కాశీబుగ్గ ఆలయంలో 10కి చేరిన మృతులు : సీఎం చంద్రబాబు, దేవాదాయ మంత్రి స్పందన ఇదీ..!

కాశీబుగ్గ ఆలయంలో 10కి చేరిన మృతులు : సీఎం చంద్రబాబు, దేవాదాయ మంత్రి స్పందన ఇదీ..!

ఏపీలోని కాశీబుగ్గలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. చిన్న తిరుపతిగా పేరుగాంచిన  కాశీబుగ్గ శ్రీ వెంకటేశ్వరం ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఈఘటనలో 10 మంది మృతి చెందగా.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. శనివారం ( నవంబర్ 1 )  కార్తీక మాసం, ఏకదాశి కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు.  ఈ క్రమంలో  క్యూ లైన్లలో  ఏర్పాటు చేసిన రెయిలింగ్ కిందపడటంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనపై స్పందించిన సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. కాశీబుగ్గ తొక్కిసలాట ఘటన బాధాకరమని.. తొక్కిసలాటలో అమాయకులు చనిపోయారని అన్నారు.

ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు చంద్రబాబు. స్వామివారి దర్శనానికి వెళ్తే.. ఇలా జరగడం బాధాకరమని అన్న చంద్రబాబు మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని అన్నారు సీఎం చంద్రబాబు. 

►ALSO READ | కాశీబుగ్గ ఆలయ తొక్కిసలాట మృతుల కుటుంబాలకు కేంద్రం ఎక్స్‎గ్రేషియా

ఈ ఘటనపై దేవాదాయ శాఖ మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి స్పందిస్తూ తొక్కిసలాట జరిగిన కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయం ప్రభుత్వ నిర్వహణలో లేదని.. హరిముకుంద్‌పండా అనే ఒక వ్యక్తి తనకు చెందిన 12 ఎకరాల సొంత భూమిలో తన సొంత నిధులతో నిర్మించిన ఒక ప్రైవేటు దేవాలయమని అన్నారు. ఆలయ సామర్థ్యం 2,000 నుంచి 3,000 మంది వరకు మాత్రమే ఉందని.. ఈరోజు ఏకాదశి కావడంతో ఒక్కసారిగా 25,000 మంది వరకు రావడం జరిగిందని అన్నారు. 

అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేయడం కానీ... ప్రభుత్వానికి సమాచారం ఇవ్వడం కానీ యాజమాన్యం చేయలేదని అన్నారు. తొక్కిసలాటకు ఇదే ప్రధాన కారణమని అన్నారు మంత్రి. సీఎం ఆదేశాలతో సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నామని.. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నామని అన్నారు. కాగా.. తొక్కిసలాటకు ప్రధాన కారణం క్యూ లైన్లలో ఏర్పాటు చేసిన రెయిలింగ్ విరిగిపోవడమేనని ప్రాథమికంగా తెలుస్తోంది. 2025, నవంబర్ 1న కార్తీక మాసం ఏకదాశి కావడంతో భక్తులు పెద్ద ఎత్తున కాశీబుగ్గ ఆలయానికి  తరలివచ్చారు. 

భక్తుల సంఖ్యను అంచనా వేయడంలో విఫలమైన నిర్వాహకులు అందుకు తగిన ఏర్పాట్లు చేయకపోవడంతో ఆలయ ప్రాంగణంలో ఉన్న రెయిలింగ్ కూలి తొక్కిసలాట చోటు చేసుకున్నట్లు సమాచారం. ఈ తొక్కిసలాటలో ఇప్పటి వరకు 10 మంది భక్తులు మరణించినట్లు తెలుస్తోంది. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.