తెలంగాణ నుంచి రూ.7,230 కోట్ల విద్యుత్ బకాయిలు ఇప్పించండి

తెలంగాణ నుంచి రూ.7,230 కోట్ల విద్యుత్ బకాయిలు ఇప్పించండి
  • కేంద్ర ప్రభుత్వానికి జగన్ విజ్ఞప్తి
  • ఆరు నెలల్లో మూడుసార్లు ప్రధానిని కలిసిన ఏపీ సీఎం 

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సిన రూ. రూ.7,230.14 కోట్ల విద్యుత్  బకాయిలను ఇప్పించాలని ఆ రాష్ట్ర సీఎం జగన్  మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బుధవారం ఢిల్లీకి వెళ్లిన ఆయన.. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర విభజన సహా ఏపీ, తెలంగాణ మధ్య పెండింగ్ లో ఉన్న అంశాలపై సత్వరమే దృష్టిపెట్టాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా 2014 జూన్‌ నుంచి 2017 జూన్‌  వరకూ తెలంగాణ రాష్ట్రానికి సరఫరా చేసిన విద్యుత్‌కు సంబంధించిన బకాయిలను తెలంగాణ ప్రభుత్వం చెల్లించేలా చొరవ తీసుకోవాలని కోరారు. 

ఈ బకాయిలు దీర్ఘకాలంగా పెండింగ్​లో ఉన్నాయని, ఏపీ జెన్‌కో ఎదుర్కొంటున్న తీవ్ర ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా బకాయిలు చెల్లించేలా చూడాలని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. అలాగే ఏపీకి సంబంధించి పోలవరం ప్రాజెక్టు, జాతీయ ఆహార భద్రతా చట్టం అమల్లో హేతుబద్ధత, విభజన సమయంలో రాష్ట్రానికి ఇచ్చిన హామీల అమలు, కొత్త మెడికల్‌  కాలేజీలకు ఆర్థిక సహాయం తదితర అంశాలపైనా ప్రధానితో జగన్  చర్చించారు. -ప్రత్యేక హోదా సహా పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీలపై దృష్టిపెట్టాలన్నారు. పాలనా సౌలభ్యం కోసం రాష్ట్రంలోని 13 జిల్లాలను 26 జిల్లాలుగా మార్చినందున -ప్రజలకు అత్యుత్తమ వైద్య సేవలు అందించేందుకు గతంలో ఉన్న 11 కాలేజీలకు తోడు అదనంగా మరో 17 కాలేజీల నిర్మాణాలను చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. కాగా గడిచిన ఆరు నెలల్లో ప్రధానితో జగన్  భేటీ కావడం ఇది మూడోసారి.