కేంద్ర విద్యుత్ బిల్లుపై అసెంబ్లీలో పాత పాటే పాడిన సీఎం

కేంద్ర విద్యుత్ బిల్లుపై అసెంబ్లీలో పాత పాటే పాడిన సీఎం
  • గత బడ్జెట్ సెషన్‌‌లో చర్చించిన దానిపైనే ఒకరోజంతా చర్చ
  • మూడోరోజు సభకు రాని కేసీఆర్
  • ప్రశ్నోత్తరాలు, జీరో అవర్ రద్దుతో సమస్యలు చెప్పలేకపోయిన ఎమ్మెల్యేలు
  • గురుకులాలు, వీఆర్ఏలు, టీచర్ల సమస్యల ఊసెత్తలే
  • మూడు రోజుల్లో 8 బిల్లులను పాస్ చేసిన అసెంబ్లీ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని కీలక సమస్యలపై కనీస ప్రస్తావన లేకుండానే అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. తొలి రోజు ఆరు నిమిషాలకే సభ వాయిదా పడగా.. మిగతా రెండు రోజులు కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు, ఆరోపణలతోనే సరిపోయింది. దీంతో ఐదు నెలల తర్వాత సమావేశమైన అసెంబ్లీలో కీలకమైన సమస్యలపై చర్చనేదే లేకుండా పోయింది. ప్రశ్నోత్తరాలు, జీరో అవర్‌‌‌‌ను రద్దు చేయటంతో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆయా నియోజకవర్గాల్లోని సమస్యలను ప్రస్తావించలేకపోయారు. ఈ మూడు రోజుల సమావేశాలను 3 స్టేట్‌‌మెంట్లు, ఎనిమిది బిల్లుల ఆమోదంతో సర్కారు సరిపెట్టింది. మూడో రోజున సీఎం కేసీఆర్ అసెంబ్లీకి హాజరు కాలేదు. నిజానికి కేంద్ర ప్రభుత్వం తెచ్చిన విద్యుత్ సవరణ బిల్లును వెనక్కి తీసుకోవాలని, మోటార్లకు మీటర్లు పెట్టేది లేదని మార్చి 15న బడ్జెట్ సమావేశాల్లోనే సీఎం చెప్పారు. ఈసారి కూడా అదే విషయంపై అసెంబ్లీ, కౌన్సిల్‌‌లో ఒక రోజంతా చర్చించటం గమనార్హం. రెండో రోజున అసెంబ్లీలో కేసీఆర్.. విద్యుత్ బిల్లుతో పాటు కేంద్రం విధానాలపైనే గంటన్నరకు పైగా మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఎడాపెడా చేస్తున్న అప్పులను కట్టడి చేసేందుకు నిర్దేశించిన ఎఫ్ఆర్‌‌‌‌బీఎం, రాష్ట్ర విభజన హామీల అమలు అంశాలపై షార్ట్ డిస్కషన్​మూడో రోజున కొనసాగింది. ఇవి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేసేవి కావటం గమనార్హం.

ఈ సమస్యలను పట్టించుకోలే

రాష్ట్రంలో రోజుకో చోట సంక్షేమ హాస్టళ్లు, ప్రభుత్వ గురుకులాల్లో విద్యార్థులు రోడ్డెక్కుతున్నారు. అన్నం సరిగ్గా లేదని, తాగేందుకు నీళ్లు లేవని ఆందోళనకు దిగుతున్నారు. ఫుడ్ పాయిజన్‌‌తో విద్యార్థులు ఆసుపత్రి పాలవటం, జ్వరాలు, పాముకాటుతో చనిపోయిన సంఘటనలు జరుగుతున్నాయి. రెండు వారాల్లో ఆరుగురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు పేస్కేల్​అమలు చేయాలని రాష్ట్రవ్యాప్తంగా వీఆర్ఏలు చేపట్టిన ఆందోళన యాభై రోజులకు చేరుకుంది. సమ్మె మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు జీతం అందక.. వివిధ కారణాలతో 29 మంది వీఆర్ఏలు చనిపోయారు. స్పౌజ్ బదిలీలు చేపట్టాలని టీచర్లు చేస్తున్న ఆందోళనలను అణచివేయటం తప్ప ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. గోదావరి ఉప్పొంగి ఉమ్మడి ఆదిలాబాద్‌‌ నుంచి భద్రాద్రి జిల్లా వరకు వేలాది మంది నష్టపోయారు. రూ.10 వేల చొప్పున నగదు సాయం ఇస్తామని సీఎం ప్రకటించినా.. ఆ హామీ అమలు చేయలేదు. దీనిపైనా మాట్లాడలేదు.

అసెంబ్లీ 11 గంటలు.. మండలి 11.42 గంటలు

మూడు రోజుల పాటు సాగిన అసెంబ్లీ, మండలి సమావేశాలు మంగళవారం నిరవధికంగా వాయిదా పడ్డాయి. అసెంబ్లీ 11 గంటలు నడిచింది. సీఎం కేసీఆర్‌‌ 1.40 గంటలు, మంత్రులు 4.23 గంటలు మాట్లాడారు. టీఆర్‌‌ఎస్‌‌ సభ్యులు 1.25 గంటలు, కాంగ్రెస్‌‌ సభ్యులు 2.18 గంటలు, ఎంఐఎం సభ్యులు 38 నిమిషాలు, బీజేపీ ఎమ్మెల్యే 36 నిమిషాలు మాట్లాడారు. మూడు అంశాలపై చర్చించి, ఎనిమిది బిల్లులు పాస్‌‌ చేశారు. మండలి 11.42 గంటల పాటు సమావేశమవగా, నాలుగు అంశాలపై లఘు చర్చ నిర్వహించారు. మంత్రులు, ఎమ్మెల్సీలు కలిపి 50 మంది సభ్యులు మాట్లాడారు.