కొత్త చట్టాలతో ఏ ఒక్క నిరుపేదకూ బాధ కలుగకూడ‌దు

కొత్త చట్టాలతో ఏ ఒక్క నిరుపేదకూ బాధ కలుగకూడ‌దు

తెలంగాణ ప్రభుత్వం దార్శనికతతో రూపొందిస్తున్న నూతన చట్టాల అమలు సందర్భంగా, ఏ ఒక్క నిరుపేదకూ బాధ కలుగకుండా, చివరి గుడిసె వరకు వాటి ఫలితాలు అందేలా చూడటమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. నూటికి నూరుశాతం ప్రజలే కేంద్ర బిందువులుగా, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా తీసుకొస్తున్న నూతన చట్టాల అమలు కోసం ప్రజాప్రతినిధులు, అధికారులు 24 గంటలూ శ్రమించాల్సిన అవసరం ఉందన్నారు.

దశాబ్దాల కాలంగా వలసపాలనలో అపరిష్కృతంగా ఉన్న నివాస స్థలాలు, సంబంధిత భూ సమస్యల పరిష్కారానికై మున్సిపాలిటీల పరిధిలోని ప్రజా ప్రతినిధులు, మేయర్లతో సీఎం కేసీఆర్ గురువారం ప్రగతి భవన్ లో సమావేశమయ్యారు. మున్సిపాలిటీల పరిధిలో ఇప్పటికీ ఆన్ లైన్ లో నమోదుకాని ప్రజల ఇండ్లు, ప్లాట్లు, అపార్టుమెంట్ ఫ్లాట్స్, వ్యవసాయేతర ఆస్తుల వివరాలను ఆన్ లైన్ లో నమోదు చేసే ప్రక్రియలో క్షేత్రస్థాయిలో భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి వారికి సూచించారు.

స్వయంపాలనలో తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న విప్లవాత్మక పాలనా సంస్కరణల్లో భాగంగా అమలు పరుస్తున్న వినూత్న చట్టాలు పదికాలాలపాటు ప్రజలకు మేలు చేయనున్నాయని సీఎం పేర్కొన్నారు. అయితే వీటి అమలు క్రమంలో నిరుపేదలకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా చట్టాలను జాగ్రత్తగా కార్యాచరణలో పెట్టాల్సిన బాధ్యత ప్రజా ప్రతినిధులు, అధికారులదే అన్నారు. భూములను క్రమబద్దీకరించడం ద్వారా పేదల నుంచి వచ్చే పైసలతో ఖజానా నింపుకోవాలని తమ ప్రభుత్వం చూడటం లేదని సీఎం ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ధరణి పూర్తిస్థాయిలో రూపుదిద్దుకునే లోపే ప్రజలు ఎదుర్కొంటున్న భూములు, ఆస్తుల సమస్యలన్నింటినీ గుర్తించి, వాటికి విధానపరమైన పరిష్కారాలను రూపొందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. హైదరాబాద్ నగరంలోపాటు, రాష్ట్రంలోని అన్ని మిగతా పట్టణాలు, పల్లెల్లో నివాస స్థలాల సమస్యలేకాకుండా, దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న నిర్మాణాలు, ఇండ్లు, ఆస్తుల సమస్యలను శాశ్వతంగా పరిష్కరించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.