నీట మునిగిన ప్రతి ఇంటికీ రూ.10 వేలు

నీట మునిగిన ప్రతి ఇంటికీ రూ.10 వేలు

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్​లో వరద ముంపునకు గురైన  ప్రతి ఇంటికీ రూ. 10 వేల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామని సీఎం కేసీఆర్​ ప్రకటించారు. ఈ ఆర్థిక సాయం మంగళవారం ఉదయం నుంచే అందిస్తామన్నారు. వర్షాలు, వరదలతో ఇండ్లు పూర్తిగా కూలిపోయిన వారికి రూ. లక్ష చొప్పున, పాక్షికంగా కూలిపోయినవారికి రూ. 50 వేల చొప్పున ఆర్థిక సాయం చేయనున్నట్లు వెల్లడించారు. దెబ్బతిన్న రోడ్లు, ఇతర మౌలిక వసతులకు యుద్ధ ప్రాతిపదికన రిపేర్లు చేపట్టి మళ్లీ మామూలు జీవన పరిస్థితులు నెలకొనేలా చూడాలని ఆఫీసర్లను ఆదేశించారు. పేదలకు సాయం అందించడం కోసం మున్సిపల్​ శాఖకు ప్రభుత్వం రూ. 550 కోట్లు వెంటనే విడుదల చేస్తున్నదని ఆయన ప్రకటించారు.  భారీ వర్షాలు, వరదలతో హైదరాబాద్​ నగరంలోని లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు ఎన్నో కష్టనష్టాలకు గురయ్యారని, వారిని ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. వరద నీటిలో మునిగిన ప్రాంతాల్లోని ఇండ్లలో  నివసిస్తున్న వారు ఎంతో నష్టపోయారని, ఇండ్లలోకి నీళ్లు రావడంతో బియ్యం సహా ఇతర ఆహార పదార్థాలు తడిసి పోయాయని పేర్కొన్నారు. ‘‘గడిచిన వందేండ్లలో ఎన్నడూ లేనంత భారీ వర్షం హైదరాబాద్​లో కురిసింది. ప్రజలు అనేక కష్ట నష్టాలకు గురయ్యారు. ముఖ్యంగా నిరుపేదలు, బస్తీల్లో ఉండేవాళ్లు, లోతట్టు ప్రాంతాల్లో నివసించేవారు ఎక్కువ కష్టాలపాలయ్యారు. వారిని ఆదుకోవడం ప్రభుత్వ ప్రాథమిక విధి. ఇంత కన్నా ముఖ్యమైన బాధ్యత మరొకటి ఉండదు’’ అని సీఎం పేర్కొన్నారు. హైదరాబాద్​ నగర పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి ,మేడ్చల్​ జిల్లాల కలెక్టర్లు వారి బృందాలతో వెంటనే రంగంలోకి దిగి మంగళవారం ఉదయం నుంచే ఆర్థిక సాయం కార్యక్రమం చేపట్టాలని ఆదేశించారు. సిటీలో  200 నుంచి 250 టీమ్​లను ఏర్పాటు చేసి, అన్ని చోట్లా ఆర్థిక సాయం అందించే కార్యక్రమాన్ని పర్యవేక్షించాలని సీఎస్​ సోమేశ్​కుమార్​ కు సూచించారు.

సీఎంఆర్​ఎఫ్​కు విరాళాలు ఇవ్వండి

భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన  ప్రజలను ఆదుకోవడానికి పారిశ్రామికవేత్తలు, వర్తక, వాణిజ్య, వ్యాపార ప్రముఖులు ముందుకు రావాలని కేసీఆర్​ పిలుపునిచ్చారు. కష్టంలో ఉన్న ప్రజలను ఆదుకోవడానికి ఉదారత చాటాలని కోరారు. సీఎంఆర్​ఎఫ్​ కు విరివిగా విరాళాలు అందించాలని ఆయన అన్నారు. కాగా, వరదలు, వర్షాలతో నష్టపోయిన మన రాష్ట్రానికి తమిళనాడు సీఎం పళని స్వామి సోమవారం రూ. 10 కోట్ల ఆర్థిక సాయం ప్రకటించారు. నగదుతోపాటు బ్లాంకెట్లు, చద్దర్లు, ఇతర సామగ్రి పంపుతామని చెప్పారు. తమిళనాడు ప్రభుత్వానికి, సీఎం పళనిస్వామికి, తమిళనాడు ప్రజలకు సీఎం కేసీఆర్​ కృతజ్క్షతలు తెలియజేశారు.

నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులిచ్చిన సీఎస్

రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. కేసీఆర్ ప్రకటించిన రూ.550 కోట్లను రెవెన్యూ శాఖ ( సీఎంఆర్‌‌‌‌ఎఫ్ ) నుంచి మున్సిపల్ శాఖకు రిలీజ్‌‌ చేస్తూ సీఎస్‌‌ ఉత్తర్వులు జారీ చేశారు.

స్పీడ్​ బోట్లు పంపండి ఏపీ సీఎంను కోరిన కేసీఆర్​ 

భారీ వర్ష సూచన ఉండటంతో సహాయ చర్యల కోసం స్పీడ్ బోట్లు పంపించాలని సోమవారం ఏపీ సీఎం జగన్​ను కేసీఆర్ సోమవారం కోరారు. కేసీఆర్ విజ్ఞప్తికి స్పందించిన జగన్.. సాయాన్ని వెంటనే అందించాలని అధికారులను ఆదేశించారు. సీఎం ఆదేశాల ప్రకారం 8 స్పీడ్​ బోట్లను హైదరాబాద్​కు పంపిస్తున్నట్టు ఏపీ అధికారులు వెల్లడించారు.