- రూరల్ టు గ్లోబల్ క్రీడా పోటీలు
- క్రీడాజ్యోతులతో ర్యాలీలు
ఆదిలాబాద్/నిర్మల్/కోల్బెల్ట్/చెన్నూరు/లక్సెట్టిపేట, వెలుగు: ‘రూరల్ టు గ్లోబల్’ నినాదంతో గ్రామీణ స్థాయి క్రీడాకారులను రాష్ట్ర, జాతీయ స్థాయికి తీసుకెళ్లడమే సీఎం కప్ లక్ష్యమని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా అన్నారు. సీఎం కప్-2025 రెండో సీజన్ క్రీడా పోటీలను పురస్కరించుకుని పట్టణంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో గురువారం క్రీడా జ్యోతిని వెలిగించి కలెక్టర్ ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని యువ క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకే ప్రభుత్వం సీఎం కప్ పోటీలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందన్నారు.
జిల్లాలోని యువత పెద్ద సంఖ్యలో ఈ పోటీల్లో పాల్గొని తమ క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించాలని పిలుపునిచ్చారు. ఈ నెల 17 నుంచి ప్రారంభమవుతాయని, గ్రామీణ, మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్రస్థాయిలో క్రీడా పోటీలు ఉంటాయని తెలిపారు. అడిషనల్ కలెక్టర్లు శ్యామలాదేవి, రాజేశ్వర్, ట్రైనీ కలెక్టర్ సలోని చబ్రా, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
క్రీడా నైపుణ్యాలను పెంచేందుకే పోటీలు
విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాలను పెంపొందించేందుకే సీఎం కప్ పోటీలు నిర్వహిస్తున్నామని, స్టూడెంట్లు అధిక సంఖ్యలో పాల్గొనాలని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ పిలుపునిచ్చారు. పట్టణంలోని శివాజీ చౌక్ నుంచి ఎన్టీఆర్ మినీ స్టేడియం వరకు క్రీడాజ్యోతితో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
అనంతరం స్టేడియంలో కలెక్టర్ మాట్లాడుతూ.. మొత్తం 44 క్రీడాంశాల్లో ఈ పోటీలను నిర్వహిస్తున్నామన్నాని జిల్లా విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొనాలని సూచించారు. అడిషనల్ కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, డీవైఎస్ వో శ్రీకాంత్ రెడ్డి, డీఈవో భోజన్న, సీపీవో జీవరత్నం, మైనార్టీ సంక్షేమ అధికారి మోహన్ సింగ్, ఎల్డీఎం రాంగోపాల్, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
మందమర్రిలోని మోడల్ స్కూల్వద్ద ఎంపీడీవో రాజేశ్వర్క్రీడా జ్యోతిని వెలిగించి ర్యాలీ ప్రారంభించారు. మండల పంచాయతీ అధికారి సత్యనారాయణ, ఎంఈవో రమేశ్ రాథోడ్, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్సారా తస్నీమ్తదితరులు పాల్గొన్నారు. చెన్నూరులో హైస్కూల్ గ్రౌండ్ నుంచి అంబేద్కర్ చౌక్ అధికారులు, నేతలు వరకు ర్యాలీ నిర్వహించారు. ఎంపీవో అజ్మత్ అలీ, మున్సిపల్ కమిషనర్ గంగాధర్, పీఈటీలు, నేతలు పాల్గొన్నారు. లక్సెట్టిపేటలో బస్టాండ్ నుంచి ఊత్కూర్ చౌరస్తా మీదుగా అధికారులు, విద్యార్థులు ర్యాలీ తీశారు.
