పాలన వదిలేసి.. దుబ్బాకపైనే ఫోకస్

పాలన వదిలేసి.. దుబ్బాకపైనే ఫోకస్

ఎన్నికలు, సెంటిమెంట్, డబ్బు, వలసలు కేసీఆర్ వ్యూహంలో ముఖ్యమైనవి. ఉద్యమ సమయంలోనైనా, అధికారంలోకి వచ్చిన తర్వాతైనా అదే కనపడుతోంది. తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్​ఎస్) ప్రస్థానాన్నిపరిశీలిస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. 2004 జనరల్ ఎలక్షన్ తర్వాత 2006 కరీంనగర్ ఉపఎన్నిక, 2008 బైఎలక్షన్, 2009 జనరల్​ ఎలక్షన్స్, ఆ తర్వాత 2014 ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చేదాకా ఎన్ని ఉపఎన్నికలు జరిగాయో ఒకసారి గుర్తుచేసుకోవాలి. ఉద్యమ సమయంలో కావాలని బైఎలక్షన్లు సృష్టించాడు. ఉపఎన్నికల ద్వారా సెంటిమెంటును రగిలించి ఇతర పార్టీలను ఇరుకున పెట్టి రాజకీయంగా లబ్ది పొందే వ్యూహాన్ని అనుసరించాడు. అధికారంలోకి వచ్చాక అవసరాన్నిబట్టి ఒకవైపు తెలంగాణ సెంటిమెంటును రగిలిస్తూ, మరోవైపు ఏఎన్నికలనైనా డబ్బు ప్రభావంతో గెలుపొందే వ్యూహాన్ని ప్రదర్శిస్తున్నాడు.

2014లో టీఆర్ఎస్ అధికారంలోకి రావడానికి సెంటిమెంటు పనిచేసింది. ఆ తర్వాత జరిగిన ఏ ఎన్నికను పరిశీలించినా డబ్బు ప్రభావం చాలా బలంగా ఉందని అర్థమవుతుంది. మెదక్, వరంగల్ పార్లమెంట్ ఉపఎన్నికలు, జీహెచ్​ఎంసీ, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలు నారాయణఖేడ్, పాలేరు ఉపఎన్నికలు ఇలా ఏ ఎన్నిక చూసినా డబ్బు ప్రభావం ఏ స్థాయిలో ఉందో అందరికీ తెలుసు. ఏ ఎన్నికైనా, చేపలకు ఎర వేసి పట్టుకున్నట్లు ప్రజలను మద్యంలో ముంచెత్తి, డబ్బు విచ్చలవిడిగా పంచి ఓటర్లను ఓట్లు వేసే యంత్రాలుగా మార్చుకొంటారు. రాజకీయ వలసలను విపరీతంగా ప్రోత్సహించి డబ్బు, పదవి ఆశ చూపించి లేదా బెదిరించి ఇతర పార్టీల వారిని టీఆర్ఎస్​లో చేర్చుకుంటారు. తద్వారా ప్రత్యర్థి పార్టీని బలహీనపర్చాలి. వారి క్యాడర్​లో నిరాశానిస్పృహలను నింపాలి. ఎన్నికలైన తర్వాత వారిని పట్టించుకున్నదీ లేదు. అందుకు కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్​లో చేరిన డీఎస్, టీడీపీ నుంచి చేరిన మండవ వెంకటేశ్వరరావులాంటి వాళ్లు చాలామందే ఉన్నారు. ఎలా గెలిచాం అనేది ముఖ్యం కాదు. అడ్డమైన గడ్డి తినైనా సరే గెలిచామా? లేదా? అనేదే ముఖ్యం. గెలవడం ఇంపార్టెంట్, గెలవడం ద్వారా ప్రజలు తమతో ఉన్నారనిపించుకోవాలి. పార్టీ నాయకులతో కేసీఆర్ అనే మాట ఇది.

ఆ డబ్బంతా ఎక్కడిది?

