ఒక్క రైతు బంధుతోనే.. ఓట్లొస్తయా? : కేసీఆర్

ఒక్క రైతు బంధుతోనే..    ఓట్లొస్తయా? : కేసీఆర్
  • యాసంగి దున్నకాలకు వేయాలనుకున్నం: కేసీఆర్ 
  • ఈసీకి ఫిర్యాదు చేసి.. కాంగ్రెస్​ రైతుల నోట్లో మట్టి కొట్టింది
  • ఈ దుష్ట శక్తి మూడో తారీఖు దాకనే ఉంటది.. 111 జీవో గురించి ఎవరూ పట్టించుకోలేదు
  • సంగారెడ్డి, ఆందోల్, షాద్​నగర్, చేవెళ్ల సభల్లో బీఆర్ఎస్​ చీఫ్​ కామెంట్స్​

ఒక్క రైతు బంధు పథకం, ఒక్క విడత సాయం పంపిణీతోనే ఓట్లొస్తాయా అని సీఎం కేసీఆర్ ​ప్రశ్నించారు. రైతు బంధు ఇవ్వడం ఇది ఆరోసారి అని, ఇప్పుడు కొత్తగా ఇవ్వడం లేదని ఆయన స్పష్టం చేశారు. 

‘‘ఇప్పుడు టైం వచ్చింది. రైతులు పొలాలు తడుపుతున్నరు. యాసంగి దున్నకాలకు రైతుబంధు వేయాలి కాబట్టి వేయాలనుకున్నం. దాన్ని ఇయ్యొద్దని కాంగ్రెసోళ్లు రోజూ ఈసీకి దరఖాస్తు చేస్తున్నారు. ఇది రెగ్యులర్​కార్యక్రమం.. కొత్తగా పెట్టింది కాదు. మంగళవారం ఒక్క రోజు అవకాశం ఉండే.. కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి పోయి రైతుబంధు ఆపించారు. రైతు బంధు ఆగితే.. ఓట్లు పడయనుకుంటున్నరు. అందరి ఆశీర్వాదంతో బీఆర్ఎస్ విజయం సాధిస్తుంది”అని కేసీఆర్​ అన్నారు. సోమవారం సంగారెడ్డి జిల్లా ఆందోల్, సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లా షాద్ నగర్, చేవెళ్ల సభల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ‘‘కాంగ్రెస్ బక్వాస్ పార్టీ.. అందులో ఉన్నోళ్లందరు దొకేబాజోళ్లు.. తెలంగాణకు ఆ పార్టీ ఎప్పటికీ శాపమే.. ప్రాంతీయ పార్టీలే దానికి బుద్ధి చెబుతాయి’’ అని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. 

కాంగ్రెస్​వస్తే కరెంట్​కోసం గోస పడాల్సి వస్తుందని హెచ్చరించారు. బీఆర్‌ఎస్‌ పార్టీ చరిత్ర అందరికీ తెలుసని, తెలంగాణ సాధన కోసం పుట్టిందని చెప్పారు. కాంగ్రెస్ ​గతంలో తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి తెలంగాణ ఉద్యమాన్ని ఆగం చేయాలని చూసిందని, ఢిల్లీ మెడలు వంచి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని గుర్తు చేశారు. 50 ఏండ్ల కాంగ్రెస్​పాలన ఎలా ఉందో..  బీఆర్‌ఎస్‌ పదేండ్లలో ఏం చేసిందో ప్రజలు ఆలోచించి ఓటు వేయాలన్నారు. రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి రాగానే అసైన్డ్ భూములకు పట్టాలు ఇస్తామని చెప్పారు. ‘‘కాంగ్రెసోళ్లు ఎన్నడన్న దళితబంధు గురించి ఆలోచించారా? మేం దళితబంధు ఇస్తున్నం. ఇప్పటికే కొంతమందికి ఇచ్చినం. ఎన్నికల తర్వాత అందరికీ వస్తది. బీఆర్‌ఎస్‌ మళ్లీ అధికారంలోకి వస్తే అసైన్డ్‌ భూములను గుంజుకుంటదని కాంగ్రెస్​లీడర్లు అంటున్నరు. ఎందుకు గుంజుకుంటం? ఈ పదేండ్లలో గుంజుకున్నమా? తొలి కేబినెట్‌ మీటింగ్​లోనే అసైన్డ్‌ భూములకు పట్టాలిచ్చే పని చేస్తం’’ అని కేసీఆర్​హామీ ఇచ్చారు. షాద్ నగర్ వరకు మెట్రో రైలు పొడిగిస్తామని తెలిపారు. 

