గట్టు లిఫ్టు పూర్తయితే గద్వాల వజ్రపుతునక..ఎస్సీ ఆఫీసు ప్రారంభోత్సవంలో సీఎం కేసీఆర్

గట్టు లిఫ్టు పూర్తయితే  గద్వాల వజ్రపుతునక..ఎస్సీ ఆఫీసు ప్రారంభోత్సవంలో సీఎం కేసీఆర్

గద్వాల, వెలుగు:  గట్టు లిఫ్ట్  కంప్లీట్ అయితే గద్వాల వజ్రపు తునకగా మారుతుందని సీఎం కేసీఆర్  చెప్పారు. సోమవారం ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్, ఎస్పీ ఆఫీస్, బీఆర్ఎస్  జిల్లా ఆఫీసును ప్రారంభించారు. ముందుగా టీఆర్ఎస్  ఆఫీసును ప్రారంభించి నేరుగా ఎస్పీ ఆఫీసుకు వచ్చారు. ఎస్పీ ఆఫీసు ఓపెన్ చేసి ఎస్పీ సృజనను సీట్​లో కూర్చోబెట్టారు. అక్కడి నుంచి ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్  చేరుకొని రిబ్బన్  కట్​ చేసి కలెక్టరేట్  చాంబర్​లో ప్రత్యేక పూజలు చేసి కలెక్టర్ వల్లూరు క్రాంతిని సీట్లో కూర్చోబెట్టారు. అనంతరం కలెక్టరేట్ మీటింగ్ హాల్ ఏర్పాటు చేసిన జిల్లా ఆఫీసర్ల మీటింగ్​లో సీఎం మాట్లాడుతూ.. ఆర్డీఎస్ కు తుమ్మిళ్లతో పునరుజ్జీవం పోశాలమన్నారు.

 రాబోయే రోజుల్లో గద్వాల మరింత అభివృద్ధి చెందుతుందని చెప్పారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో అనేక రంగాలలో నెంబర్ వన్ గా ఉన్నామన్నారు. దేశంలోని పెద్దపెద్ద రాష్ట్రాలనే వెనక్కి నెట్టి తెలంగాణ విద్యుత్​ వినియోగం, ఓడీఎఫ్, తాగునీటి రంగాల్లో అగ్రగామిగా ఉందన్నారు. ఇదంతా ఆఫీసర్ల కృషితోనే సాధ్యమైందన్నారు. ప్రజల ఆరోగ్యంతో పాటు ఆర్థికంగా ముందుకు వెళ్లేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. దేశవ్యాప్తంగా 94 లక్షల ఎకరాల్లో ధాన్యం పండిస్తుంటే ఒక తెలంగాణలోనే 56.40 లక్షల ఎకరాల్లో ధాన్యం పండిస్తున్నామని గుర్తు చేశారు. గద్వాలకు, నారాయణపేటకు మెడికల్ కాలేజీ వస్తుందని ఎవరూ ఊహించలేదన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాకు 5 మెడికల్ కాలేజీలు ఇస్తున్నామన్నారు.

21వ ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ 

 రాష్ట్రంలో 33 జిల్లాలను ఏర్పాటు చేసి రూ.1,600 కోట్లతో ఇంటిగ్రేటెడ్ ఆఫీసుల నిర్మాణాన్ని చేపట్టినట్లు చీఫ్  సెక్రటరీ శాంతికుమారి తెలిపారు. ఇప్పటికే 20 ఇంటిగ్రేటెడ్ ఆఫీసులను ఓపెన్  చేసుకోవడం జరిగిందని, గద్వాల 21వ కలెక్టరేట్​ అని గర్వంగా చెప్పవచ్చన్నారు. హోం మినిస్టర్ మహమూద్​అలీ, అగ్రికల్చర్  మినిస్టర్  నిరంజన్ రెడ్డి, ఎక్సైజ్ మంత్రి శ్రీనివాస్ గౌడ్, డీజీపీ అంజన్ కుమార్, రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు పాల్గొన్నారు.