2018 ఎలక్షన్స్ నాటికి టీఆర్ఎస్​కు అసాధారణ స్థాయిలో డబ్బు వచ్చిపడింది. అంత డబ్బు ఎలా వచ్చిందో, దేని ద్వారా వచ్చిందో ప్రజలందరికీ తెలుసు. అసెంబ్లీ ఎన్నికల కోసం ఖర్చు చేయడమే కాదు, ఆ తర్వాత పార్లమెంటు ఎన్నికల్లో కూడా భారీగా ఖర్చు చేశారు. అంతేకాదు పార్లమెంటు ఎన్నికల సందర్భంగా నాలుగైదు రాష్ట్రాలకు ఎన్నికల ఫండింగ్ చేశాడనే ప్రచారం కూడా ఉంది. బీజేపీ- టీఆర్ఎస్​కు అక్కడే చెడిందనే ప్రచారం కూడా లేకపోలేదు. నేను, నా మంత్రులు కడుపుకట్టుకొని, నోరుమూసుకొని అవినీతి లేకుండా పాలన చేస్తున్నామని కేసీఆర్ పదేపదే చెబుతుంటాడు. అదే నిజమైతే ఇన్ని ఎన్నికల్లో కొట్లాడడానికి, పెద్ద మొత్తంలో ఖర్చు చేసి గెలవడానికి డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాలి. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులందరికీ పార్టీనే డబ్బు పంపిందనేది బహిరంగ రహస్యం. సగటున 10 కోట్ల నుంచి 12 కోట్ల దాకా కేసీఆర్​ పంపినట్లు పార్టీ క్యాడరే మాట్లాడుకుంది. ఇంత డబ్బు ఎక్కడ నుంచి వచ్చింది. అంతేకాదు అధికారాన్ని, పోలీసులను అడ్డం పెట్టుకొని తమ పార్టీ డబ్బులు క్షేత్రస్థాయికి చేరడానికి అన్ని చర్యలు తీసుకొని, ప్రతిపక్షాల డబ్బులు కిందకు చేరకుండా పకడ్బందీగా పోలీసులను ఉపయోగించి అడ్డుకోగలిగారు. అలా అన్ని ఎన్నికల్లో గెలిచి ప్రజలు మాతో ఉన్నారు.. ప్రతిపక్షాలతో లేరు.. మా పాలనను ప్రజలు అంగీకరిస్తున్నారు చూడండని వాదించడం కేసీఆర్​కు అలవాటైంది.

ఎలాగైనా గెలవాలని..​

దుబ్బాక ఎన్నికలో కూడా ఎంత ఖర్చయినా గెలవాలనే వ్యూహంతో ముందుకుపోతున్నట్లు కనపడుతోంది. ఇతర పార్టీల వారిపై సామ, దాన, బేధ, దండోపాయాలు ఉపయోగించి తమ పార్టీలో చేర్చుకుంటున్నారు. సంక్షేమ పథకాలే మాకు శ్రీరామరక్ష, కేసీఆర్​ పాలనను చూసి ప్రజలు ఓట్లేస్తారుఅనే టీఆర్ఎస్ నాయకులు ఎందుకు విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేస్తున్నారు. కేసీఆర్​ పాలనను పక్కన పెట్టి దుబ్బాక మీదే ఎందుకు ఫోకస్​ పెట్టినట్లు. హైదరాబాద్ వరదలతో అతలాకుతలం అయితే కనీసం నగరంలో పర్యటించకుండా దుబ్బాక మీద రాత్రిపగలు హరీశ్​రావుకు డైరక్షన్ ఇస్తూ ఎందుకు శ్రమిస్తున్నట్లు? ఇతర పార్టీల కింది స్థాయి నేతలకు నేరుగా కేసీఆర్ ఫోన్ చేసి పార్టీలో చేరమని ఎందుకు అడుగుతున్నట్లు. ఏ మాత్రం ఫలితం తారుమారైనా తన మనుగడకు ముప్పు తప్పదని భావించాడు కనుకే, ఎక్కడో ఫలితం మీద అనుమానం ఉంది కాబట్టే, పాలన పక్కనపెట్టి ప్రజలను గాలికి వదిలేసి దుబ్బాక ఎన్నిక ముఖ్యమని భావించినట్లు కనపడుతోంది. ఒకవైపు అకాల వర్షాలకు పంటలు నష్టపోయి రైతులు లబోదిబోమని ఏడుస్తుంటే కేసీఆర్​కు చీమకుట్టినట్లు లేదు. పాలకుడికి ప్రజలు ముఖ్యం కావాలి తప్ప, ఎన్నిక కాదు.  మీరు ప్రజల విశ్వాసాన్ని సాధించడం మానేసి డబ్బు, వలసలు, అధికార దుర్వినియోగం మీద ఆధారపడి గెలవాలనుకుంటున్నారు, కనుక అడ్డమైన అగచాట్లు పడుతున్నారు.