 కాంగ్రెస్ వల్లే రైతుబంధు ఆగింది

 రైతుబంధు సాయం కాంగ్రెస్ వారివల్లే ఆగిందని సీఎం కేసీఆర్ విమర్శించారు. రైతుబంధు ఇవ్వొద్దని కాంగ్రెసొళ్లు ఈసీకి లెటర్​రాశారని, రైతుల నోట్ల మట్టి కొడుతున్నారన్నారు. ఉత్తమ్ కుమార్​రెడ్డి రైతుబంధు వేస్ట్​అంటున్నారని, వాళ్లకు చేయడం చేతకాలేదు కానీ ఇస్తామంటే వద్దంటున్నారని మండిపడ్డారు. కేసీఆర్ బతికుండగా రైతుబంధు ఆగదని, బీఆర్ఎస్ మూడోసారి అధికారంలోకి రాగానే  రైతుల అకౌంట్లో డబ్బులు వేస్తామన్నారు. ‘‘కాంగ్రెసోళ్లకు పిచ్చి పట్టుకున్నది. ఒక్క రైతు బంధుతోనే.. ఒక విడత వేస్తేనే మనకు ఓట్లు వస్తాయనుకుంటున్నరు. ఎప్పటిలాగే ఇప్పుడూ వేయాలనుకున్నాం. రైతుబంధు ఇయ్యొద్దని కాంగ్రెసోళ్లు ఈసీకి ఫిర్యాదు చేశారు. రైతు బంధు ఆగితే.. బీఆర్ఎస్​కు ఓట్లు పడయనుకుంటున్నరు. ఎవడో ఎన్కటికి చెప్పిండు.. తొండ మీద ఏందాక? అంటే.. ఎనుగుల దాకా అన్నట్లు. ఎన్నిరోజులు ఆపుతరు? మూడు నాడు ఓట్లు లెక్కపెడితే మన గవర్నమెంట్​మళ్లీ వస్తది. ఆరు తారీఖు నాడు రైతు బంధు ఇచ్చుకుంటం. చేవెళ్ల నుంచి మొత్తం తెలంగాణ రైతాంగానికి చెబుతున్న.. ఎవరూ రంది పడాల్సిన అవసరం లేదు. మళ్లీ వచ్చేది మన గవర్నమెంటే. ఈ దుష్ట, దుర్మార్గ కాంగ్రెస్​శక్తి అంతా మూడో తారీఖు దాకనే ఉంటది”అని కేసీఆర్​ అన్నారు.

చేవెళ్లకు పరిశ్రమలు తెస్తం

హైదరాబాద్​పక్కకే చేవెళ్ల ఉంటదని, గత పాలకులు111 జీవో పెట్టారు కానీ, ప్రజల అవసరాల దృష్ట్యా ఎత్తేసే ప్రయత్నం చేయలేదని కేసీఆర్​అన్నారు. పక్కనే సిటీ, ఎయిర్​పోర్టు ఉన్నాయని, ఈ ప్రాంతానికి ఇండస్ట్రీలు తెచ్చే ప్రయత్నం గతంలో ఎవరూ చేయలేదన్నారు. బీఆర్ఎస్​ పాలనలో షాబాద్,   సీతారాంపూర్ లలో కొత్తగా కంపెనీలు వచ్చాయని, శంకర్ పల్లి మండలం కొండకల్​కు రైల్వే కోచ్​ఫ్యాక్టరీ వచ్చిందని గుర్తు చేశారు. 111 జీవో ఎత్తేశామని, మాస్టర్​ప్లాన్​తయారు చేయాల్సి ఉన్నదని, నెల పదిహేను రోజుల్లో క్లియర్​చేసే బాధ్యత తాను తీసుకుంటానని కేసీఆర్​చెప్పారు. కాలుష్యం లేని కంపెనీలు చేవెళ్ల ప్రాంతానికి తెస్తామని 
హామీ ఇచ్చారు.