కొత్తగా మరో 146 అంబులెన్సులు.. ప్రారంభించిన సీఎం జగన్

కొత్తగా మరో 146  అంబులెన్సులు..  ప్రారంభించిన సీఎం జగన్

వైద్యరంగంలో పలు మార్పులు  చేసేందుకు జగన్ సర్కారు మరో అడుగు ముందుకు వేసింది. 108 అంబులెన్స్‌ సేవలను మరింత బలోపేతం చేసేలా సీఎం జగన్‌ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా 146 కొత్త అంబులెన్స్‌ లను ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఈ అంబులెన్స్‌ లను 2023 జులై 03 సోమవారం సీఎం వైఎస్‌ జగన్‌ తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో ప్రారంభించారు.

గతంలో రూ. 96.50 కోట్లతో అధునాతన సౌకర్యాలతో 412 కొత్త అంబులెన్స్‌లు కొనుగోలు చేశారు. అయితే పాత వాటికి మరమ్మతులు చేసి 748 అంబులెన్స్‌లతో 108 సేవలను విస్తరించారు. గత ఏడాది అక్టోబర్‌లో రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల ప్రజల కోసం రూ. 4.76 కోట్లతో ప్రత్యేకంగా 20 అదనపు అంబులెన్సులు కొనుగోలు చేశారు. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో అంబులెన్సుల సంఖ్య 768కు పెరిగింది. 

కొత్త అంబులెన్సులను ప్రవేశపెట్టడం కోసం రూ.34.79 కోట్లతో 146 అంబులెన్స్‌లను ప్రభుత్వం కొనుగోలు చేసింది. 108 సేవల కోసం ఏటా ప్రభుత్వం రూ.188.56 కోట్లు ఖర్చు పెడుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 108 అంబులెన్స్‌లు రోజుకు 3,089 కేసులకు అటెండ్‌ అవుతున్నాయి. 2020 జూలై నుంచి ఇప్పటి వరకు 33,35,670 ఎమర్జెన్సీ కేసుల్లో అంబులెన్స్‌లు సేవలందించాయి.