భూములు గుంజుకుంటున్నారు

దుబ్బాక అభివృద్ధి మాట అలా ఉంచితే.. ప్రాజెక్టుల పేరుతో బలవంతంగా పేద రైతుల భూములను అదిరించి, బెదిరించి అడ్డికి పావుశేరు అన్నట్లుగా గుంజుకుంటున్నారు. సిద్దిపేట, గజ్వేల్​లో భూములు కోల్పోయిన వారికి ఇస్తున్న నష్టపరిహారానికి దుబ్బాకలో భూములు కోల్పోయిన వారికి ఇస్తున్న నష్ట పరిహారాన్ని నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఇది వివక్ష కాదా? పంటలు చేతికి వచ్చేసరికి వర్షాలకు నీటమునిగి నష్టం వస్తే రైతులను పలకరించిన నాథుడే లేడు. ఎల్​ఆర్​ఎస్​ పేరు మీద, నిజాం నవాబు శిస్తు వేసినట్లు నయా నిజాం కేసీఆర్​ ప్రజలు కష్టపడి కొనుక్కున్న భూములకు ట్యాక్స్​లు కట్టించుకుని ప్రజల పాలిట గుదిబండగా మారాడు. దుబ్బాకలో ఎంత డబ్బు అయినా ఖర్చు చేసి గెలవాలని చూస్తున్నాడు. ఇంతకన్నా సిగ్గుచేటు ఏముంటుంది.  “కన్నతల్లికి అన్నం పెట్టనోడు పినతల్లికి బంగారు గాజులు చేయిస్తా అన్నాడంట” తరుచూ సభల్లో కేసీఆర్​ అనే ఈ మాట ఇప్పుడు ఆయన​కు, హరీశ్​రావుకు వర్తిస్తుంది. ఎందుకంటే రామలింగన్న బతికి ఉన్నంత కాలం నియోజకవర్గం అభివృద్ధికి నిధులు ఇవ్వని వీరు, సుజాత గెలిస్తే ఇస్తామని, దుబ్బాకను అభివృద్ధి చేస్తామంటే నమ్మాలా? రామలింగన్నను తన గడీలో ఒక గొర్రెని కట్టేసుకున్నట్లు కట్టేసుకున్న కేసీఆర్.. అమాయకమైన సుజాత ప్రజల ప్రక్షాన ప్రశ్నించలేదు సమస్యల సాధన కోసం పోరాటం చేయలేదని ప్రజలు గుర్తించారు. కేసీఆర్​ మాటల్లో చెప్పాలంటే టీఆర్ఎస్​కు కర్రుకాల్చి వాత పెట్టడానికి ప్రజలు సిద్ధమయ్యారు.

దుబ్బాకలో ఎందుకు  అభివృద్ధి జరగలేదు

దుబ్బాక నియోజకవర్గం చుట్టూ ఉన్న సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్​ నియోజకవర్గాల్లో జరిగిన అభివృద్ధి దుబ్బాకలో ఎందుకు జరగలేదు? కేసీఅర్ ఆయన కుటుంబ సభ్యులు ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గాలకు పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసుకుంటూ, ఇతరులు ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గాలకు అరకొరగా నిధులు ఇస్తారని అర్థం అవుతోంది. ఇప్పుడు సీడీఎఫ్​ ఫండ్స్​ లేవని చేతులెత్తేశారు. అంటే భవిష్యత్​లో నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు ఇవ్వలేమని సీఎం కేసీఅర్ ఇటీవల ప్రగతిభవన్​లో జరిగిన ఆరు జిల్లాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సమావేశంలో తేల్చిచెప్పారు. ప్రతిపక్షాలు గెలిస్తే అభివృద్ధి జరగదని చెప్పే హరీశ్​రావు.. రామలింగారెడ్డి ఉన్నప్పుడు ఎందుకు దుబ్బాక అభివృద్ధికి నోచుకోలేదో చెప్పాలి. సుజాత గెలిస్తే తాను బాధ్యత తీసుకుని దుబ్బాకను అభివృద్ధి చేస్తానంటున్న హరీశ్​.. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉమ్మడి మెదక్​ జిల్లా మంత్రిగా ఉంటూ ఎందుకు అభివృద్ధి చేయలేదో కూడా సమాధానం చెప్పాలి. అంటే ఇప్పటిదాకా మీ నియోజకవర్గం, మీ మామ నియోజకవర్గం మాత్రమే అభివృద్ధి చేసుకున్నామని అంగీకరిస్తారా? -డాక్టర్ శ్రవణ్ దాసోజు, జాతీయ అధికార ప్రతినిధి, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ.

For More News..