నటుడు కైకాల సత్యనారాయణ ఆరోగ్యంపై జగన్ ఆరా

V6 Velugu Posted on Nov 23, 2021

అమరావతి: సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆరా తీశారు. కరోనా అనంతర ఆరోగ్య సమస్యలతో కొన్ని రోజులుగా హైదరాబాద్ లో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. పరిస్థితి విషమంగా మారడంతో ఆయనకు ఐసీయూలో వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం ఇంట్లో జారిపడడంతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందారు. తర్వాత కొద్ది రోజులకు అస్వస్థతకు గురికాగా వైద్య బృందం చికిత్స చేస్తుండగా ఆయన కోమాలోకి వెళ్లినట్లు ప్రచారం జరిగింది.

చికిత్సకు సరిగా స్పందించడం లేదని వైద్యులు ప్రకటించిన కొద్ది సమయానికే ఆయన స్పృహలోకి రాగా.. సీనియర్ నటుడు చిరంజీవి ఫోన్ ద్వారా పలుకరించి ధైర్యం చెప్పారు.  ఆయన వెంటనే కోలుకునేలా వైద్య బృందం చికిత్స చేస్తుండగా.. ఏపీ సీఎం వైఎస్ జగన్ స్పందించి కైకాల సత్యనారాయణ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. కైకాల సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. వైద్యులతో కూడా జగన్ ఆరా తీయగా.. బీపీ లెవెల్స్ చాలా తక్కువగా ఉన్నాయని వైద్యులు తెలిపారు. వాసో ప్రెజర్ సాయంతో కైకాలకు వైద్య చికిత్స కొనసాగుతోందని.. తమ బృందం నిరంతరం పర్యవేక్షిస్తూ ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి తిరిగి వెళ్లేలా చికిత్స అందిస్తున్నామని వివరించారు.
 

Tagged Telugu actor, tollywood, Health Condition, Telugu film industry, telugu cinema industry, senior actor, Kaikala Satyanarayana

Latest Videos

Subscribe Now

More News