తిరుమల శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు సీఎం చంద్రబాబు భువనేశ్వరి దంపతులు. బుధవారం ( సెప్టెంబర్ 24 ) తిరుమలకు చేరుకున్న ఆయన రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అర్చకులు చంద్రబాబుకు పరివట్టం చుట్టగా.. తలపై వెండిపళ్లెంలో పట్టువస్త్రాలను ఉంచారు ఈవో అనిల్ కుమార్ సింఘాల్. మంగళవాయిద్యాల నడుమ ఆలయానికి చేరుకొని పట్టు వస్త్రాలను బహూకరించి స్వామివారిని దర్శించుకున్నారు సీఎం చంద్రబాబు.
అనంతరం రంగనాయకుల మండపంలో టీటీడీ 2026 క్యాలెండర్లు ఆవిష్కరించారు సీఎం చంద్రబాబు. చంద్రబాబు సీఎం హోదాలో స్వామివారికి 15వ సారి పట్టు వస్త్రాలు సమర్పించడం విశేషం. సీఎం పర్యటన సందర్భంగా తిరుమలలో భద్రత పటిష్టం చేశారు అధికారులు. ఇదిలా ఉండగా తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.. తిరుమల శ్రీవారికి సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు వైభవంగా జరుగనున్నాయి.
వాహన సేవల వివరాలు:
- సెప్టెంబర్24 : సాయంత్రం 05:43 నుంచి 6.15 వరకు మీన లగ్నంలో ధ్వజారోహణం... రాత్రి 9 గంటలకు పెద్ద శేష వాహనం.
- సెప్టెంబర్ 25 : ఉదయం 8 గంటలకు చిన్న శేష వాహనం.. మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల వరకు స్నపనం.. రాత్రి 7 గంటలకు హంస వాహనం
- సెప్టెంబర్ 26 : ఉదయం 8 గంటలకు సింహ వాహనం... మధ్యాహ్నం 1 గంటకు స్నపనం, రాత్రి 7 గంటలకు ముత్యపు పందిరి వాహనం
- సెప్టెంబర్27 : ఉదయం 8 గంటలకు కల్పవృక్షం వాహనం..మధ్యాహ్నం 1 గంటకు స్నపనం.. రాత్రి 7 గంటలకు సర్వ భూపాల వాహనం
- సెప్టెంబర్28 : ఉదయం 8 గంటలకు మోహినీ అవతారం... సాయంత్రం 6:30 నుంచి రాత్రి గరుడ వాహనం
- సెప్టెంబర్29 : ఉదయం 8 గంటలకు హనుమంత వాహనం.... సాయంత్రం 4 గంటలకు స్వర్ణ రథం... రాత్రి 7 గంటలకు గజ వాహనం
- సెప్టెంబర్30 :ఉదయం 8 గంటలకు సూర్యప్రభ వాహనం... రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహనం
- అక్టోబర్ 1 :ఉదయం 7 గంటలకు రథోత్సవం, రాత్రి 7 గంటలకు అశ్వ వాహనం
- అక్టోబర్ 2: ఉదయం 6 నుండి 9 వరకు చక్రస్నానం... రాత్రి 8:30 నుంచి 10 గంటల వరకు ధ్వజావరోహణం.
