భారీ వర్షాలు, వరదల వల్ల హైదరాబాద్ నగరంలోని లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు ఎన్నో కష్టానష్టాలకు గురయ్యారని వారందర్నీ ప్రభుత్వ ఆదుకుంటుందని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. వరద ప్రభావిత ప్రాంతంలో ప్రతి ఇంటికి రూ. 10 వేలు ఇస్తామని, ఇళ్లను పూర్తిగా కోల్పోయిన వారికి రూ. లక్ష సాయం చేస్తామని సీఎం ఓ ప్రకటనలో తెలిపారు. అలాటే ఇళ్లను పాక్షికంగా కోల్పోయినవారికి రూ. 50 వేల ఆర్థిక సాయం అందిస్తామన్నారు. గత వందేళ్లలో ఎన్నూడూ లేనంత వర్షాలు కురిశాయని, పరిస్థితిని చక్కదిద్దడానికి తమ ప్రభుత్వం అహర్నిశలు పనిచేస్తోందన్నారు. మంగళవారం ఉదయం నుంచి ఆర్థిక సాయం పంపిణీ ప్రారంభమవుతుందని తెలిపారు.
హైద్రాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల కలెక్టర్లు బాధితులకు పరిహారం అందించాలని ఆయన ఆదేశించారు. నగరంలో 200 నుండి 250 బృందాలను ఏర్పాటు చేసి అన్ని చోట్ల ఆర్ధిక సహాయం అందించే కార్యక్రమాన్ని పుర్యవేక్షించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ను సీఎం ఆదేశించారు. దెబ్బతిన్న రహదారులు, ఇతర మౌళిక వసతులను యుద్దప్రాతిపదికన చేపట్టాలని ఆయన అధికారులకు సూచించారు.నగరంలో వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలకు ఆర్ధిక సహాయం అందించేందుకు గాను మున్సిఫల్ శాఖకు రూ. 550 కోట్లను తక్షణమే విడుదల చేస్తున్నట్టుగా సీఎం తెలిపారు.
పేదలకు సహాయం అందించడమే అతి ముఖ్యమైన బాద్యతగా స్వీకరించి హైద్రాబాద్ నగరానికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పోరేటర్లు, మేయర్, డిప్యూటీ మేయర్ పనిచేయాలని ఆయన సూచించారు.నష్టపోయిన ప్రజలు ఎందరున్నా కూడ వారిని ఆదుకొంటామని ఆయన చెప్పారు. లక్షల మంది బాధితులున్నా సరే వారిని ఆదుకొంటామని ఆయన చెప్పారు.
