ఆ 12 మందిలో 11 మందికి .. టికెట్ కన్ఫామ్!

ఆ 12 మందిలో 11 మందికి .. టికెట్ కన్ఫామ్!
  • ఆ 12 మందిలో 11 మందికి .. టికెట్ కన్ఫామ్!
  • కాంగ్రెస్ ​నుంచి బీఆర్ఎస్​లో చేరిన ఎమ్మెల్యేలకు కేసీఆర్ ​భరోసా
  • కొత్తగూడెం సీటుపై ఇంకా రాని స్పష్టత
  • టికెట్​పై సిట్టింగ్ ఎమ్మెల్యేలకు పార్టీ హైకమాండ్ ఇండికేషన్
  • మాజీ మంత్రులు, గులాబీ ముఖ్య నేతలకు నిరాశే
  • వాళ్లు పార్టీని వీడకుండా చర్చలు

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్​ను వీడి బీఆర్ఎస్​లో చేరిన ఎమ్మెల్యేలకు మళ్లీ టికెట్​ఇస్తామని పార్టీ హైకమాండ్​ ఇండికేషన్​ ఇచ్చింది. 2018లో కాంగ్రెస్​నుంచి గెలిచి కారెక్కిన 12 మంది ఎమ్మెల్యేలలో 11 మంది అభ్యర్థిత్వాలు దాదాపుగా ఫైనల్​ చేశారు. కొత్తగూడెం సీటుపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. ఒకవేళ కమ్యూనిస్టులతో పొత్తు ఉంటే ఆ స్థానాన్ని సీపీఐకి వదిలేస్తారని.. పొత్తు లేకుండా బీఆర్ఎస్​ పోటీ చేస్తే ఆ స్థానాన్ని కూడా సిట్టింగ్​ఎమ్మెల్యేకే ఇస్తారని పార్టీ ముఖ్యనేత ఒకరు తెలిపారు. వాళ్లు పార్టీలో చేరినప్పుడే మళ్లీ టికెట్ ఇస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారని తెలిపారు. 

ఇప్పుడు ఆయా నియోజకవర్గాల్లో పార్టీకి ప్రతికూల పరిస్థితులున్నా సరే తిరిగి వారినే పోటీకి దింపే ఆలోచనలోనే  కేసీఆర్​ ఉన్నారని చెప్తు న్నారు. 2014 తర్వాత కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ, బీఎస్పీలను వీడి బీఆర్ఎస్​లో చేరిన ఎమ్మెల్యేలందరికీ టికెట్లిచ్చారని.. అందులో కొందరు తిరిగి గెలిచి అసెంబ్లీకి రాగా మరికొందరు ఓడిపోయారని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు కూడా కాంగ్రెస్ ​నుంచి వచ్చిన ఎమ్మెల్యేలకే మళ్లీ చాన్స్ ఇస్తారని చెప్తున్నారు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో పోటీ చేయాలని ప్రయత్నిస్తున్న మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలకు చాన్స్​లేకుండా పోయింది. వాళ్లు పార్టీని వీడి వెళ్లకుండా ప్రగతి భవన్​ నుంచి కొందరు ముఖ్య నేతలు చర్చలు జరుపుతున్నారు.

మళ్లీ చాన్స్​కోసం మాజీ మంత్రుల ప్రయత్నాలు

2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్​88 స్థానాల్లో గెలుపొందగా కాంగ్రెస్ ​నుంచి 19 మంది, టీడీపీ నుంచి ఇద్దరు, బీజేపీ, ఫార్వర్డ్​ బ్లాక్​ నుంచి ఒక్కొక్కరు, ఇండిపెండెంట్​ఒకరు గెలిచారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే ఫార్వర్డ్​ బ్లాక్​తో పాటు ఇండిపెండెంట్​ఎమ్మెల్యే బీఆర్ఎస్​లో చేరారు. 2019 ప్రారంభం నుంచి అదే ఏడాది జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నాటికి 12 మంది కాంగ్రెస్​ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ​పంచన చేరారు. హుజూర్​నగర్​ ఎమ్మెల్యే ఉత్తమ్​కుమార్ ​రెడ్డి నల్గొండ నుంచి ఎంపీగా గెలుపొందడంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో కాంగ్రెస్​ సంఖ్యా బలం ఆరుకు పడిపోయింది. మూడింట రెండు వంతుల మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్​ఎల్పీలో విలీనమవుతామని విజ్ఞప్తి చేయడంతో స్పీకర్​ వారిని బీఆర్ఎస్​ఎల్పీలో విలీనం చేస్తూ బులెటిన్​ జారీ చేశారు. 

