలని సీఎం రేవంత్​ రెడ్డి ప్రార్థించారు.