సీఎం కేసీఆర్ కు మిగ్గుడుపడటం లేదు

సీఎం కేసీఆర్ కు మిగ్గుడుపడటం లేదు

కేంద్ర మంత్రి ప్రహ్లాద్ వెంకటేశ్ జోషి

ఘట్​కేసర్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు నేరుగా నిధులు ఇస్తుండడం సీఎం కేసీఆర్ కు మిగ్గుడుపడటం లేదని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ వెంకటేశ్ జోషి చెప్పారు. ఫలితంగా కమీషన్లు రాకపోవడంతో కేంద్రంపై పగ పెంచుకున్నాడని విమర్శించారు. ఘట్​కేసర్ ​మండలం ఏదులాబాద్​లో గురువారం కిసాన్​సమ్మాన్ నిధి లబ్ధిదారులతో నిర్వహించిన సమావేశంలో ప్రహ్లాద్​జోషి పాల్గొని మాట్లాడారు. దేశంలో అవినీతి రహిత పాలన అందించడమే ప్రధాని నరేంద్ర మోడీ లక్ష్యమన్నారు. కేంద్ర పథకాలను రాష్ట్రంలో అమలు చేయకుండా కేసీఆర్ ​తెలంగాణ ప్రజలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారన్నారు. ఫసల్ భీమాను అమలు చేయడంలో నిర్లక్ష్యం చేసిందని చెప్పారు.

ఈ స్కీం కింద రూ.513 కోట్లు ఇచ్చామని తెలిపారు. కిసాన్ సమ్మాన్ నిధితో రాష్ట్రంలో 38 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరిందన్నారు. నేషనల్​హైవేలను శరవేగంగా అభివృద్ధి చేస్తున్నట్లు వివరించారు. తెలంగాణకు రైల్వేశాఖ నుంచి 16 ప్రాజెక్టులు మంజూరు చేస్తే వాటిలో 9 ప్రాజెక్టుల పనులు నడుస్తున్నాయని, మిగతా వాటికి భూమిని కేటాయించలేదన్నారు. పీఎం ఆవాస్​యోజన పథకం కింద రాష్ట్రానికి 2 లక్షల 47 వేల ఇళ్లకు నిధులు మంజూరు చేస్తే 74 వేలు ఇళ్లు మాత్రమే నిర్మించారని చెప్పారు. సమావేశంలో ఘట్​కేసర్ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి, స్థానిక బీజేపీ లీడర్​కోరిమిశెట్టి శ్రావణ్ కుమార్, రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు. అంతకుముందు గ్రామంలోని లక్ష్మీనారాయణ చెరువును కేంద్రమంత్రి సందర్శించారు. శ్రీగోదాదేవి, రంగనాయకస్వామి దేవాలయాలను దర్శించుకున్నారు.