ఆత్రం సక్కు (ఆసిఫాబాద్), జాజాల సురేందర్​(ఎల్లారెడ్డి), సుధీర్​రెడ్డి (ఎల్బీ నగర్), సబితా ఇంద్రారెడ్డి (మహేశ్వరం), పైలెట్​ రోహిత్​రెడ్డి (తాండూరు), చిరుమర్తి లింగయ్య (నకిరేకల్), గండ్ర వెంకటరమణారెడ్డి (భూపాలపల్లి), రేగా కాంతారావు (పినపాక), హరిప్రియా నాయక్​(ఇల్లెందు), వనమా వెంకటేశ్వర్​రావు (కొత్తగూడెం), కందాల ఉపేందర్​రెడ్డి (పాలేరు), హర్షవర్ధన్​రెడ్డి (కొల్లాపూర్) కాంగ్రెస్​ను వీడి బీఆర్ఎస్​లో చేరారు. గత ఎన్నికల్లో వీరిపై బీఆర్ఎస్​ నుంచి పోటీ చేసి ఓడిపోయిన మాజీ మంత్రులు తుమ్మల నాగేశ్వర్​రావు (పాలేరు), పట్నం మహేందర్​రెడ్డి (తాండూరు), మాజీ ఎమ్మెల్యేలు వేముల వీరేశం (నకిరేకల్), జలగం వెంకట్రావు (కొత్తగూడెం), తీగల కృష్ణారెడ్డి (మహేశ్వరం) మళ్లీ అవకాశం కోసం ప్రయత్నిస్తున్నారు. తమను కాదని కొత్తగా పార్టీలో చేరిన వారికే ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్తూ మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు (కొల్లాపూర్), మాజీ ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు (పినపాక), కోరం కనకయ్య (ఇల్లెందు) కాంగ్రెస్​లో చేరారు. ఆసిఫాబాద్​నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన కోవ లక్ష్మీకి జెడ్పీ చైర్మన్​పదవి ఇచ్చారు. మాజీ స్పీకర్​మధుసూదనాచారిని ఎమ్మెల్సీని చేశారు. ఎల్లారెడ్డి నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఏనుగు రవీందర్​రెడ్డి గులాబీ పార్టీని వీడి బీజేపీలో చేరారు.. ఇప్పుడు ఆ పార్టీ కూడా వీడుతారని ప్రచారంలో ఉంది. గత ఎన్నికల్లో ఎల్బీ నగర్​నుంచి పోటీ చేసి ఓడిపోయిన రామ్మోహన్​ గౌడ్ తనకు చాన్స్​ఇవ్వాలని కోరుతున్నారు.

ALSO READ:రాజ్యసభకు 11 మంది ఏకగ్రీవం

ఇతర పదవులు ఇచ్చే ఆలోచన..

మాజీ మంత్రి మహేందర్​రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం, తీగల కృష్ణారెడ్డి హైకమాండ్​తో అమీతుమీకి సిద్ధమయ్యారు. నెలాఖరులోగా తమకు అవకాశం ఇవ్వకుంటే పార్టీని వీడటం ఖాయమన్నట్టు సంకేతాలు ఇచ్చారు. వాళ్లతో ప్రగతి భవన్ ​నుంచి ముఖ్య నేతలు చర్చలు జరుపుతున్నారు. పార్టీలోనే కొనసాగాలని రాజకీయంగా ఇతర అవకాశాలపై కేసీఆర్​తో హామీ ఇప్పిస్తామని నచ్చజెప్తున్నారు. కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే జలగం వెంక ట్రావు సైతం కాంగ్రెస్ ​వైపు చూస్తున్నారు. కొందరు పార్టీని వీడటం, మరికొందరికి ఇతరత్రా అవకాశాలు ఇవ్వడంతో మిగతా వాళ్లు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు లైన్​క్లియర్​అయ్యింది. కొత్తగూడెం సీటు విషయంలోనే పార్టీ హైకమాండ్ ​ఇంకా తేల్చలేదు. ఎమ్మెల్యే వనమా కుమారుడు రాఘవపై ఆరోపణలు ఉండటంతో మళ్లీ ఆయననే పోటీకి దించితే ప్రతికూల ఫలితాలు వస్తాయన్న ఆందోళన పార్టీ పెద్దల్లో కనిపిస్తున్నది.  

ఈ సీటు పొత్తులో భాగంగా సీపీఐకి ఇస్తే ఈ గండం నుంచి బయట పడవచ్చు అనే ఆలోచన కూడా పార్టీ నేతలకు ఉన్నట్టు తెలుస్తోంది. ఒకవేళ ఆ సీటు నుంచి బీఆర్ఎస్​ పోటీ చేయాల్సి వస్తే సిట్టింగ్​ఎమ్మెల్యేగా ఉన్న వనమాకే మళ్లీ చాన్స్​ఇస్తామని కొన్ని రోజుల క్రితమే పార్టీ పెద్దలు అభయం ఇచ్చినట్టుగా తెలుస్తోంది. కాంగ్రెస్​నుంచి చేరిన వారికి ఇచ్చిన మాట నిలబెట్టుకునే క్రమంలో తుమ్మల, పట్నం మహేందర్​రెడ్డి, వేముల వీరేశం, తీగల కృష్ణారెడ్డి మాత్రమే సర్దుబాటు చేయాల్సి ఉం టుందని.. ఈ నలుగురికి ఇతర పదవులు ఇద్దామనే ఆలోచనలో పార్టీ అధినాయకత్వం ఉన్నట్టుగా చెప్తున్నారు. త్వరలో ప్రకటించబోయే బీఆర్ఎస్ ​అభ్యర్థుల మొదటి జాబితాలో కాంగ్రెస్ ​నుంచి పార్టీలో చేరిన వారి పేర్ల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుందని చెప్తున్నారు.