భూ నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించాలె

భూ నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించాలె

మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో రాజకీయాలు రంజుగా మారాయి. పోటాపోటీగా సభలు, సమావేశాలతో ప్రచారం హోరెత్తిపోతోంది. బైపోల్ కు సంబంధించి నోటిఫికేషన్ రాకముందే నేతలు మునుగోడుకు క్యూ కడుతున్నారు. గతంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీల అమలు చేయకపోవడంతో భూ నిర్వాసితులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ప్రాజెక్టుల కోసం భూములిచ్చి ఏండ్లు గడుస్తున్నా తమకు నష్టపరిహారం రాలేదని వాపోతున్నారు. తమకు న్యాయం చేయాలని సీఎంను నిలదీస్తాని సిద్ధమయ్యారు. 

సీఎం కేసీఆర్ భూ నిర్వాసితులకు పరిహారం చెల్లించాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. చర్లగూడెం, కిష్టరాయన్ పల్లి రిజర్వాయర్ల నిర్వాసితులకు ఏడున్నరేండ్ల క్రితం ఇచ్చిన హామీని సీఎం కేసీఆర్ నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఉప ఎన్నికల నేపథ్యంలో సిగ్గులేకుండా ముఖ్యమంత్రి మునుగోడులో ఓట్ల కోసం వస్తున్నారని మండిపడ్డారు. న్యాయం కోసం ఆందోళన చేస్తున్న నిర్వాసితులను కలిసి క్షమాపణ చెప్పాలన్నారు. వారికి వడ్డీతో సహా నష్టపరిహారం చెల్లించిన తర్వాతనే మునుగోడులో  ఓట్లడగాలని సూచించారు. 

నల్లగొండ జిల్లా మర్రిగూడలో నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న భూ నిర్వాసితులను అర్ధరాత్రి సమయంలో పోలీసులు అరెస్ట్ చేశారు.దీక్ష చేస్తున్న వారితో పాటు మొత్తం 80మంది భూ నిర్వాసితులను తీసుకెళ్లారు.శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే అక్రమ అరెస్టులు ఏంటని బాధితులు మండిపడుతున్నారు. మునుగోడులో సీఎం కేసీఆర్ సభను అడ్డుకుని తీరుతామంటూ హెచ్చరిస్తున్నారు.